వైయ‌స్ఆర్‌సీపీ సీనియర్‌ నేత సింగరాజు వెంకట్రావు కన్నుమూత

ఒంగోలు: వైయ‌స్ఆర్‌సీపీ ఒంగోలు నగర అధ్యక్షుడు సింగరాజు వెంకట్రావు (55) అనారోగ్యంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయన కొన్ని నెలలుగా హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నారు. కోలుకుంటున్నారని అందరూ భావిస్తున్న సమయంలో ఆయన మరణవార్త తెలియడంతో అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. హైదరాబాద్‌ నుంచి మంగళవారం మధ్యాహ్నం భౌతికకాయాన్ని ఒంగోలు బండ్లమిట్టలోని ఆయన నివాస గృహానికి తీసుకొచ్చారు.  

 కన్నీటి పర్యంతమైన బాలినేని దంపతులు.. 
వెంకట్రావు భౌతికకాయం ఒంగోలుకు రాగానే  వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో ఆర్డినేటర్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన సతీమణి శచీదేవి, కుమారుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి అక్కడకు చేరుకున్నారు. వెంకట్రావు భౌతికకాయాన్ని పట్టుకుని బాలినేని కన్నీటి పర్యంతమయ్యారు. నగరంలో మంచి అభిమానాన్ని సంపాదించుకున్న సింగరాజు వెంకట్రావు భౌతికకాయాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. 

ఫోన్‌లో పరామర్శించిన మంత్రి సురేష్‌.. 
సింగరాజు వెంకట్రావు మృతికి రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకట్రావు కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. వెంకట్రావు పార్టీకి అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నామన్నారు.    

ఇదీ వెంకట్రావు ప్రస్థానం.. 
సింగరాజు వెంకట్రావు నగరంలో వైయ‌స్ఆర్‌సీపీకి ఎంతో కీలకమైన నేత. ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి అత్యంత నమ్మకస్తుడు. వైయ‌స్ఆర్‌సీపీ ప్రతిపక్షంలో ఉన్నా...అధికారంలో ఉన్నా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో, టీడీపీ ప్రభుత్వంలో అద్దంకి బస్టాండ్‌లో దుకాణాలను కూల్చివేసిన సమయంలో అండగా నిలబడి కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపారు. కమ్మపాలెంలో వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయం ప్రారంభాన్ని టీడీపీ నేతలు అడ్డుకున్న సమయంలోనూ ఆయన వారిని ఎదిరించి నిలిచారు. ఈ క్రమంలో జైలుకు సైతం వెళ్లారు. పారీ్టలో ఆయన సేవలకు గుర్తింపుగా సింగరాజు వెంకట్రావు సతీమణి మీనాకుమారికి ఒంగోలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ తొలి చైర్‌పర్సన్‌గా నామినేటెడ్‌ పోస్టు కేటాయించారు.

ఈ క్రమంలో ఆయన అనారోగ్యానికి గురై కన్నుమూయడం అందరినీ కలిచివేసింది. వెంకట్రావుకు భార్య మీనాకుమారితో పాటు కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రావు భౌతికకాయానికి నగర మేయర్‌ గంగాడ సుజాత, బైరెడ్డి అరుణ, కుప్పం ప్రసాద్, వేమూరి సూర్యనారాయణ, వెలనాటి మాధవరావు, కటారి శంకర్, గంటా రామానాయుడు, సింగరాజు రాంబాబు, తోటపల్లి సోమశేఖర్, దామరాజు క్రాంతికుమార్, పంది రత్నరాజు, కార్పొరేటర్‌ బేతంశెట్టి శైలజ, హరిబాబు, పటాపంజుల శ్రీనివాసులు, బొట్ల సుబ్బారావు, పెద్దిరెడ్డి భాస్కరరెడ్డి, షేక్‌ మీరావలి ఇతర నేతలు నివాళులర్పించారు. 

నేడు అంత్యక్రియలు... 
బుధవారం స్థానిక బండ్లమిట్టలోని వెంకట్రావు నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభం కానుంది. ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.   

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top