విజయవాడ: ఆగస్టు 10వ జరగబోయే స్థానిక సంస్థల ఉప ఎన్నికలకు ఆన్‌లైన్ నామినేషన్లు అనుమతించాలని వైయస్ఆర్‌సీపీ నేతలు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కోరారు. వచ్చే నెలలో జరుగబోయే ఉప ఎన్నికు సంబంధించి వైయస్ఆర్‌సీపీ నేతల బృందం.. గురువారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని కలిసింది. రాష్ట్ర ఈసీని కలిసిన వైయస్ఆర్‌సీపీ నేతల్లో గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్‌లు ఉన్నారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఉప ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలని ఈసీకి వినతిపత్రం సమర్పించారు. ఈసీని కిలిసిన అనంతరం గడికోట శ్రీకాంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్ష నేతల పర్యటనలను అడ్డుకుంటున్నారు. ముళ్ల కంచెలు, బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నారు. తిరుపతి,తిరువూరు,కుప్పం వంటి మున్సిపల్ బై ఎలక్షన్స్ లో దుర్మార్గంగా వ్యవహరించారు. ఆగస్ట్ 10న జరగబోయే ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించాలి. ఎన్నికలకు పటిష్టమైన భద్రత కల్పించాలి. సిసి కెమెరాల నిఘా మధ్య ఎన్నికలు జరిపించాలి. నామినేషన్లు వేయకుండా టిడిపి నేతలు బెదిరిస్తున్నారు. ఆన్ లైన్ నామినేషన్లకు అనుమతించాలని కోరాం’ అని ఆయన స్పష్టం చేశారు.