కర్నూలు: రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి పాలన ఎమర్జెన్సీ పరిస్థితిని తలపిస్తోందని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే నోటీసు, రోడ్డుపైకొచ్చి గొంతెత్తితే అక్రమ కేసులు పెడుతూ పౌరుల హక్కులను కాల రాస్తోందని వైయస్ఆర్‌సీపీ నాయకులు ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు అచ్చం నియంతలా వ్యవహరిస్తున్నారని వారు ఫైర్ అయ్యారు. నియంతలంతా దారుణంగా తమ చరిత్ర ముగించారన్న వైయస్ఆర్‌సీపీ నాయకులు, వారికి పట్టిన గతే భవిష్యత్తులో చంద్రబాబుకూ పడుతుందని తేల్చి చెప్పారు. కర్నూలు బస్సు ప్రమదంలో ప్రభుత్వ బా«ధ్యతా రాహిత్యం స్పష్టంగా కనిపిస్తోందని కర్నూలులో మీడియాతో మాట్లాడిన వైయస్ఆర్‌సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి, పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది అమాయకులు చనిపోతే బాధ్యతగా దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించాల్సిన ప్రభుత్వం, ఘటనను ప్రశ్నించిన వారిపైనే అక్రమ కేసులు పెట్టిందని వారు ఆక్షేపించారు. తప్పును కప్పి పుచ్చుకునేందుకు లక్ష్మీపురంలో బెల్ట్ షాపే లేదని ప్రభుత్వం పచ్చి అబద్ధం చెబుతోందని, తనతో వస్తే లక్ష్మీపురంలో బెల్ట్ షాపు చూపడానికి సిద్దంగా ఉన్నానని, అది నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, మరి ప్రభుత్వం అందుకు సిద్ధంగా ఉన్నదా అని ఎస్వీ మోహన్‌రెడ్డి సవాల్ చేశారు. కూటమి నాయకుల మెప్పు కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరించే పోలీసులు రేపు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం వచ్చాక తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మనోహర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేశారు. ప్రెస్‌మీట్‌లో వారు ఇంకా ఏం మాట్లాడారంటే..: 18 నెలలుగా అరాచక పాలన: ఎం.మనోహర్‌రెడ్డి. వైయస్ఆర్‌సీపీ లీగల్‌సెల్ అధ్యక్షుడు. – ప్రభుత్వం, పోలీసులు కలిసి రాష్ట్రంలో 18 నెలలుగా అరాచక పాలన సాగిస్తున్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను పోగొట్టవచ్చన్న దురాలోచనతో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపిన చూపిన వారిపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఇటీవల కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద బస్సు దగ్ధమై 19 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాన ప్రతిపక్షంగా ఈ ప్రమాదం జరిగిన తీరుపై వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రమాదంపై నిష్పాక్షిక దర్యాప్తు జరిపి అసలు కారణాలను వెలికి తీయాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వైయస్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. ఈ ప్రమాదానికి కారణమైన బైకర్ మద్యం సేవించాడని, అదే చివరకు 19 మంది ప్రాణాలను బలి తీసుకుందని ప్రజల నుంచి తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తితే, డీఐజీ కోయ ప్రవీణ్ మాత్రం బైకర్ మద్యం తాగనేలేదని మీడియాకు చెప్పాడు. కానీ మరుసటి రోజు మీడియా, వైయస్ఆర్‌సీపీ బైకర్ మద్యం తాగి బైకు నడిపినట్టు పెట్రోల్ బంకు సీసీ టీవీ ఫుటేజ్‌ను బయటపెట్టడంతో మళ్లీ జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి బైకర్ మద్యం తాగి వాహనం నడిపినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో ప్రమాదం జరిగిన ప్రాంతానికి సమీపంలో లక్ష్మీపురం వద్ద ఉన్న బెల్ట్ షాపులో అర్ధరాత్రి వరకూ మద్యం విక్రయించారని, ఆ మద్యం తాగడమే అసలు ప్రమాదానికి కారణమన్న అనుమానం అందరిలో మొదలైంది. దానిపై మీడియాలో విశ్లేషణా మొదలైంది. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి ప్రజలకు సమాధానం చెప్పి, అనుమానాలు నివృతి చేయకపోగా పత్రికల్లో వచ్చిన కథనాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు 27 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరు ప్రశ్నించినా ఈ ప్రభుత్వం ఓర్వలేకపోతోంది. ఆఖరుకి ప్రెస్‌మీట్‌లకు హాజరైన రిపోర్టర్లను కూడా విచారణకు పిలిచి వేధిస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఎంత భయపడుతుందో అర్థమైపోతుంది. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారు: పత్రికా స్వేచ్ఛను సైతం హరిస్తూ ఎమర్జెన్సీ పరిస్థితిని తలపించేలా చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తూ గొంతెత్తితే అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారు. పౌరులకు, మీడియాకు రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారమదంతో కాలరాస్తున్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా సాక్షి మీడియా, ఆ రిపోర్టర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. చివరకు లాయర్లను కూడా వదలకుండా వేధిస్తున్నారు. నాడు ప్రజాస్వామ్యబద్దంగా వ్యవహరించాం: 2019–24 మధ్య వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో మీడియా ఎంతో స్వేచ్ఛగా పని చేసింది. వైయస్ జగన్ ప్రభుత్వంపై పుంఖానుపుంఖాలుగా తప్పుడు వార్తలు రాసి విష ప్రచారం చేసినా ఏనాడూ వైయస్ఆర్‌సీపీ నాయకులు ఆ మీడియా కార్యాలయాల మీద దాడులకు దిగలేదు. మీడియా సంస్థలను అక్రమ కేసులతో వేధించలేదు. కానీ నేడు పోలీసులు నోటీసులు ఇచ్చే పేరుతో సాక్షి కార్యాలయాల్లోకి, సాక్షి ఎడిటర్ ఇంట్లోకి, పార్టీ మీడియా వ్యవహారాలు చూసే జనరల్ సెక్రటరీ పూడి శ్రీహరి ఆఫీసులోకి వెళ్తున్నారు. అలా యథేచ్ఛగా మీడియా స్వేచ్చను కాలరాస్తున్నారు. దుష్ట సంప్రదాయానికి తెర తీశారు: చివరకు టీడీపీ నాయకులు ఎదుర్కొంటున్న కేసుల్లో వైయస్ఆర్‌సీపీ వారిని కూడా ఇరికించే దుష్ట సంప్రదానికి కూటమి పాలనలో పోలీసులు తెరదీశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి చెందిన రెండు వర్గాలు ఆధిపత్యపోరుతో ఒకరినొకరు చంపుకుంటే ఆ హత్య కేసులో పిన్నెల్లి సోదరులను అక్రమంగా ఇరికించారు. దాసరి వీరయ్య అనే వైయస్ఆర్‌సీపీనాయకుడిని తనకు సంబంధమే లేని ప్రేమ వివాహం కారణంగా జరిగిన పరువు హత్యలో ఇరికించారు. వైయస్ఆర్‌సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను గంజాయి కేసుల్లో ఇరికిస్తున్నారు. తండ్రి అంత్యక్రియల కోసం లండన్ నుంచి వచ్చిన మాలేపాటి భాస్కర్‌రెడ్డి అనే ఎన్నారైని ఎప్పుడో పదేళ్ల క్రితం సోషల్ మీడియా పెట్టిన పోస్టుపై అరెస్ట్ చేసి దారుణంగా కొట్టి హింసించారు. సోషల్ మీడియా పోస్టుపై కేసు పెడితే కోర్టు బెయిల్ ఇస్తుందన్న కారణంతో, ఆయన విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను కొట్టాడని తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేశారు. కస్టడీలో హింసించారు. వారంతా సమాధానం చెప్పక తప్పదు: ఇప్పటికే, హైకోర్టు, సుప్రీంకోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా వీరిలో కొంచెం కూడా మార్పు రావడం లేదు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలకు భవిష్యత్తులో తప్పకుండా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే కూటమి చేసే నేరాల్లో భాగం కావొద్దని పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ప్రతీకార రాజకీయాలతో తప్పుడు కేసులతో వేధిస్తున్న వారందరినీ, రేపు వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక న్యాయస్థానం ముందు నిలబెడతాం. అప్పుడు వారంతా సమాధానం చెప్పక తప్పదు. తగిన శిక్షా అనుభవించక తప్పదని ఎం.మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. లక్ష్మీపురంలో బెల్ట్ షాపు ఉందని నిరూపిస్తా. నా సవాల్‌కు రెడీనా?: ఎస్వీ మోహన్‌రెడ్డి. వైయస్ఆర్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు – కర్నూలు బస్సు ప్రమాదానికి కారకుడైన బైకర్ లక్ష్మీపురం బెల్ట్‌షాపులో మద్యం సేవించాడని, అర్ధరాత్రి వరకు బెల్ట్ షాపులను నడిపిస్తున్నారని పత్రికల్లో వచ్చిన వార్తలను సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు 27 మందిపై ఈ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టింది. బాధ్యత గల ప్రభుత్వం అయి ఉంటే, బెల్ట్ షాపు నిర్వాహకులపై చర్యలు తీసుకునేది. 19 మంది అమాయకుల ప్రాణాలు కోల్పోతే ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకుని బాధిత కుటుంబాలకు అండగా నిలబడాల్సిందిపోయి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. వాస్తవాలు చెప్పాలని బాధితుల పక్షాన నిలబడిన వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడమే పనిగా పెట్టుకుంది. ఇంకా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తితే అరెస్ట్, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే నోటీసు అనే విధంగా పోలీస్ వ్యవస్థను ఇష్టారాజ్యంగా వాడుకుంటోంది. లక్ష్మీపురంలో బెల్ట్ షాపు లేదని చెబుతున్న ప్రభుత్వానికి ఇదే నా సవాల్. నాతో పాటు వస్తే లక్ష్మీపురంలో బెల్ట్ షాపు చూపిస్తాను. అది నేను నిరూపించలేకపోతే రాజకీయ సన్యాసానికి సిద్ధం. మరి తన సవాల్ స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదా? అని ఎస్వీ మోహన్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు.