తాడేపల్లి: సీఎం చంద్రబాబు చేతుల్లో రాజకీయ కీలుబొమ్మలా వైయస్ వివేకా కుమార్తె సునీతమ్మ మారిపోయారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు మేరుగు నాగార్జున మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఎప్పుడు కడప జిల్లాలో ఏ ఎన్నిక జరుగుతున్నా సునీతమ్మను చంద్రబాబు తన రాజకీయ ప్రయోజనాల కోసం రంగంలోకి తీసుకువస్తుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా పులివెందుల నియోజకవర్గంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీకి ఓటమి తప్పదని గ్రహించడంతో సునీతమ్మను తీసుకువచ్చి వైయస్ఆర్‌సీపీపై బుదరచల్లించే వ్యూహాన్ని చంద్రబాబు అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వివేకా హత్య కేసులో హంతకుడు దస్తగిరికి, చంద్రబాబుకు న్యాయవాది ఒక్కరేననే విషయం తెలిసి కూడా ఈ కుట్రను ఆమె గ్రహించలేకపోతోందా? వైయస్ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా, వ్యక్తిత్వపరంగా నాశనం చేయాలనే లక్ష్యంతోనే ఇలా చేస్తున్నారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఆనాడు ఎన్టీ రామారావును వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి చంద్రబాబు తప్పుడు పద్దతుల్లోనే రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు. కడప జిల్లాలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వివేకానందరెడ్డి కుమార్తె సునీతమ్మ, ఆమె భర్తను రంగంలోకి దింపి, వైయస్ఆర్‌సీపీపై తప్పుడు ప్రచారం చేయించడం చంద్రబాబుకు అలవాటుగా మారింది. తాజాగా జిల్లాలో జరుగుతున్న స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంలోనూ ఒకవైపు వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై చంద్రబాబు ప్రోత్సాహంతోనే టీడీపీ గూండాలు భౌతిక దాడులకు దిగి, భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. పోలీసులు ఈ దాడులపై ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారు. మరోవైపు వివేకానందరెడ్డి కుమార్తె సునీత దంపతులను మరసారి రంగంలోకి దింపి రాజకీయంగా ప్రయోజనం పొందేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వివేకా హంతకులకు టీడీపీ అండదండలు వివేకాను హత్య చేసిన హంతకులకు తెలుగుదేశం చేదోడువాదోడుగా ఉండటం, వారి రాజకీయ ప్రయోజనాల కోసం సునీతమ్మను పావుగా వాడుకుంటున్న వైనంను చూసి వివేకా ఆత్మ క్షోభించదా? చంద్రబాబు చేతుల్లో ఆమె రాజకీయ కీలుబొమ్మలా మారిపోయారు. వివేకా హత్యను రాజకీయం చేసి, గత రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబు లబ్ధి పొందేందుకు ఎలాంటి దిగజారుడుతనంతో వ్యవహరించాడో అందరికీ తెలుసు. వివిధ వ్యవస్థల్లో ఉన్న తన మనుషులను వాడుకుని వివేకా హత్య కేసును పక్కదోవ పట్టించేందుకు, ఈ ఘటనపై ప్రజల్లో అపోహలు సృష్టించేందుకు చంద్రబాబు చేయని పని అంటూ లేదు. అమాయకులను, నిర్దోషులను కూడా జైలులో పెట్టించి రాక్షసానందం పొందాడు. వివేకాను తానే హతమార్చాను అంటూ దస్తగిరి మీడియా ముఖంగా లైవ్ ప్రసారాల్లో అంగీకరిస్తే, అటువంటి వ్యక్తిని చంద్రబాబు అప్రూవర్‌గా మార్చాడు. తన తండ్రి హంతకులు కటకటాల వెనక ఉండకుండా నేరుగా సమాజంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే, వారికి అండదండలు అందిస్తున్నది చంద్రబాబు కాదా? దస్తగిరి బెయిల్ సందర్భంలో సునీతమ్మ కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలోనూ ఆమెను చంద్రబాబు రంగంలోకి తీసుకువచ్చారు. వివేకా హత్యపై విష ప్రచారం చేస్తూ వైయస్ఆర్‌సీపీ పై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి ప్రయోజనాల కోసం సునీతమ్మ పనిచేస్తున్నారు? వివేకా హత్య ఎవరి హయాంలో జరిగింది. ఆనాడు అధికారంలో ఉంది ఎవరు? చివరికి ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తే, దానిని కూడా ప్రభావితం చేసేందుకు చంద్రబాబు తెగబడ్డారు. పాపం పుణ్యం తెలియని అవినాష్‌రెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా నాశనం చేయాలనే దుగ్ధతో వ్యవహరించిన తీరు ప్రజలకు తెలియదా? కుట్రలు, కుతంత్రాలు, దారుణమైన నిందలు మోపినా మొక్కవోని దీక్షతో దేవుడే చూసుకుంటారని అవినాష్‌రెడ్డి కుటుంబం అన్నింటినీ ఓర్చుకుంది. ఉన్నత చదువులు పూర్తి చేసుకుని, వైయస్ జగన్ ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన అవినాష్‌రెడ్డిని దెబ్బతీయాలన్నదే వారి లక్ష్యం. ఎన్నికలు రాగానే హాటాత్తుగా ప్రత్యక్షమవ్వడం, వైయస్ఆర్‌సీపీ, అవినాష్‌రెడ్డిలపై నిందలు వేయడం, వెళ్ళిపోవడం చేస్తున్నారు. ఇదేం పద్దతని సునీతమ్మను అడుగుతున్నాం. సీబీఐ తన దర్యాప్తు పూర్తి చేశామని సుప్రీంకోర్ట్‌లో చెప్పింది. న్యాయస్థానంలో కేసు విచారణలో ఉండగానే తన తండ్రికి బద్ద శత్రువులైన వారితో చేతులు కలిపి రాజకీయ ఆటలో కీలుబొమ్మలా సునీతమ్మ మారడం బాధాకరం. సుప్రీంకోర్ట్ ఒక నిర్ణయంకు వచ్చే సమయంలో ఆమె మరోసారి ఆరోపణలు చేయడం ఎవరి ప్రయోజనం కోసం? వివేకాను హత్య చేసిన వారు, దానికి ప్రోత్సహించిన వారితో చేతులు కలపడం ఎంత వరకు సమంజసమని సునీతమ్మను అడుగుతున్నాం. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఈ హత్య జరిగింది. ఆ రోజు యంత్రాంగం అంతా ఆయన చేతుల్లోనే ఉంది. అలాంటప్పుడు సునీతమ్మ ఎవరిని ప్రశ్నించాలి. వివేక రెండోభార్య విషయం, ఆమెతో జరిగిన ఛాటింగ్ ఎందుకు బయటకు రాలేదు? ఎవరి ప్రోద్భలంతో దానిని దాచిపెట్టారో చెప్పాలి. చంద్రబాబు అండతో సెటిల్‌మెంట్లు చేస్తున్న దస్తగిరి వివేకాను చంపినట్లు చెబుతున్న దస్తగిరి నేరుగా మీడియా చానెళ్ళకు ఇంటర్వూలు ఇచ్చాడు. ఒక హంతకుడిని అప్రూవర్‌గా మార్చిన సీఎం చంద్రబాబును ఎందుకు సునీతమ్మ ప్రశ్నించలేకపోతున్నారు? అతడికి సపోర్ట్ చేస్తున్న చంద్రబాబును ఎందుకు అడగలేక పోతున్నారు? ఈ కుట్రలో ఎందుకు భాగస్వాములవుతున్నారు? ఒక కారు డ్రైవర్‌గా పనిచేసిన దస్తగిరి నేడు ఒక కాన్వాయికి ఓనర్ ఎలా అయ్యాడు? పెద్ద ఎత్తున సెటిల్‌మెంట్లు ఎలా చేస్తున్నాడు. ఈ దేశంలోనే అత్యంత ప్రముఖ లాయర్, చంద్రబాబు వంటి వారి తరుఫున వాదించే న్యాయవాదే దస్తగిరి తరుఫున ఎలా వాదించారు? దీని వెనుక ఉన్న సూత్రదారి ఎవరో సునీతమ్మకు తెలియదా? చంద్రబాబు అండదండతోనే దస్తగిరి కేసులను సుప్రీంకోర్ట్ న్యాయవాది వాదిస్తున్నాడు. 2019 ఎన్నికల ప్రచారం కోసం వైయస్ అవినాష్‌రెడ్డి జమ్మలమడుగు వెడుతుండగా, వివేకా చనిపోయినట్లు ఆయనకు ఫోన్ చేసిందే వివేకా బావమరిది శివప్రకాశ్‌రెడ్డి. అప్పుడే అవినాష్‌రెడ్డి అక్కడికి వచ్చాడు. వివేకా రాసినట్లు చెబతున్న లేఖను ఆ సమయంలో కనిపించకుండా ఎవరు దాచిపెట్టారో సునీతమ్మ చెప్పాలి. వివేకా ఫోన్‌కాల్ డేటాను ఎవరు డిలీట్ చేశారు? వీటికి సునీతమ్మ సమాధానం చెప్పగలరా? 2017 లో వివేకాకు స్థానిక సంస్థల్లో ఎమ్మెల్సీ టిక్కెట్ ఇస్తే, చంద్రబాబు కుట్రపూరితంగా బీటెక్ రవిని నిలబెట్టి ఆయనను ఓడించాడు. తన తండ్రిని ఎన్నికల్లో ఓడించిన చంద్రబాబుకు సునీతమ్మ ఎందుకు మద్దతు ఇస్తుందో చెప్పాలి? పులివెందుల నియెజకవర్గంలో జెడ్పీటీసీ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీని అడ్డుకునేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది. దాడులు, కేసులతో భయపెడుతోంది. చివరికి సునీతమ్మను కూడా రంగంలోకి దించి ఈ ఎన్నికల్లో గెలవాలన్నదే చంద్రబాబు వ్యూహం. మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ... 2024లో ఏపీలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై మాకు అనుమానాలు ఉన్నాయి. విజయనగరంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈవీఎంలు నలబై నుంచి యాబై శాతం చార్జింగ్ చూపిస్తే, కౌంటింగ్ సమయంలో 90 శాతం చార్జింగ్ చూపించాయి. ఇది ఎలా సాధ్యపడింది? కౌంటింగ్ సీసీ ఫుటేజీని ఇవ్వాలని కోరాం. ఒంగోలులో కూడా వీవీ ప్యాట్‌లను లెక్కించాలని కోరాం. రాయచోటి నియోజకవర్గంలో ఒకేసారి అమాంతంగా పెరిగిన ఓట్లు, అవ్వన్నీ తెలుగుదేశం పార్టీకే పడటం పై కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. వీటిపై వివరణ ఇవ్వాలని అడిగాం. ఎన్నికల కమిషన్ పారదర్శకంగా పనిచేసినప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం సాధ్యపడుతుంది. రాజకీయపక్షాలుగా మేం అడిగిన వారికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపై ఉంది.