తాడేపల్లి: పాత్రికేయ ప్రమాణాలకు పూర్తిగా తిలోదకాలు ఇచ్చిన ఈనాడు పత్రిక ఎదుగుదల అంతా నేరమయమేనని వైయస్ఆర్‌సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ కారుమూరు వెంకటరెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈనాడుకు ఆర్థికంగా వెన్నెముకగా నిలిచిన మార్గదర్శి చిట్‌ఫండ్స్ వాటాలను జీజే రెడ్డి వారసులను తుపాకీతో బెదిరించి చెరుకూరి రామోజీరావు కాజేసిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో రామెజీరావు, ఆయన కోడలు శైలజా కిరణ్‌లపై నమోదైన ఎఫ్‌ఐఆర్ నిదర్శమని అన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, తెలుగుదేశం రాజకీయ ప్రయోజనాలే అజెండాగా ఈనాడు పత్రిక నిస్సిగ్గుగా పనిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరుకూరి కిరణ్ మీడియా ముసుగులో నిత్యం వైయస జగన్‌పై విషం చిమ్మడమే తన లక్ష్యంగా ఏ మాత్రం విలువలు లేకుండా 'ఈనాడు' పత్రికను నడుపుతున్నారని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే.... ఆంధ్రప్రదేశ్‌లో ఎల్లో మీడియా పేట్రేగిపోతోంది. రామోజీరావు చనిపోయినా ఆయన కొడుకు చెరుకూరి కిరణ్ కూడా తండ్రి బాటలోనే చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలు కాపాడేందుకు, వైయస్ జగన్ మీద విషం కక్కేందుకే తన పత్రికను నడుపుతున్నారు. ఈరోజు ఈనాడు పత్రికలో మద్యం సీసాలో వైకాపా మాఫియా అంటూ పచ్చి అబద్ధాలతో కూడిన వార్తను మొదటి పేజీలో బ్యానర్ గా అచ్చేశారు. గురివిందగింజకు కిందున్న నలుపు తెలియనట్టు, రామోజీకి తుపాకీలతో బెదిరించి ఆస్తులు లాక్కునే అలవాటుంటే అందరూ అదే నేరాలు చేస్తారని నేర మనస్తత్వంలో ఆలోచిస్తున్నారు. తుపాకీలతో బెదిరించి మార్గదర్శి చిట్‌ఫండ్ షేర్లను అక్రమంగా లాక్కున్న అనుభవం రామోజీకే ఉంది. స్వగృహ ఫుడ్స్ గురించి తప్పుడు వార్తలు రాసి ప్రియ పచ్చళ్లను ప్రమోట్ చేసుకున్న నీచ చరిత్ర ఈనాడుది. అందరూ రామోజీ, ఆయన కుమారుడిలాగే ఉంటారనుకోవడం, తమలాగే అక్రమార్కులన్నట్టు సమాజానికి పరిచయం చేయాలనేది ఈనాడు తపనలా కనిపిస్తుంది. రోజూ జగన్ మీద విషం చిమ్మడం, ఆయన్ను రాష్ట్ర ప్రజల ముందు దోషిగా చూపించడమే ఈనాడు లక్ష్యం. ఈ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిజం చేస్తున్నారు. దీనికి మద్దతుగా చంద్రబాబు ప్రోత్సహాంతో లక్షల్లో యూట్యూబ్ ఛానెళ్లు, వేలల్లో పెయిడ్ వెబ్‌సైట్లు, పదుల సంఖ్యలో టీవీలు, పేపర్లు అడ్డం పెట్టుకుని ఎల్లో మీడియా బురదజల్లడమే, విషం చిమ్మడమే పనిగా పెట్టుకుంది. మార్గదర్శి వాటాల కోసం కరడుగట్టిన నేరస్తుల్లా వ్యవహరించారు చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు అనే వ్యక్తి కమ్యూనిస్ట్ నాయకుడు కొండపల్లి సీతారామయ్య గారి సిఫార్సులతో జీజే రెడ్డి కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరిన రెండేళ్లలోనే మార్గదర్శి చిట్‌ఫండ్ అనే కంపెనీని మొదలుపెడుతున్నానని చెప్పి జీజే రెడ్డితో కొంత డబ్బు రామోజీరావు పెట్టుబడిగా పెట్టించాడు. జీజే రెడ్డి అప్పటికే ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు. ఆయనకు అనేక కంపెనీలు ఉండేవి. జెకోస్లేవేకియా అనే దేశంలో నివసిస్తూ అక్కడే చనిపోయారు. జీజే రెడ్డి చనిపోయాక ఆయన కొడుకు వచ్చి మార్గదర్శిలో పెట్టుబడిగా పెట్టిన 268 షేర్లకు సంబంధించి డబ్బులు ఇవ్వమని అడిగితే రామోజీరావు వారిని రూమ్‌లో కూర్చోబెట్టి తుపాకీ చూపించి చంపేస్తామని బెదిరించి సంతకాలు తీసుకున్నాడు. దీనికి సంబంధించి ఆయన పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్‌లో ఏ1గా రామోజీరావు, ఏ2గా శైలజా కిరణ్ ఉన్నారు. ఇంత నీచ చరిత్ర పెట్టుకుని వారేదో నీతిమంతులైనట్టు ఇతరుల గురించి ఈనాడు కిరణ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రామోజీ ఫిలిం సిటీ పేరుతో పేద రైతుల భూములు ఆక్రమించి, అటు నుంచి పక్క గ్రామాలకు ప్రజలను వెళ్లనీయకుండా ఇప్పటికీ అడ్డుకుంటున్నారు. ఇవన్నీ ఈనాడులో రాయొచ్చు కదా? ఎంతసేపటికీ జగన్ మీద, ఆయన కుటుంబం మీద బురదజల్లడం దేనికి? రాయాల్సింది మద్యం సీసాలో వైకాపా మాఫియా అని కాదు.. చంద్రబాబు కోసం నగ్నంగా గుడ్డలిప్పదీసుకుని నిలబడ్డ ఈనాడు అని రాయాలి. చంద్రబాబు కోసం జర్నలిజం ముసుగులో ఏ పనైనా చేయడానికి సిద్ధమైపోయిన ఈనాడు సమాజానికి నీతులు చెప్పడం తెలుగు ప్రజల దౌర్భాగ్యం. ఎస్పీలు, తహసీల్దార్లు పాస్‌పోర్టు వెరిఫికేషన్ కి వెళ్తారా? ఈరోజే మరో వార్తలో మోనికా బేడీకి పాస్‌పోర్ట్.. కృష్ణమోహన్‌రెడ్డి తహసీల్దార్‌గా ఉన్నప్పుడే జారీ అంటూ ఈనాడు మొదటి పేజీలోనే రాశారు. ఓయస్డీ కృష్ణమోహన్‌రెడ్డి ఫొటో పక్కనే మోనికా బేడీ ఫొటో వేసి వార్తను అచ్చేశారు. అదే టైంలో కర్నూలు ఎస్పీగా పీఎస్ఆర్ ఆంజనేయులు ఉన్నారని రాశారు. ఆయన తహసీల్దార్‌గా ఉన్న సమయంలో రెసిడెన్స్ సర్టిఫికెట్ జారీ అయితే ఆయనకేం సంబంధం? ఆయనేమన్నా వారింటికి పోయి తనిఖీ చేసి సర్టిఫికెట్ ఇచ్చారా? బురదచల్లేందుకు ఇంతగా దిగజారిపోయి తప్పుడు వార్తలు రాయాలా? ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో పాస్ పోర్టు వెరిఫికేషన్ కోసం ఎస్పీలు వెళ్తున్నారా? చంద్రబాబు లాంటి ప్రపంచశ్రేణి నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మోనికా బేడీకి నకిలీ పాస్‌పోర్ట్ వచ్చిందని కదా రాయాల్సింది? అరకొర జ్ఞానంతో ఇలాంటి అర్థం పర్థంలేని వార్తలు రాసి సమాజాన్ని ఏం ఉద్దరిద్దామని అనుకుంటున్నారు. పైగా ఇదే వార్తలో క్షేత్ర స్థాయి తనిఖీ అధికారులిచ్చిన నివేదిక ఆధారంగానే పాస్‌పోర్ట్ జారీ చేశారని వాళ్లే రాశారు. అలాంటప్పుడు హెడ్డింగ్‌లో ఎందుకిలా విషం కక్కడం? తప్పు ఎవరిదో మీకు తెలిసి కూడా వారిద్దర్నీ బాధ్యులను చేస్తూ వార్తలు రాయడం ఏంటి? మార్గదర్శిలో అక్రమాల విచారణ సందర్భంగా నా తండ్రి చెరుకూరి రామోజీరావు చేసిన అవినీతికి నాకు సంబంధం లేదని చెరుకూరి కిరణ్ ఎందుకు జారుకున్నారు? మీరు కదా బాధ్యత వహించాల్సింది? రాష్ట్రానికి చంద్రబాబు తీసుకొచ్చింది మద్యం బ్రాండ్లే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైయస్ జగన్ ప్రారంభించిన కంపెనీలకే మళ్లీ శంకుస్థాపనలు చేసి వారే తెచ్చినట్టు కలరింగ్ ఇచ్చుకుంటున్నారు. ఆయన సెకీతో కుదుర్చుకున్న ఒప్పందం మీద బురదజల్లారు. ఏ విషయంలోనూ వైయస్ జగన్ కన్నా గొప్పగా పాలన చేయడం చంద్రబాబుకు చేతకావడం లేదు. రాష్ట్రానికి పారిశ్రామిక వేత్తలు ముఖం చాటేశారు. ప్రతి మంగళవారం అప్పులు తెచ్చుకోవడం తప్ప, అభివృద్ధి కనిపిండం లేదు. జనం సంక్షేమ పథకాల గురించి అడుగుతుంటే సమాధానం చెప్పుకోలేక కూటమి నాయకులు ప్రజల్లో తిరగడమే మానేశారు. ఇలాంటి వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైయస్ జగన్ మీద, వైయస్ఆర్‌సీపీ మీద బురదజల్లడమే పనిగా పెట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మద్యం కుంభకోణం మీద అక్రమ అరెస్టులు చేయడమే తప్ప, ఒక్క దానికీ ఆధారం చూపించలేకపోయారు. జరగని కుంభకోణం జరిగినట్టు వాంగ్మూళాలు సృష్టించి అక్రమ అరెస్టులు చేస్తున్నారు. డిస్టిలరీలన్నింటికీ అనుమతులిచ్చింది చంద్రబాబు కాదని రాసే దమ్ము ఈనాడు పత్రికకు ఉందా? ఊరూపేరూ లేని బ్రాండ్లు తెచ్చి మందుబాబుల ఆరోగ్యం నాశనం చేస్తున్నాడు. 11 నెలల పాలనలో చంద్రబాబు తెచ్చిన కంపెనీలు చూస్తే.. సుమో బ్రాండ్ విస్కీ, షాట్, బెంగళూరు విస్కీ, బెంగళూరు బ్రాందీ, కేరళ విస్కీ, రాయల్ లాన్సర్ విస్కీ, బ్రాందీ 99, ఓల్డ్ క్లబ్, చాంపియన్ స్పెషల్ విస్కీ, గుడ్ ఫ్రెండ్స్.. ఇవన్నీ మద్యం బ్రాండ్లు.. వైయస్ జగన్ పాలనలో నాడు నేడు ద్వారా స్కూళ్లు, ఆస్పత్రులను బాగు చేశారు. గ్రామాల్లో సచివాలయాలు, ఆర్బీకే సెంటర్లు, విలేజ్ క్లీనిక్‌లు తీసుకొస్తే.. చంద్రబాబు వీధివీధికి బెల్ట్ షాపులు తీసుకొచ్చాడు. పవిత్ర పుణ్యక్షేత్రాలను కూడా వదలడం లేదు. చంద్రబాబు అనుసరించిన విధానాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 3 వేల కోట్లకుపైనే నష్టం జరిగింది. మద్యం డిస్టిలరీలకు, మద్యం షాపులకు సంపద సృష్టిస్తున్నాడు.