గుంటూరు: సోషల్ మీడియాలో పార్టీ మీద, పార్టీ నేతల మీద తప్పుడు వ్యాఖ్యలు, ప్రేలాపనలు చేసే సీమ రాజా, కిర్రాక్ ఆర్పీలాంటోళ్లను వదలబోమని, చట్టం ముందు దోషులుగా నిలబెట్టి తీరతామని గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు హెచ్చరించారు. తనపైన, తమ పార్టీకి చెందిన నాయకులు పైన సీమ రాజా, కిరాక్ ఆర్పి అసభ్యంగా పోస్టులు పెట్టడంతో పాటు అసభ్య పదాలతో దూషిస్తున్నారంటూ గుంటూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, మాజీ ఎంపి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు స్పందించడం లేదని.. అందుకే న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి వస్తోందని అన్నారు. గతంలోనూ మేం ఫిర్యాదులు చేశామని, కానీ పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. అందుకే ఈసారి రసీదు తీసుకున్నామన్నారు. మేం ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని, టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగానే తప్పుడు కేసులు పెడుతున్నారని ఆక్షేపించారు. ఐటీడీపీ పేరుతో చంద్రబాబు, లోకేష్ ప్రొత్సహంతో వైయస్ఆర్‌సీపీ నేతలపై ప్రేలాపనలు చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు వాళ్లపై చర్యలు తీసుకునేంతవరకు పోరాటాలు చేస్తామన్నారు. దోషులను చట్టబద్ధంగా శిక్షించే వరకు మా పోరాటం జరుగుతుందని హెచ్చరించారు. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్తామని, పార్టీ ఇన్ పర్సన్‌గా నా ఆవేదనను నేనే స్వయంగా వినిపిస్తానని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. చట్టం సీమ రాజాను, కిర్రాక్ ఆర్పీ లాంటి వాళ్లను వదలదని, ఎంత పెద్దవారు అయినా శిక్ష నుంచి తప్పించుకోలేరని ఆయనహెచ్చరించారు.