తాడేపల్లి: అమరావతి రాజధానిలో పేదలు, బడుగువర్గాలు ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు భావిస్తున్నారని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పేదలకు గత వైయస్ జగన్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన 50వేల పట్టాలను ఈ ప్రభుత్వం రద్దు చేయడం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. అన్ని వర్గాలు నివాసం ఉన్నప్పుడే అది ప్రజా రాజధాని అవుతుందని గత ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్-5 జోన్‌ను తొలగించడం దారుణమని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... నిన్న చంద్రబాబు అమరావతి పేరుతో దేశ ప్రధానిని పిలిచి రాష్ట్రంలో పెద్ద ఈవెంట్‌ను నిర్వహించారు. చంద్రబాబు నాలుగు సార్లు సీఎం అయినా ఒకటికి రెండు సార్లు ప్రారంభించిన పనులకే మరోసారి శిలాఫలకాలు వేసుకోవడం అలవాటు. చివరికి ప్రధానిని పిలిచి కూడా అదే చేయించారు. 2014-19లో మట్టీ, నీరు తెచ్చి ఇచ్చారంటూ విమర్శించిన ప్రదానినే మరోసారి పిలిచి, గతంలో చేసిన పనులకు శంకుస్థాపన చేయించారు. ప్రజలకు అందుబాటులో ఉండే రాజధాని అంటే చంద్రబాబు దృష్టిలో ఆయనకు అనుకూలమైన సామాజికవర్గం మాత్రమే ఉండే రాజధాని అని. సమాజంలోని అన్ని వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం పనిచేయాలి. రాజధాని కూడా అందరి సొంతం. కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే పరిమితమైన దానిని ప్రజారాజధాని అని అనగలమా? రాజధానిలో అన్ని వర్గాలు ఉండాలని వైయస్ జగన్ భావించారు గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రాజధాని ప్రాంతంలో ఆర్5 జోన్‌ను ఏర్పాటు చేసి సమాజంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఇలా అన్ని వర్గాల వారు ఉండాలని భావించింది. అందుకోసం వారికి దాదాపు 900 ఎకరాలను కేటాయించింది. మొత్తం 50,793 మంది పేదలకు పట్టాలు ఇచ్చారు. వీరంతా రాజధాని ప్రాంతంలో ఉంటారని చెప్పారు. దీనిపై తెలుగుదేశం వ్యతిరేకిస్తూ న్యాయస్థానాల్లో 26 పిటీషన్లు వేయించింది. రాజధానిలో పేదలు ఉంటే, అది ప్రజారాజధానికే వ్యతిరేకమని మాట్లాడారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం జారీ చేసిన జీఓ 45 ని రద్దు చేయాలని న్యాయస్థానాల ముందు వాదనలు వినిపించారు. అన్ని వర్గాలు లేకుండా రాజధాని ఎలా ఉంటుందని న్యాయస్థానం పిటీషనర్‌ను ప్రశ్నించింది. దీనిని చంద్రబాబు డైరెక్షన్‌లో సుప్రీంకోర్ట్ వరకు తీసుకువెళ్లారు. దీనిపై అత్యున్నత న్యాయస్థానం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ కేసులను కొట్టేసింది. గత ప్రభుత్వంలో పేదలకు ఇచ్చిన ఇళ్లపట్టాలను రద్దు చేయడం, ఆర్5 జోన్‌నే తొలగించడం ద్వారా తమ నిజ స్వరూపాన్ని బయటపెట్టుకున్నారు. చంద్రబాబు ప్రజల ఖజానా నుంచి రాజధానిని నిర్మిస్తున్నారు. ప్రజల నెత్తిన అప్పు మోపుతున్నారు.పేదలకు సంబంధం లేకుండా ప్రపంచస్థాయిలో నిర్మించే రాజధానిలో అమరావతి ప్రాంతంలో ఉన్న వారిపైనే అప్పు భారం మోపుతాను, రాష్ట్రంలోని మిగిలిన వారికి ఈ అప్పులతో సంబంధం లేదని ప్రకటిస్తారా? చంద్రబాబుకు పేదలంటే పడదు. ప్రపంచ స్థాయి కేపిటల్ అని ప్రజలను మభ్య పెడుతున్నారు. ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు విభజన హామీల గురించి, పోలవరం గురించి ఎందకు చంద్రబాబు ప్రశ్నించలేదు. చంద్రబాబు చేస్తున్న డ్రామాలు, ఆయన చెబుతున్న అబద్దాలను ప్రజలు ఎల్లకాలం విశ్వసించలేరనే విషయం గుర్తించాలి.