ఎన్టీఆర్: నేడు తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. ఎన్నికల కోసం బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. మరోవైపు.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ వైయస్ఆర్‌సీపీ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. తిరువూరు వెళ్లొద్దంటూ వైయస్ఆర్‌సీపీ నేతలపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. వివరాల ప్రకారం.. తిరువూరు మున్సిపల్ చైర్మన్ రాజీనామా చేయడంతో నేడు చైర్మన్ పదవికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ నేతలు తిరువూరు వెళ్లకుండా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. శాంతిభద్రతల సాకుతో వైయస్ఆర్‌సీపీ నేతల ఇళ్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. వైయస్ఆర్‌సీపీ నేతలను టార్గెట్ చేసి హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఎన్నికల్లో బలం లేకపోయినా గెలవాలని కూటమి కుట్రలు చేస్తోంది. కూటమి ప్రభుత్వ వైఖరి, పోలీసుల తీరుపై వైయస్ఆర్‌సీపీ నేతలు మండిపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ..‘తిరువూరులో బలం లేకపోయినా గెలవాలని చూస్తున్నారు. వైఎస్సార్‌సీపీకి 17 మంది కౌన్సిలర్ల బలం ఉంది. టీడీపీకి ఉన్నది కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే. ముగ్గురు కౌన్సిలర్లతో ఏవిధంగా గెలవాలనుకుంటున్నారు. అధికార బలంతో మున్సిపాల్టీ, నగర పాలక సంస్థలను కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. ఎన్నికల్లో మీరు ఏం చెప్పి గెలిచారు. రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తామని ఇప్పుడు మీరు చేస్తున్నదేంటి?. తిరువూరు వెళ్లొద్దని మా పై ఆంక్షలు పెట్టడమేంటి?. వెళితే అరెస్ట్ చేస్తామని వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏపీలో పోలీసు రాజ్యం నడిపిస్తున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తిరువూరు వెళ్లి తీరుతాం. తిరువూరు మున్సిపాల్టీపై వైయస్ఆర్‌సీపీ జెండా ఎగురవేస్తాం’ అని అన్నారు. మరోవైపు.. సోమవారం ఉదయమే మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఇంఛార్జి తన్నీరు నాగేశ్వరరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్బంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ..‘శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపించి వైయస్ఆర్‌సీపీ నేతలను హౌస్ అరెస్టు చేయటం కరెక్ట్ కాదు. రాజ్యాంగ హక్కులను కూటమి ప్రభుత్వం కాలరాయటమే అవుతుంది. వైయస్ఆర్‌సీపీకి 17 మంది కౌన్సిలర్ల మద్దతు ఉండగా తెలుగుదేశం పార్టీకి కేవలం ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని కూటమి ప్రభుత్వం తిరువూరు మున్సిపాలిటీ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఫలితం మాత్రం శూన్యం’ అని అన్నారు. ఇక, వైయస్ఆర్‌సీపీ తరఫున 17 మంది కౌన్సిలర్లు ఉండగా, టీడీపీ నుంచి ముగ్గురు గెలుపొందారు. ఎన్నికల్లో గెలించేందుకు బలం లేకపోయినప్పటికీ టీడీపీ కుట్రలకు పాల్పడుతోంది. వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేస్తూ తమ వైపు తిప్పుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు.