ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మార్గంలో కీలక మైలురాయి

 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్‌

వైయ‌స్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ట్వీట్ 

విశాఖపట్నం : విశాఖపట్నంలో కొత్తగా నిర్మించిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో తొలి విమానం విజయవంతంగా ల్యాండింగ్‌ కావడం ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలిచిందని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. ఇది #VisionVizag లక్ష్యాన్ని సాధించే దిశగా మరో ముఖ్యమైన అడుగు పడినట్లుగా అభిప్రాయం వ్యక్తమైంది.

ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు నిర్మాణంలో అసాధారణ కృషి చేసిన జీఎంఆర్‌ గ్రూప్‌కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. విమానాశ్రయ నిర్మాణం కోసం గత పాలనా కాలంలో వేగవంతమైన అనుమతులు సాధించడమే కాకుండా, భూములు ఇచ్చిన బాధితులకు పునరావాసం కల్పించేందుకు, భూసేకరణ కోసం సుమారు రూ. 960 కోట్లను ఖర్చు చేసి ఈ ప్రాజెక్టుకు బలమైన పునాది వేశామని పేర్కొన్నారు. విమానాశ్రయానికి సంబంధించిన ప్రధాన పనుల్లో గణనీయమైన భాగం అప్పుడే పూర్తయ్యిందని గుర్తు చేశారు.

ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, చేసిన కృషి ఫలితంగానే ఈ రోజు భోగాపురం విమానాశ్రయం కీలక దశను చేరుకుందని తెలిపారు. ఇది విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని అన్నారు.

అలాగే విశాఖపట్నం పోర్టును భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో అనుసంధానించే భోగాపురం ఎయిర్‌పోర్ట్ బైపాస్ జాతీయ రహదారి ప్రాజెక్టుకు 2023 మార్చిలో ఆమోదం ఇచ్చిన కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ గారి సహకారం, కృషి ఎంతో కీలకమని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ రహదారి ప్రాజెక్టు పూర్తైతే విమానాశ్రయానికి వేగవంతమైన కనెక్టివిటీ లభించి, పారిశ్రామిక మరియు వాణిజ్య కార్యకలాపాలు మరింత ఊపందుకుంటాయని తెలిపారు.

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో విశాఖపట్నం ప్రాంతం అంతర్జాతీయ విమాన రవాణా పటంలో మరింత ప్రాధాన్యం సంతరించుకోనుందని, ఇది ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపించే కీలక సాధనంగా నిలుస్తుందని వైయ‌స్ జ‌గ‌న్ త‌న ఎక్స్ ఖాతాలో పోస్టు చేశారు. 

Back to Top