వేమిరెడ్డి కబంధ హ‌స్తాలో మైనింగ్ 

మైనింగ్ య‌జ‌మానుల‌కు ఎంపీ బెదిరింపులు

వెంక‌ట‌గిరి రాజాల మైన్స్ స‌హా జిల్లాలో చాలా మైన్స్ మూత‌

వ్యాపారం చేయాలంటే వేమిరెడ్డి అనుమ‌తి ఉండాల్సిందే

త‌న కంపెనీ కింద‌నే మైనింగ్ చేస్తే ఓకే, లేదంటే మూతే

కేవ‌లం రెండే కంపెనీల ద్వారానే ఎగుమ‌తులు.. అవి కూడా ఎంపీవే

ఎంపీ వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి దందాల‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఫైర్ 

ఎంపీ వేమిరెడ్డిపై కేసులు నమోదు చేసేదాకా వ‌ద‌ల‌ను

ఆయ‌న అక్ర‌మాల‌కు నావ‌ద్ద అన్ని ఆధారాలున్నాయి

రేపు క‌లెక్ట‌ర్‌ను క‌లిసి అక్ర‌మాల‌పై ఫిర్యాదు చేస్తా

50 ఏళ్లు లీజు దాటిన మైన్స్ ను స్వాధీనం చేసుకోవాల్సిందే

వారం రోజుల్లో చ‌ర్య‌లు తీసుకోకుంటే నేనే మైన్స్‌ను సంద‌ర్శిస్తా

అక్ర‌మాల‌ పెనాల్టీలతోనే స‌జావుగా అమ‌రావ‌తి క‌ట్టుకోవ‌చ్చు

 నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి 

నెల్లూరు:  టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి కబంధ హ‌స్తాలో మైనింగ్ చిక్కుకుంద‌ని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌యాద‌వ్ విమ‌ర్శించారు. మైనింగ్ య‌జ‌మానుల‌ను అధికార పార్టీ ఎంపీ బెదిరిస్తున్నార‌ని, వెంక‌ట‌గిరి రాజాల మైన్స్ స‌హా జిల్లాలో చాలా మైన్స్ మూత ప‌డ్డాయ‌ని తెలిపారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డి దందాల‌పై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ ఫైర్ అయ్యారు.  నెల్లూరులోని జిల్లా పార్టీ కార్యాల‌యంలో మీడియాతో మాజీ మంత్రి మీడియాతో మాట్లాడారు.

అనిల్‌కుమార్‌యాద‌వ్ ఏమ‌న్నారంటే..
ఎన్నిక‌ల్లో ఓడిపోయిన నాటి నుంచి నాకున్న కొన్ని వ్య‌క్తిగ‌త కారణాలతోపాటు ఏడాదిపాటు అధికార పార్టీకి స‌మ‌యం ఇవ్వాల‌న్న ఉద్దేశ్యంతో రాజ‌కీయ కార్య‌క్ర‌మాల‌కు కొంత‌దూరంగా ఉన్నమాట వాస్త‌వ‌మే కానీ, పార్టీని కార్య‌క‌ర్త‌ల‌ను ఏనాడూ విడిచిపెట్ట‌లేదు. దీన్ని ఆస‌రాగా చేసుకుని కొంతమంది నాకు, మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్‌కి మ‌ధ్య విబేధాలు సృష్టించే ప్ర‌య‌త్నం చేశారు. నా చిత్త‌శుద్ధి నాకు, మా నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ కి కూడా తెలుసు. 

ఎన్నిక‌ల్లో ఓడిన నాటి నుంచి అనిల్ కుమార్ యాద‌వ్ మైనింగ్‌లో వేల కోట్ల రూపాయ‌లు అక్ర‌మంగా దోచుకున్నాడ‌ని విష ప్ర‌చారం చేస్తూ ఉన్నారు. నిజానిజాలు ఏంట‌న్న‌ది రాబోయే రోజుల్లో అన్ని బ‌య‌ట‌కు వ‌స్తాయి. దాని గురించి నేనేమీ భ‌య‌ప‌డ‌టం లేదు. మైనింగ్ తో నాకేం సంబంధం లేక‌పోయినా అనిల్ కుమార్ యాద‌వ్ మైనింగ్ లో వేల కోట్లు దోచుకున్నాడ‌ని ప్ర‌చారం చేయిస్తున్నారు. ఇప్పటిలా మా ప్ర‌భుత్వంలో మైన్స్‌ను ఆపేశామా?  మైనింగ్ య‌జ‌మానులు రోడ్డున ప‌డిన రోజులున్నాయా? ఒక్క‌రైనా నా మీద కంప్లైంట్ చేశారా? 

కాకాణికి అండ‌గా ఉంటా

కొంతకాలంగా మా నెల్లూరు జిల్లా అధ్య‌క్షులు కాకాణి గోవ‌ర్ద‌న్ రెడ్డి మీద కూడా అక్ర‌మ కేసులు బ‌నాయించి కూట‌మి ప్ర‌భుత్వం వేధింపుల‌కు గురిచేస్తోంది. కాకాణి మీద న‌మోదైన కేసుల్లో న్యాయ‌స్థానాల‌ను ఆశ్ర‌యించ‌డం జ‌రిగింది. ఆయ‌న‌కు నాతోపాటు పార్టీ కూడా ఎల్ల‌వేళ‌లా అండ‌గా ఉంటుంది. పార్టీ కోసం పోరాడుతున్న వ్య‌క్తుల మీద కేసులు బ‌నాయించినంత మాత్రాన వైయ‌స్ఆర్‌సీపీ వెనక‌డుగు వేస్తుంద‌ని వారు అనుకుని ఉండొచ్చు. కానీ అది ఎప్ప‌టికీ జ‌ర‌గ‌ద‌ని కూట‌మి నాయకులు గుర్తుంచుకోవాలి. 

అక్ర‌మాలు జ‌రిగాయ‌న్న మైన్స్‌నే ఓపెన్ చేశారు 

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందంటూ విచార‌ణ పేరుతో మైనింగ్ మొత్తం ఆపేశారు. 
ఎన్నిక‌ల ప్ర‌క్రియ మొద‌లైన నాటి నుంచి కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరే నాటికి మ‌ధ్య‌న‌ ట్రాన్సిష‌న్ పీరియ‌డ్‌లో అక్ర‌మ మైనింగ్ జరిగింది అంటూ ప్ర‌భుత్వం రూ. 255 కోట్ల మేర పెనాల్టీలు విధించారు. ఆ పెనాల్టీలు క‌లెక్ట్ చేసుకునే బాధ్య‌త కూట‌మి ప్ర‌భుత్వానిదే. అక్ర‌మ మైనింగ్ పైన విచార‌ణ చేసిన రెండు మూడు  నెల‌ల త‌ర్వాత పెనాల్టీలు లేని వాటిని కాకుండా ఏవైతే అక్ర‌మ మైనింగ్ జ‌రిగిందంటూ విచార‌ణ చేశారో వాటినే రీఓపెన్ చేశారు. 

200 మైన్స్ ఉంటే 30 ఓపెన్ చేశారు

జిల్లాలో దాదాపు 150 నుంచి 200 మైన్స్ ఉంటే అందులో యాక్టివ్ మైన్స్ దాదాపు 100 వ‌ర‌కు ఉన్నాయి. ఈ ప‌ది నెల‌ల్లో ఆ 100 మైన్స్ కాకుండా కేవ‌లం ఎంపిక చేసుకున్న 30 మైన్స్‌ను మాత్ర‌మే ఎందుకు ఓపెన్ చేశారో కూట‌మి ప్ర‌భుత్వం స‌మాధానం చెప్పాలి. బ‌య‌ట‌కు వెళ్లిన ప్ర‌తి ట‌న్నుకు ఎక్కోడో ఒక చోట ప‌ర్మిట్ కొట్టి తీరాల్సిందే. ఆ విధంగా గ‌త మా ప్ర‌భుత్వంలో రూ. 150 కోట్లు ఆదాయం వ‌స్తే, ఇప్పుడు రూ. 30 నుంచి 40 కోట్లు కూడా ఎందుకు రావ‌డం లేదు?  

కోర్టులు ఆదేశించినా లెక్కే లేదు

కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మైనింగ్ ప‌నులు ఆపేయ‌డంతో 100 మైన్స్‌కి సంబంధించి దాదాపు 10 వేల కుటుంబాలు రోడ్డున ప‌డ్డాయి. మైనింగ్ జ‌రుగుతున్న గూడూరు, సైదాపురం ప్రాంతాల‌కు వెళితే గ‌త మా ప్ర‌భుత్వంలో ప‌రిస్థితులు బాగున్నాయా? ఈరోజు బాగున్నాయా అనేది తెలిసిపోతుంది. మైనింగ్ ప‌నులు జ‌రుగుతుంటే ప‌రోక్షంగా వాటిపై ఆధారప‌డి వ్యాపారం చేసుకుంటున్న హోట‌ళ్ల య‌జ‌మానులు, టిప్ప‌ర్ య‌జ‌మానులు, పెట్రోల్ బంకులు.. ఇలా అన్ని వ్యాపారాలు మూత‌ప‌డ్డాయి. మా ప్ర‌భుత్వ హ‌యాంలో ఏరోజూ మైన్స్ యాజ‌మానులు కోర్టుకెళ్లిన దాఖ‌లాలు లేవు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక మా మైన్స్ ఓపెన్ చేయించాల‌ని జ‌న‌వ‌రిలో కోర్టుకెళితే యాక్ష‌న్ తీసుకోని మైన్స్ ఓపెన్ చేయాల‌ని ఫిబ్ర‌వ‌రి 10న కోర్టు తీర్పు చెప్పింది. కానీ ప్ర‌భుత్వం ప‌ట్టించుకోక‌పోవ‌డంతో మైన్స్ య‌జమానులు మ‌ళ్లీ కంటెమ్ట్ ఆఫ్ కోర్టుకి వెళ్లారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వంలో అక్ర‌మ మైనింగ్ జ‌రిగింద‌ని ఆరోప‌ణ‌లు చేస్తున్న కూట‌మి నాయ‌కులు దీనికి స‌మాధానం చెప్పాలి. మా ప్ర‌భుత్వంలో అక్ర‌మాలు జ‌రిగే ఉంటే ఇలాంటి ఒక్క ఘ‌ట‌న జ‌రిగిఉండాలి క‌దా? వేలాది కుటుంబాలు ఉపాధి కోల్పోతున్నాయ‌ని పేర్కొంటూ మైన్స్‌ను ఓపెన్ చేయాలని మైనింగ్ సెక్ర‌ట‌రీకి ఫెమీ (ఫెడ‌రేష‌న్ ఆఫ్ మైన‌ర్ మిన‌రల్స్ ఇండ‌స్ట్రీ- ఇండియా) లేఖ కూడా రాసింది.నేరుగా ట్విట్ట‌ర్లో ముఖ్య‌మంత్రిని ట్యాగ్ చేసి ఫెమీ ట్వీట్లు కూడా చేసింది. ఇదే కాకుండా మంద కృష్ణ నేతృత్వంలో మాదిగ రిజ‌ర్వేష‌న్ పోరాట స‌మితి నాయ‌కులు పామూరు వెళ్లి టెంపోల్లో వెళ్లి మ‌రీ మైనింగ్ సెక్ర‌ట‌రీకి ఫిర్యాదు చేసి వ‌చ్చారు. మైనింగ్ ఆపేయ‌డం వ‌ల్ల దాని మీద ఆధార‌ప‌డి జీవిస్తున్న మా సామాజిక‌వ‌ర్గం వారు తీవ్రంగా నష్ట‌పోతున్నార‌ని ప్ర‌భుత్వాన్ని వేడుకున్నారు. 

ఎగుమ‌తి చేసే కంపెనీలు రెండూ ఎంపీవే 

మైనింగ్ య‌జమానులంతా నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాక‌ర్‌రెడ్డిని కూడా క‌లిసి న్యాయం చేయాల‌ని వేడుకుంటే మైనింగ్ ఆగిపోవ‌డం వెనుక‌ త‌న‌కేమీ సంబంధం లేదని చెబుతూ, ఇప్పుడే మంత్రికి ఫోన్ చేసి మైన్స్‌ను ఓపెన్ చేయాల‌ని చెబుతాను అన్నాడ‌ని ఆయ‌న్ను క‌లిసిన వారే చెప్పారు. అయినా ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు కాబ‌ట్టే వారంతా రోడ్డెక్కాల్సి వ‌చ్చింది. గ‌తంలో దాదాపు 20 నుంచి 25 మంది ఎగుమతిదారులుంటే ఈరోజు ఒకేఒక్క ఎక్స్‌పోర్ట‌ర్ మాత్ర‌మే ఉన్నాడు. ల‌క్ష్మీ క్వార్జ్ శాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ మాత్ర‌మే ఇప్పుడు ఎక్స్‌పోర్ట‌ర్‌గా ఉంది. దీనికి ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి డైరెక్ట‌రుగా ఉన్నారంటే మ‌త‌లబు ఏంటో అర్థం చేసుకోవ‌చ్చు. త‌ర్వాత ఫిని క్వార్జ్ పేరుతో దీనికొక సిస్ట‌ర్ కంపెనీ ఓపెన్ చేసి ఇందులో మ‌న్నెమాల విజ‌య‌కుమార్‌రెడ్డిని డైరెక్ట‌ర్‌గా చేశారు. ఈయ‌న ఎవ‌రికి ఆప్తుడనేది నెల్లూరు ప్ర‌జ‌లంద‌రికీ తెలుసు. ఈ రెండు కంపెనీలు మాత్ర‌మే ఎక్స్‌పోర్ట‌ర్లుగా ఉన్నాయి. వేరేవారికి ఎందుకు అవ‌కాశం రావ‌డం లేదు? ఇవ‌న్నీ చూశాక మైనింగ్ ఎందుకు ఓపెన్ కావ‌డం లేదని ఎవ‌రికైనా స్ప‌ష్ట‌త వ‌స్తుంది. మైనింగ్ ఎవ‌రు చేసినా మా కంపెనీ ద్వారానే చేయాలి, లేదంటే మీ మైన్స్‌ను ఓపెన్ చేయ‌బోమ‌ని ఎంపీ వేమిరెడ్డి  హుకుం జారీ చేశారు. వారికి స‌రెండ‌ర్ అయిన వారి మెటీరియ‌ల్‌ని మాత్ర‌మే ఈ రెండు కంపెనీల ద్వారా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారు. మిగ‌తా వారి మైన్స్‌ను కూడా ఓపెన్ కానివ్వ‌కుండా ఎంపీ అడ్డుకుంటున్నారు. వెంక‌ట‌గిరి రాజాల కుటుంబానికి నెల్లూరులో మంచి పేరుంది. ఆఖ‌రుకి ఆ పెద్ద మ‌నిషి మైన్స్ ఓపెన్ చేయించుకోవ‌డం కోసం ఎన్ని గుమ్మాలు ఎక్కిదిగారో నాకు తెలుసు. అలాంటి వ్య‌క్తిని కూడా ఎన్నో అవ‌మానాల‌కు గురిచేస్తున్నారు. త‌న మైన్స్ మీద ఆధారప‌డి బ‌తుకుతున్న కూలీల బాగోగుల గురించి ఆలోచన చేసైనా మైన్స్ ఓపెన్ చేయాల‌ని వేడుకున్నా ఈ ఎంపీ క‌నిక‌రం చూప‌లేదు. వేమిరెడ్డికి ఎన్నివేల కోట్ల ఆస్తులైనా ఉండొచ్చుగాక‌, ఇలా అమాయ‌కులైన వారిని వేధించి వారి కుటుంబాల‌ను రోడ్డుపాలు చేస్తే, ఆ ఉసురు త‌గ‌ల‌కుండా పోదని గుర్తుంచుకోవాలి. మైన్స్ య‌జ‌మానుల మీద క‌క్ష తీర్చుకునే నెపంతో వాటి మీద ఆధార‌ప‌డి జీవిస్తున్న కార్మికుల కుటుంబాల‌ను రోడ్డున ప‌డేశారు. 10 నెల‌లుగా ప‌నులు లేక ప‌స్తులుంటున్న కార్మికుల కుటుంబాల వేద‌న చూసైనా ఎంపీ మ‌న‌సు క‌రుగుతుందేమో చూడాలి. 

ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాలి

కూట‌మి ప్ర‌భుత్వంలో ఇష్టారాజ్యంగా అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌డం లేదు. మైనింగ్ పీరియ‌డ్ 50 ఏళ్లు దాటినా ప్ర‌భుత్వ స్వాధీనం చేసుకోవ‌డం లేదు. ఈ మైన్స్‌పై పెనాల్టీలు విధించి వ‌సూలు చేస్తే దాదాపు అమ‌రావ‌తి నిర్మాణానికి కావాల్సిన నిధుల‌న్నీ ఇక్క‌డే దొర‌క‌బుచ్చుకోవ‌చ్చు. జిల్లాలో జ‌రుగుతున్న మైనింగ్ అక్ర‌మాల‌న్నింటినీ వెనుకుండి న డిపిస్తున్న ఎంపీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి సమాధానం చెప్పాలి.  50 ఏళ్లు దాటిన మైన్స్‌ల‌న్నింటినీ ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని క‌లెక్ట‌ర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తాం. ఐదు రోజుల్లో త‌గు చర్య‌లు తీసుకోనిప‌క్షంలో ఆ అక్ర‌మ మైనింగ్ జ‌రిగే ప్రాంతాల‌ను నేనే సంద‌ర్శించి ఉద్య‌మం చేస్తాన‌ని హెచ్చరిస్తున్నా. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎదుర్కోవ‌డానికి నేను సిద్ధంగా ఉన్నా. వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్‌రెడ్డి మీద కేసులు న‌మోదు చేసే దాకా పోరాడుతాం. నేను చేసిన ఆరోప‌ణ‌లు త‌ప్పైతే మీడియా ప్ర‌తినిధులను ఎంపీ స్వ‌యంగా మైనింగ్ జ‌రిగే ప్రాంతాల‌కు తీసుకెళ్లి చూపించాలి. ఎంపీ చేస్తున్న అక్ర‌మ కార్య‌కలాపాల్లో బాధితులు 70 శాతం మందికిపైగా తెలుగుదేశం పార్టీ నాయ‌కులే ఉన్నారు.

Back to Top