సంక్షేమ హాస్ట‌ళ్ల‌ను బాగు చేయండి బాబూ

నాణ్య‌త లేని ఆహారం!

పాములు, తేళ్ళతో సహవాసం!!

శిధిలావస్థలో భవనం!

వర్షం పడితే షాక్ కొడుతున్న వైనం!!

ఇదీ తణుకులోని హాస్టళ్ల దుస్థితి

వైయ‌స్ఆర్‌ స్టూడెంట్స్ యూనియన్ హాస్టళ్ల బాటలో వెలుగు చూసిన వాస్తవాలు

సత్వరమే సంస్కరించాలని రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్

త‌ణుకు: రాష్ట్రంలో అధ్వాన్న స్థితికి చేరిన సంక్షేమ హాస్టళ్లను సత్వరమే సంస్కరించాలని వైయ‌స్ఆర్‌ స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య డిమాండ్ చేశారు. కనీస మౌలిక సదుపాయాల కల్పనతో పాటు విద్యార్థులు ప్రశాంతంగా చదువుకునేందుకు తగిన వాతావరణం ఉండేలా చర్యలు చేపట్టాలని కోరారు.

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమ హాస్టళ్ల బాట కార్యక్రమంలో భాగంగా బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు అభిషేక్ ఆధ్వర్యంలో తణుకులోని ఎస్సీ బాలికలు, బీసీ బాలుర హాస్టళ్లను పానుగంటి చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్సీ బాలికలు దోమలతో, బీసీ బాలురు పాములు, తేళ్ళతో సహవాసం చేస్తున్న చేదు నిజాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. బీసీ బాలురు శిధిలావస్థకు చేరిన భవనంలో అది ఎప్పుడు కూలుతుందో అన్న ఆందోళనలో బతుకుతున్న వైనాన్ని ఆయన గుర్తించారు. అంతే కాక వర్షం కురిసే సమయంలో ఆ హాస్టళ్లో ఎక్కడ పట్టుకున్నా షాక్ కొడుతుందని కొందరు విద్యార్థులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇటీవలే ఒక విద్యార్ధిని తేలు కరిచిందని తెలిపారు. పాచిపెట్టిన భోజనం పెడుతున్నా సహించామనీ.. పాములు, తేళ్ళతో కరిపించుకోమంటే మాత్రం తమ వల్ల కాదనీ.. విద్యార్థులు తేల్చి చెప్పారు.

స్వీయ పరిశీలన, విద్యార్థుల నుంచి సమగ్ర సమాచారం తెలుసుకున్న తర్వాత పానుగంటి చైతన్య మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల అవస్థలు, ఆందోళన స్వయంగా చూసి తక్షణమే దిద్దుబాటు చర్యలు చేపట్టాలని సూచించారు. కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవంతి స్థానంలో నూతన భవనాన్ని నిర్మించాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం జరిగినా అందుకు కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో వైయ‌స్ఆర్‌ స్టూడెంట్స్ యూనియన్ తణుకు నియోజకవర్గ అధ్యక్షుడు పాల్, రీజనల్ కో ఆర్డినేటర్ రమేష్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాహుల్, జిల్లా ఉపాధ్యక్షుడు సూర్య తదితరులు పాల్గొన్నారు.

Back to Top