చంద్ర‌బాబు స్కీంల‌న్నీ స్కాములే

ఏ ప‌థ‌కం చూసినా అవినీతి మ‌య‌మే

బీసీ మ‌హిళ‌ల‌ను అడ్డం పెట్టి భారీ దోపిడీ 

కుట్టు మిష‌న్ల శిక్ష‌ణ పేరుతో రూ. 154 కోట్ల‌కు స్కెచ్

వివ‌రాలు వెల్ల‌డించిన తూర్పుగోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌

ఐటీ, ఏఐ టెక్నాల‌జీ పేరు చెప్పి కుట్టుమిష‌న్లు పంచాడు 

ఆ మిష‌న్లు ఇచ్చే పేరుతో కోట్లు కొల్ల‌గొడుతున్నారు 

టెండ‌ర్ల ద‌శ నుంచి శిక్ష‌ణ వ‌ర‌కు ప్ర‌తిదీ అవినీతే

రాజ‌మండ్రి రూర‌ల్ వైయ‌స్ఆర్‌సీపీ కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఏ స్కీం ర‌చించినా దానివెనుక స్కాం త‌ప్ప‌కుండా ఉంటుంద‌ని తూర్పుగోదావ‌రి జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ  విమ‌ర్శించారు.  దానికి చ‌రిత్ర‌లో ఎన్నోవంద‌ల ఉదాహ‌ర‌ణ‌లున్నాయి. అలాంటిదే కొత్త‌గా మ‌రో స్కాం బ‌య‌ట‌కొచ్చింది. బ‌ల‌హీనవ‌ర్గాల మ‌హిళ‌లను ఆర్థికంగా నిల‌దొక్కుకునేలా చేస్తామ‌ని చెప్పుకుంటూ కూట‌మి ప్రభుత్వం భారీ అవినీతికి తెర‌దీసింది. చంద్ర‌బాబు మాట‌ల‌కు చేత‌ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంటుంది. పేద‌ల పేరుతో సంప‌ద కొల్ల‌గొట్ట‌డంలో చంద్ర‌బాబు సిద్ధ‌హ‌స్తుడు. పేద‌ల‌కు ల‌బ్ధి చేకూర్చిన‌ట్టు పైకి చెప్ప‌కుంటూ ఆయ‌న ఆయ‌న మ‌నుషులు లాభ‌ప‌డ‌తారు. చంద్రబాబు ఐటీ తెచ్చాన‌ని చెప్పుకుంటారు. ఏఐ టెక్నాల‌జీ గురించి మాట్లాడ‌తారు. డ్రోన్లు వాడాలంటాడు. ప్ర‌తి ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగి ఉండాలంటాడు. చివ‌రికి మ‌హిళ‌ల‌కు కుట్టు మిష‌న్లు పంపిణీ చేస్తాడు. కుట్టు మిష‌న్ల పంపిణీ ద్వారా వారిని ఏ విధంగా ఐటీ ఉద్యోగుల‌ను చేస్తాడో అర్థంకాని పెద్ద శేష ప్ర‌శ్న‌. కుట్టుమిష‌న్ల పంపిణీ పేరుతో త‌న అనుచ‌రుల జేబులు మాత్రం బాగానే నింపుతున్నారు.  

ఒక్కో ల‌బ్ధిదారు పేరుతో రూ. 16 వేలు దోపిడీ

రూ. 221 కోట్ల‌తో కూట‌మి ప్ర‌భుత్వం కుట్టుమిష‌న్లు పంపిణీ కార్య‌క్ర‌మం చేప‌ట్టింది. 1,02,832 మంది మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు అందించే పేరుతో చేపట్టిన స్కీమ్‌లోదాదాపు రూ.154 కోట్లకు పైగా దండుకోవడానికి సిద్ధమైంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మ‌హిళ‌ల‌కు శిక్ష‌ణ ఇస్తామ‌ని చెప్పిన చంద్ర‌బాబు, ఆ ప‌నులు ప్రారంభించకుండా దోపిడీకి మాత్రం డోర్లు బార్లా తెరిచారు. 1,02,832 మంది మహిళలకు  శిక్షణ కోసం మొత్తం రూ. 221.08 కోట్లు కేటాయించారు. ఇందులో కుట్టుమిష‌న్‌కి రూ. 4300, ఒక్కో మహిళ‌కు శిక్ష‌ణ కోసం రూ. 3 వేలు ఖ‌ర్చు చేస్తున్నామ‌ని చెప్పారు. ఈ విధంగా మొత్తం అయ్యే ఖ‌ర్చు రూ. 75.06 కోట్లే. మిగిలిన రూ. 154 కోట్ల‌కు మాత్రం లెక్క‌లే లేవు. ఒక్కో ల‌బ్ధిదారు పేరు మీద దాదాపు రూ. 16 వేల వ‌ర‌కు దోపిడీకి పాల్ప‌డుతున్న‌ట్టు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది.  

మొబిలైజేష‌న్ అడ్వాన్సు పేరుతో రూ. 25 కోట్లు..

శిక్షణ పేరుతో 50 రోజుల్లోనే మొత్తం బిల్లులు కింద లాగేసేందుకు పథకం రూపొందించారు. టెండ‌ర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం బీసీ, ఈడబ్ల్యూఎస్, కాపు మహిళలకు టైలరింగ్‌ శిక్షణ ప్రారంభమైన 15 రోజులకు 33 శాతం, 30 రోజులకు మరో 33 శాతం, 50 రోజులకు మిగిలిన 33 శాతం బిల్లులు చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా పూర్తిస్థాయిలో కుట్టు శిక్షణే ప్రారంభం కాలేదు. మొబిలైజేషన్‌ అడ్వాన్సు కింద రూ.25 కోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకు రంగం సిద్ధమవుతోంది. నీకింత.. నాకింత రూల్ ప్ర‌కారం ప్ర‌భుత్వ ఖ‌జానాను దోచుకోవ‌డానికి బీసీ మ‌హిళ‌ల‌ను పావులుగా వాడుకుంటున్నారు. నిబంధ‌న‌ల ప్ర‌కారం ఒక్కో ల‌బ్ధిదారుకి 45 రోజుల‌పాటు దాదాపు 360 గంట‌ల శిక్ష‌ణ ఇవ్వాల్సి ఉంటే, కేవ‌లం 135 గంట‌ల మాత్ర‌మే శిక్ష‌ణ ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ల‌బ్ధిదారుల‌కు ట్రైనింగ్ కిట్ కూడా ఇవ్వ‌డం లేదు. 

పేరున్న శిక్ష‌ణ సంస్థ‌ల‌ను కాద‌ని
కుట్టు శిక్షణ ఇచ్చేందుకు సొసైటీ ఫర్‌ ఎంప్లాయ్‌మెంట్‌ జనరేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రైజ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ (సీడాప్‌), ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక, సాంకేతిక కన్సల్టెన్సీ సంస్థ (ఏపీఐటీసీవో)తో పాటు కేంద్ర సంస్థ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ్‌ కౌశల్‌ యోజన (డీడీయూజీకేవై) ఉన్నాయి. వీటికి శిక్షణ కేంద్రాలు, శిక్షణ భాగస్వాములు ఉన్నారు. స్కిల్‌ పోర్టల్స్, అన్ని జిల్లాల్లో పర్యవేక్షణ వ్యవస్థ, సిబ్బంది సైతం ఉన్నారు. అయినా వాటిని కాదని ఆంధ్రప్రదేశ్‌ బీసీ సహకార ఆర్థిక సంస్థ ద్వారా స్కీమ్‌ను చేపట్టి భారీ స్కామ్‌కు మార్గం సుగమం చేసుకున్నారు. ఈ స్కీమ్ ర‌చ‌న‌లో కీల‌క‌పాత్ర పోషించిన ఒక రిటైర్డ్ అధికారికి త‌గిన ప్రోత్సాహ‌కం ఇచ్చార‌ని నాకు స‌మాచారం ఉంది. 

టెండ‌ర్ల‌లోనూ మాయాజాలం
దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ ప‌థ‌కాన్ని సిద్ధం చేసిన చంద్ర‌బాబు, టెండ‌ర్ల ద‌శ నుంచే చ‌క్రం తిప్ప‌డం మొద‌లైంది. 
ప్రి బిడ్‌లో మొత్తం 65 కంపెనీలు పాల్గొంటే 56 సంస్థలను ముందే తిరస్కరించారు. కుట్టు శిక్షణలో విశేష అనుభవంతో పాన్‌ ఇండియా కంపెనీగా గుర్తింపున్న ఐసీఏ కూడా ఇందులో ఉండ‌టం విచిత్రం టెండర్లలో తక్కువ మొత్తానికి కోట్‌ చేసిన సంస్థను కాద‌ని అంతకంటే ఎక్కువకు కోట్‌ చేసిన మరో రెండు సంస్థలను కలిపి రంగంలోకి దించారు. మిగిలిన 9 కంపెనీల్లో ఆరు సంస్థల టెండర్లను తెరవకముందే తమదైన శైలిలో పక్కకు తప్పించేశారు. అంటే.. మొత్తం 65 కంపెనీల్లో 62ను తొలగించేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జ‌రిగిందే.  
చంద్రబాబు ప్రభుత్వం తమవారికి శిక్షణ కాంట్రాక్టు అప్పగించడానికి ఇన్ని అడ్డంకులు పెట్టినా తట్టుకుని.. శ్రీ టెక్నాలజీ తక్కువ మొత్తానికి కోట్‌ చేసి ఎల్‌1గా నిలిచింది. కానీ, దానిని బెదిరించి 5 శాతం పని మాత్రమే అప్పగించారు. ఎల్‌2, ఎల్‌3గా నిలిచిన సంస్థలకు మాత్రం 95 శాతం పని ఇచ్చారు. 

గ‌తంలోనూ ఆద‌ర‌ణ పేరుతో మిష‌న్ పంపిణీ పేరుతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌ను వంచించారు. వైయ‌స్ జ‌గ‌న్ హ‌యాంలో మ‌హిళ‌ల‌ను తలెత్తుకుని జీవించేలా ప‌థ‌కాల‌ను రూపొందించ‌డం జ‌రిగింది. ఈబీసీ నేస్తం, జ‌గ‌న‌న్న చేయూత‌, ఆస‌రా, అమ్మ ఒడి ప‌థ‌కాల ద్వారా మ‌హిళ‌ల‌కు ఆర్థికంగా వెన్నుద‌న్నుగా నిలిచారు. బీసీల జీవితాల్లో వెలుగులు నింపితే, చంద్ర‌బాబు నేతృత్వంలోని కూట‌మి ప్ర‌భుత్వం బీసీల‌ను అడ్డం పెట్టుకుని భారీ దోపిడీకి పాల్ప‌డుతోంది.

Back to Top