గుంటూరు: అమరావతి రాజధాని పేరుతో చంద్రబాబు భారీ దోపిడీకి తెర తీశారని మాజీ మంత్రి, వైయస్ఆర్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు మండిపడ్డారు. గుంటూరు క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు సెల్ఫ్ సస్టైన్ అని చెబుతూనే, మరోవైపు అమరావతి నిర్మాణం కోసం రూ.52 వేల కోట్ల అప్పులు తెచ్చి, చంద్రబాబు రాష్ట్ర ప్రజల స్థితిగతులను తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలను చెబుతుంటే అమరావతికి వైయస్ఆర్‌సీపీ వ్యతిరేకమనే బురద మాపై చల్లుతున్నారని అన్నారు. సీఎంగా అయిదేళ్ళలో రాజధానిని తాత్కాలిక భవనాలకే పరిమితం చేసిన చంద్రబాబు ఇప్పుడు అంచనాలు పెంచి, భారీ అవినీతితో జేబులు నింపుకునే కార్యక్రమానికి తెగబడ్డారని ధ్వజమెత్తారు. రాజధానిని విధ్వంసం చేస్తున్నది చంద్రబాబునని అన్నారు. ఇంకా ఆయనేమన్నారంటే... అమరావతిలో నిన్న చాలా పెద్ద ఈవెంట్‌ను రాష్ట్రప్రభుత్వం నిర్వహించింది. దానికి దేశ ప్రధాని నరేంద్రమోదీతో పాటు రాష్ట్రంలోని కూటమి ప్రముఖులు హాజరయ్యారు. జనాన్ని సమీకరించి బహిరంగసభ నిర్వహించారు. ఆ వేదిక మీద నుంచి చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్‌లు అనేక అబద్దాలను మాట్లాడారు. ఆ సభ చూసిన తరువాత అమరావతి అనేది ఒక అంతులేని కథ, దానికి సశేషం ఉండదు అని భావన రాష్ట్ర ప్రజానీకానికి కలిగింది. మొదటి నుంచి రాజధానిని అడ్డం పెట్టుకుని ఎలా జేబులు నింపుకోవాలన్నదే చంద్రబాబు ఆలోచన. నిజంగా రాజధాని నిర్మించే చిత్తశుద్ది చంద్రబాబుకు లేదు. రాష్ట్ర విభజన తరువాత అనుభవం ఉందని చంద్రబాబుకు ప్రజలు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. రాజధాని లేని రాష్ట్రానికి గొప్ప రాజధానిని, కొత్త నగరాన్నే తీసుకువస్తానంటూ చంద్రబాబు ఊదరగొట్టారు. 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా అమరావతి రాజధాని నిర్మాణంకు రూ.48 వేల కోట్ల రూపాయలతో పనులు చేపడుతున్నట్లు ప్రకటించి రూ.41 వేల కోట్లకు టెండర్లు పిలిచారు. గతంలో అయిదేళ్ల చంద్రబాబు పాలనలో అమరావతి కోసం చేసిన ఖర్చు ఎంతా అని చూస్తే కేవలం రూ.5,587 కోట్లు మాత్రమే. అవికూడా తాత్కాలిక భవనాలే. గడిచిన తెలుగుదేశం ప్రభుత్వంలో అసెంబ్లీ, సచివాలయం, హైకోర్ట్ ఇలా అన్నింటినీ ఖర్చు చేసింది కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే. కృష్ణానది పక్కన మహానగరం నిర్మించాలంటే నిర్మాణ వ్యయం ఎంతవుతుందని అనుకుంటున్నారు. గతంలో నిర్మించిన ఆరు లక్షల చదరపు అడుగల తాత్కాలిక నిర్మాణాలకు చదరపు అడుగుకు రూ.11 వేల రూపాయలు ఖర్చు చేశారు. అమరావతిని విధ్వంసం చేస్తున్నది చంద్రబాబే రాష్ట్రం విడిపోయి, ఏళ్ళ తరబడి రాజధాని లేకుండా ఏపీ ఇబ్బందులు పడుతోంది. రాజధానిని నిర్మించుకోవాలి. మరోవైపు ఆర్థిక పరిస్థితి బాగోలేదు. హైదరాబాద్ వంటి నగరాన్ని కోల్పోయాం. పదేళ్ళ పాటు హైదరాబాద్‌లోని మౌలిక సదుపాయాలను వినియోగించుకునేందుకు విభజన చట్టం మనకు వీలు కల్పించింది. 2014-19 చంద్రబాబు ప్రభుత్వానికి రాజధాని నిర్మాణానికి కేంద్రం రూ.2500 కోట్లు ఇచ్చింది. చంద్రబాబు సీఎంగా ఆ అయిదేళ్ళ పాటు ఏం చేశారు? రాజధానినే కాదు, అమరావతి నగరాన్నే నిర్మిస్తానని ప్రగల్భాలు పలికారు. విభజనతో గాయపడి, ఆర్థికంగా చితికిపోయిన రాష్ట్రం అత్యంత ఖరీదైన ఒక నగరాన్ని నిర్మించే స్థాయిలో ఉందా అని ఎంతో పాలనా అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు? రైతుల నుంచి 33 వేల ఎకరాలను సేకరించే సమయంలో వారికి అద్భుతమైన ఫ్లాట్స్ ఇస్తామని, వారిని లక్షాధికారులను చేస్తామని చెప్పారు. ఇంకా నేటికీ 33 శాతం మంది రైతులకు ఫ్లాట్‌లను రిజిస్టర్ చేయలేదు. అమరావతికి పేరు పెట్టింది, అమరావతిని విధ్వంసం చేస్తున్నదీ చంద్రబాబే. ఏకంగా రూ.లక్ష కోట్లతో అమరావతి రాజధాని నగరాన్ని నిర్మించే ఆర్థిక వనరులు ఏపీకి ఉన్నాయా? లేకపోయినా నిర్మిస్తానని చంద్రబాబు ఎలా ప్రజలను మభ్యపెట్టారు? ఇవ్వన్నీ ప్రశ్నించినందుకు వైయస్‌ఆర్‌సీపీ అమరావతికి వ్యతిరేకం అంటూ మాపైన బుదరచల్లారు. ప్రపంచస్థాయి రాజధానిని నిర్మిస్తుంటే వైయస్ఆర్‌సీపీ అడ్డుకుంటోందని అడ్డగోలు ఆరోపణలు చేశారు.అది పూర్తిగా అవాస్తవం. అమరావతి విషయంలో ఇది సెల్ఫ్ సస్టైన్ మోడల్ అని చంద్రబాబు చెప్పుకున్నారు. రాజధానికి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదని అబద్దాలు చెప్పారు. దీనిపై వాస్తవాలను మేం వెల్లడించాం. న్యాయస్థానంలో సమర్పించిన అఫిడవిట్‌లో కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రాజధానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చే స్థితిలో రాష్ట్రం లేదని ఆధారాలతో సహా అందించాం. అప్పులు తెచ్చి... అంచనాలు పెంచి... దోపిడీ చంద్రబాబు భయంకరమైన అప్పులు చేస్తూ, రాజధాని నిర్మాణం కోసం అని చెబుతున్నారు. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్ల అప్పులు తీసుకువచ్చారు. గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం అప్పులు చేస్తుంటే అది తప్పని, రాష్ట్రం శ్రీలంక అవుతుందని చంద్రబాబు గగ్గోలు పెట్టారు. ఇప్పుడు అమరావతి నిర్మాణం పేరుతో ఏడీబీ బ్యాంక్ నుంచి రూ.15 వేల కోట్లు, కెఎఫ్‌డబ్ల్యు నుంచి రూ.5 వేల కోట్లు, హడ్కో నుంచి రూ.26 వేల కోట్లు, సీఆర్‌డీఏ కమిట్ అయిన అప్పులు మరో రూ.21 వేల కోట్లు. ఇది ఎంత వరకు సమంజసం? ఈ రూ.52 వేల కోట్లు పారదర్శకంగా ఖర్చు చేస్తున్నారా? గతంలో రూ.48వేల కోట్ల టెండర్లను రూ.77 వేల కోట్లకు పెంచి మరీ పిలిచారు. ఎందుకు ఇంతగా అంచనాలు పెంచారు? గతంలో రూ. 2,271 కోట్లు శాసనసభ నిర్మాణంకు అంచనా వేస్తే, నేడు దానిని రూ.4,682 కోట్లు పెంచారు. అప్పటికీ, ఇప్పటికీ సిమెంట్, ఐరన్ రేట్లు తగ్గినా కూడా ఈ అంచనాలు ఎలా పెంచారు? అప్పులు తెచ్చి అమరావతి నిర్మాణం కాదు, దోపిడీకి పాల్పడుతున్నారు. కిలోమీటరు జాతీయ రహదారి నిర్మాణంకు రూ.20 కోట్లు ఖర్చు అవుతుంటే, అమరావతిలో మాత్రం ఏకంగా రూ.50 కోట్లు అంచనా వేశారు. ఇది దోపిడీ కాదా? ప్రజల ఆర్థిక స్థితిగతులను తాకట్టు పెడుతూ చంద్రబాబు చేస్తున్న చారిత్రాత్మక తప్పిదం ఇది. ప్రధానిని గ్రాంట్ ఎందుకు అడగలేదు? కేంద్రంకు టీడీపీ మద్దతు అవసరం కాబట్టి ప్రధాని రెండోసారి అమరావతి పనుల శంకుస్థాపనకు వచ్చారు. పరస్పర అవసరాలతో ఉన్న కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల మధ్య రుణాలు ఎందుకు? నేరుగా గ్రాంట్‌లు తెచ్చుకోవచ్చు. దానివల్ల ప్రజలపై కూడా భారం పడదు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అమరావతిని 53 వేల ఎకరాలను సేకరించి సర్వనాశనం చేసి, అన్నీ తాత్కాలిక నిర్మాణాలు చేశారు. ఇప్పుడు మరో 45 వేల ఎకరాలు కావాలని అంటున్నారు. ఇప్పటికే భూములిచ్చిన రైతులు లబోదిబో మంటున్నారు. ఇప్పుడు అక్కడ భూములను కొనేవారు లేదు. అటువంటి దౌర్భాగ్యమైన స్థితికి అమరావతిని నెట్టేశారు. గన్నవరంలో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో కేంద్ర సహకారంతో ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌గా అభివృద్ది చేశాం. దానిని పక్కకుపెట్టి, అమరావతిలో మరో అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌ను తీసుకువస్తామని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఎయిర్‌పోర్ట్ పక్కనే చంద్రబాబు వియ్యంకుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ భూములు కొనుగోలు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. అమరావతి చట్టబద్దతపై ప్రధానిని ఎందుకు అడగలేదు? చంద్రబాబు అమరావతి అనే భ్రమరావతి ఊహాచిత్రాన్ని చూపి ప్రజలను మోసం చేస్తున్నారు. గత అయిదేళ్ళలో చేయలేని రాజధానిని, మూడేళ్ళలో చేయగలనని ఎలా చెబుతున్నారు? అమరావతి ప్రాంతంలోని ప్రజలు దీనిని ఆలోచించాలి. గతంలో మట్టీ, నీరు తెచ్చి మా ముఖాన కొట్టారని గతంలో చంద్రబాబు ప్రధాని నరేంద్రమోదీపై విమర్శించారు. పవన్ కళ్యాణ్ ఏకంగా పాచిపోయిన లడ్డూలు ఏపీకి ఇచ్చారని దుయ్యబట్టారు. ఈరోజు వేదికపై అదే నాయకులు ప్రధాని నరేంద్రమోదీని పొగడ్తలతో ముంచెత్తారు. గతంలో అమరావతి ప్రాంతంలోనే చంద్రబాబును ప్రజలు ఓడించారు. అయినా ఆయన ఆత్మవిమర్శ చేసుకోలేదు. అమరావతికి చట్టబద్దత తీసుకువస్తామని చంద్రబాబు చెప్పారు. ఏపీకి వచ్చిన ప్రధానిని దీనిపైన ఎక్కడైనా అడిగారా? కనీసం గ్రాంట్ కూడా అడగలేదు. అమరావతిని అభివృద్ది చేసేందుకు వైయస్ఆర్‌సీపీ ప్రయత్నిస్తే కోర్ట్‌ల ద్వారా వాటిపై స్టేలు తీసుకువచ్చారు. అమరావతిలో నేడు ప్రారంభిస్తున్న పనులు పునాదుల నుంచి పైకి కూడా తీసుకురాగలరా అనే అనుమానాలు కలుగుతున్నాయి. నిర్మాణ వ్యయం మూడురెట్లు పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రాబోయే నాలుగేళ్ళలో అమరావతిని చంద్రబాబు పూర్తి చేయలేరు. అమరావతి కోసం చేస్తున్న అప్పుల్లోంచి కమీషన్లు కాజేసే కార్యక్రమం చేస్తున్నారు. విభజన హామీల గురించి కూడా ప్రధానిని అడగలేదు. పోలవరం ఎత్తు గురించి మాట్లాడలేదు.