కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలనను సాగిస్తోంది

ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలని చూస్తోంది

దానిలో భాగంగానే లేని లిక్కర్ స్కామ్‌ను సృష్టించింది

వైయస్ జగన్‌కు సన్నిహితులైన వారిని ఈ స్కామ్‌ పేరుతో అరెస్ట్‌లు చేస్తోంది

రాబోయేది వైయస్ జగన్ ప్రభుత్వమే

ఈరోజు చేస్తున్న తప్పులకు రేపు మూల్యం చెల్లించుకోక తప్పదు

మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆగ్రహం

నరసరావుపేట: ఏపీలో కూటమి ప్రభుత్వం ఫ్యాక్షన్ పాలనను సాగిస్తోందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. నరసరావుపేట క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేయాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు వ్యవరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దానిలో భాగంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని లేని లిక్కర్‌ స్కామ్‌లను సృష్టించి అక్రమ అరెస్ట్‌లకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. వైస్ జగన్ సన్నిహితులపై తప్పడు కేసులు బనాయించి, భయపెట్టాలని అనుకోవడం చంద్రబాబు అవివేకమని అన్నారు. రాబోయేది వైయస్ జగన్ ప్రభుత్వమేనని, ఈ రోజు తప్పు చేస్తున్న ప్రతి ఒక్కరూ రేపు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. 

ఇంకా ఆయనేమన్నారంటే..

ఏపీ రాజకీయాలను చూస్తే ప్రభుత్వం కొనసాగిస్తున్న అధికార దుర్వినియోగం, అకృత్యాలు, అరాచకాలే కనిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వపరంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులపై అధికారాన్ని అడ్డం పెట్టుకుని కక్షసాధింపు చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రతిపక్ష నాయకుడిని అణచివేయాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయించడం, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపడం, ఆఖరికి గత ప్రభుత్వంలో పనిచేసిన ఐఎఎస్, ఐపీఎస్ అధికారులపైన కేసులు పెట్టించి, జైలు పాలు చేయాలనే దుర్మార్గమైన విధానాన్ని అమలు చేస్తున్నారు. ఏడాది పాలనలో ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయడం చేతకాక, మళ్ళీ వైయస్ జగన్ ప్రజాభిమానంతో అధికారంలోకి వస్తారనే భయంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. తెలుగుదేశంకు అనుకూలంగా వ్యవహరించే ఛానెల్ లోనే ప్రతిపక్షనేతకు ప్రజల్లో ఆదరణ విపరీతంగా పెరుగుతోందని అంగీకరించింది. దీనిని తట్టుకోలేక వైయస్ఆర్‌సీపీ అంటేనే చాలు ఎలా కేసులు పెట్టాలా అనే ఆలోచనలతో చంద్రబాబు ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్‌కు పట్టిన గతే కూటమిపార్టీలకు పడుతుంది

వైయస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు పనిచేసిన ఐఎఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిలకు సంబంధం లేని లిక్కర్ స్కామ్‌లో దోషులుగా చూపి, వారిని అరెస్ట్ చేశారు. పోలీసులే పచ్చచొక్కాలు వేసుకున్న కార్యకర్తల మాదిరిగా సీఎంఓ నుంచి చెప్పినట్లుగా ఎవరిని పడితే వారిని తప్పుడు కేసులతో అరెస్ట్‌లు చేస్తున్నారు. కనీస ఆధారాలు ఉన్నాయా అని న్యాయస్థానాలు అడిగితే పోలీసులు నీళ్ళు నములుతున్నారు. లిక్కర్ స్కామ్‌ పేరుతో చేస్తున్న హంగామా చూస్తూ ఏకంగా వైయస్ జగన్ గారినే అరెస్ట్ చేస్తారనే విధంగా ఒక తప్పుడు ప్రచారంకు తెగబడ్డారు. గతంలో వైయస్ జగన్ కాంగ్రెస్‌ను వ్యతిరేకించి పార్టీ పెట్టుకుంటే ఆయనపై తప్పుడు కేసులు పెట్టి, పదహారు నెలలు జైలుకు పంపారు. దానికి ఫలితంగా అదే కాంగ్రెస్‌ పార్టీ ఏపీలో కనుమరుగు అయ్యింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా ఇదే విధంగా వ్యవహరిస్తోంది. కూటమి పార్టీలకు కూడా రేపు కాంగ్రెస్‌కు పట్టిన గతే పడుతుంది. 

నేడు కూటమి పార్టీల చేతుల్లోనే మద్యం విక్రయాలు

వైయస్ జగన్ హయాంలో విక్రయించిన బ్రాండ్లనే నేటికీ విక్రయిస్తున్నారు. కొత్తగా మరో రెండుమూడు చేర్చారు. గతంలో కంటే ఎక్కువ ధరకే నేడు ప్రభుత్వం మద్యం విక్రయిస్తోంది. గత ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధం లేకుండా ప్రభుత్వమే మద్యం విక్రయాలు చేసింది. పార్టీ నాయకుడికీ దీనితో సంబంధం లేకుండా మద్యం పాలసీని అమలు చేశారు. ఇప్పుడు కూటమి పార్టీలకు సంబంధం లేకుండా మద్యం దుకాణాలు నడుస్తున్నాయా? ప్రధానంగా తెలుగుదేశం పార్టీలకు చెందిన నాయకుల చేతుల్లోనే మద్యం దుకాణాలు, విక్రయాలు జరుగుతున్నాయి. అలాంటప్పుడు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీల నేతల మీద ఎన్ని కేసులు ఉంటాయో అర్థమవుతోందా? వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఇలాంటి తప్పుడు కేసులను ఎదుర్కొంటాం. తెలుగుదేశం ఎల్లప్పుడు అధికారంలో ఉంటుందా? టీడీపీ ప్రతిపక్షంలోకి వెళ్ళలేదా? వచ్చే నాలుగేళ్ల తరువాత జరిగే ఎన్నికల్లో వైయస్ జగన్ అఖండ మెజార్టీతో గెలుస్తారు. ఈరోజు అన్యాయంగా కేసులు పెట్టించిన నేతలను, పెట్టిన అధికారులను వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఒక సినీనటిని పిలిచి ఐపీఎస్ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేయించి, కేసులు పెట్టారు. రేపు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే, అదే సినీనటి తనను బెదరించి తప్పుడు ఫిర్యాదులు చేయించారని చెబితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు?

రాష్ట్రంలో పాలన పక్కదోవ పట్టింది

కూటమి ఏడాది పాలన పూర్తిగా పక్కదోవ పట్టింది. వైయస్ఆర్‌సీపీ హయాంలో ప్రతినెలా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ అయ్యాయి. అంతకంటే ఎక్కువ ఇస్తారనే భ్రమతో తెలుగుదేశం, కూటమి పార్టీలకు ఓటు వేసి మోసపోయామని ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ఈ ఏడాది పాలనలో ఒక్క హామీని కూడా కూటమి ప్రభుత్వం అమలు చేయలేదు. ప్రజల్లో ప్రభుత్వం పట్ల తీవ్ర వ్యవతిరేకత పెరుగుతోంది. మరోవైపు వైయస్ఆర్‌సీపీకి ప్రజల్లో ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. దీనిని చూసి తట్టుకోలేకే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం చేసే ఈ బెదిరింపులకు భయడేదే లేదు. సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లపై ఎంత దారుణంగా ఒకటి కంటే ఎక్కువ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన సోషల్ మీడియా యాక్టివీస్ట్‌లు నేటికీ ఎటువంటి పోస్ట్‌లు పెడుతున్నారో తెలియదా? వారిమీద ఒక్క కేసు అయినా నమోదు చేస్తున్నారా? రేపు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పడితే వారిని ఉపేక్షిస్తారా? కూటమి ప్రభుత్వం చూపుతున్న బాటలోనే రాబోయే వైయస్ఆర్‌సీపీ కూడా పనిచేయదని అనుకుంటున్నారా అని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డ ప్రశ్నించారు.

Back to Top