హైదరాబాద్: కూటమి ప్రభుత్వం యాక్సిస్ పవర్‌తో కుదుర్చుకున్న ఒప్పందం వెనుక భారీ అవినీతి ఉందని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ సీనియర్ నేత గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. యూనిట్‌కు రూ.4.60 కి చేసుకున్న ఒప్పందం వల్ల ప్రజలపై పెనుభారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన బినామీల జేబులు నింపడానికే ఇటువంటి అవినీతి ఒప్పందాలకు సీఎం చంద్రబాబు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ విద్యుత్ రంగ చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్కామ్ ఇదేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే... గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీ ద్వారా యూనిట్ విద్యుత్ రూ. 2.49లకు కొనుగోలు ఒప్పందం చేసుకుంటే కూటమి పార్టీలు గగ్గోలు పెట్టాయి. వైయస్ జగన్ రూ.1.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి నష్టం చేశారంటూ చంద్రబాబు, ఆయన అనుచరవర్గం అబద్దపు ఆరోపణలతో దారుణంగా తప్పుడు ప్రచారం చేశారు. ఐఎస్ టీసీ చార్జీలు లేకుండా యూనిట్ రూ. 2.49 లకే ఒప్పందం చేసుకుంటేనే ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిపోయిందని నానా యాగీ చేశారు. తాజాగా యాక్సిస్ పవర్ అనే సంస్థ నుంచి యూనిట్ విద్యుత్ రూ.4.60 లకు కొనుగోలు చేసుకుంటూ ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా విడుదల చేసింది. పైగా 25 ఏళ్ల పాటు ఈ ధర తగ్గించటానికి వీల్లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించి కాంట్రాక్టర్ల ఆదాయానికి రాజమార్గం చూపించారు. యూనిట్ మీద రూ. 2.11 లు అధికంగా చెల్లించి కొనుగోలు చేయడం చూస్తుంటే ఎంత భారీ అవినీతికి తెరదీశారో అర్థమవుతోంది. ఏపీ విద్యుత్తు నియంత్రణ మండలిని సెక్షన్ 108 పేరుతో బెదిరించి మరీ ఈ ఒప్పందానికి ఆమోద ముద్ర వేయించుకోవడం చూస్తే ఎంతకు బరితెగించారో తెలుస్తోంది. ఏడాది పాలనలోనే విద్యుత్ బిల్లుల రూపంలో ప్రజలపై రూ. 15 వేల భారం మోపే ప్రణాళికలు అమలు చేస్తున్న కూటమి సర్కారు, యాక్సిస్‌తో చేసుకున్న ఈ అడ్డగోలు ఒప్పందం ద్వారా మరో భారీ కుంభకోణానికి ప్రణాళికలు రచించింది. చంద్రబాబు పాలనలో విద్యుత్ రంగం కుదేలు గతంలో చంద్రబాబు సీఎంగా చేసిన కాలంలో ఎప్పుడూ లో ఓల్టేజ్ సమస్యలతో రైతులు అల్లాడిపోయేవారు. రైతులకు ట్రాన్స్‌ఫార్మర్ కావాలన్నా ఇచ్చేవారు కాదు. విద్యుత్ పంపిణీ సంస్థలను చంద్రబాబు దివాళా తీయించారు. దివంగత వైయస్ఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాక విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందజేసి రైతులకు వ్యవసాయాన్ని పండగ చేసి చూపించారు. 2014లోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక తప్పుడు ఒప్పందాలతో దోపిడీకి రహదారులు నిర్మించాడు. 2014లో రాష్ట్ర విడిపోయే నాటికి రూ. 29 వేల కోట్ల విద్యుత్ బకాయిలు ఉండగా, 2014-19 మధ్య చంద్రబాబు దిగిపోయే నాటికి బకాయిలు రూ. 86,300 కోట్లకు చేర్చాడు. సీఏజీఆర్ (కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్) చూస్తే 24 శాతం పెరిగింది. వైయస్ జగన్ 2019లో ముఖ్యమంత్రి అయ్యాక కరోనా వంటి మహమ్మారి విలయతాండవం చేసినా సీఏజీఆర్ రేషియో కేవలం 7.2 శాతమే నమోదైంది. వైయస్ జగన్ సంస్కరణలతో విద్యుత్ రంగానికి మంచి రోజులు చంద్రబాబు హయాంలో గాడి తప్పిన విద్యుత్ రంగాన్ని వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రణాళికబద్ధమైన చర్యలతో అభివృద్ధి పథంలో నడిపించారు. వ్యవసాయానికి ఉచితంగా, వివిధ వర్గాలకు రాయితీతో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో విద్యుత్ అందించాం. డిస్కంలకు 2019–24 మధ్య ఏకంగా రూ.47,800 కోట్లను చెల్లిస్తే, 2014-19 మధ్య టీడీపీ సర్కారు రూ.13,255.76 కోట్లు మాత్రమే చెల్లించింది. రైతులకు ఉచిత విద్యుత్ బకాయిలు రూ.8,845 కోట్లు ఇవ్వకుండా ఎగవేసింది. వాటిని వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వమే చెల్లించింది. 2019-23 మధ్య వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ పాలనలో రెండు లక్షలకు పైగా అగ్రికల్చరల్ డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేశాం. 2014 వరకు 11 పీపీఏ(పవర్ పర్చేజ్ అగ్రిమెంట్‌లు)లు మాత్రమే ఉంటే, 2014-19 మధ్య చంద్రబాబు 39 సోలార్ పీపీఏలు చేశారు. అవన్నీ కూడా 25 ఏళ్ల కాలపరిమితితో చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతి మూడేళ్లకోసారి ధరలు పెంచేలా ఒప్పందం కుదుర్చుని ప్రజల నెత్తిన అప్పుల భారం మోపాడు. 2014 వరకు 91 విండ్ పీపీఏలు జరిగితే చంద్రబాబు ఐదేళ్ల పాలనలో 133 ఒప్పందాలు జరిగాయి. ఇవన్నీ కూడా యూనిట్ రూ. 4.84 కనీస చార్జితో చేసుకున్నవే. ఎన్నికలకు ముందు విద్యుత్ చార్జీలు పెంచబోనని, అవసరమైతే తగ్గిస్తానని చెప్పిన చంద్రబాబు, తగ్గించడం సంగతి దేవుడెరుగు.. ప్రజలపై ఏకంగా రూ. 15వేల కోట్ల భారం మోపాడు.