విశాఖపట్నం: విశాఖ పోర్టు వేదికగా రేషన్ బియ్యం అక్రమ తరలింపులో కూటమి నాయకుల హస్తం ఉందని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆరోపించారు. విశాఖలో మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్)లో తనిఖీ చేసి పక్కనే ఉన్న రెండు వేర్‌హౌజ్‌లు ఎందుకు వదిలేశారని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ ముఖ్యనేత బంధువుది కావడం వల్లే వాటిలో తనిఖీలు చేయలేదా అని నిలదీశారు. వెంటనే ఆ వేర్‌హౌజ్‌ల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో చోడవరం మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడారు. కరణం ధర్మశ్రీ ప్రెస్‌మీట్ పాయింట్స్: – కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఆరు నెలల్లో ప్రజలను ఉద్ధరించింది శూన్యం. ప్రతి దానికీ గత ప్రభుత్వాన్నే నిందిస్తూ, తమ వైఫల్యాలు కప్పి పుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. – విశాఖ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆరోపణలు.. కేవలం వైయస్ఆర్‌సీపీ మీద బురద చల్లడానికి చేస్తున్న దుష్ప్రచారం. నిజానికి ఈ విషయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు యథేచ్ఛగా బియ్యం అక్రమ రవాణా చేస్తుంటే, వారు చెప్పినట్టు ఒక్కరి మీదనైనా ఉక్కుపాదం మోపారా?. – ఆరోజు కాకినాడ పోర్టుకి తనిఖీకి వెళ్లిన మంత్రి నాదెండ్ల మనోహర్, టీడీపీ మంత్రికి చెందిన షిప్‌ను తనిఖీ చేయకుండా ఎందుకు వదిలేశారు?. బియ్యం అక్రమ రవాణా చేసే వారి తాట తీస్తామన్న ఆయన మాటలన్నీ తాటాకు చప్పుల్లే. అవన్నీ కాలయాపన కోసం చేస్తున్న డ్రామాలే. – విశాఖ నుంచి అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే రేషన్ బియ్యం అక్రమంగా విదేశాలకు రవాణా చేస్తున్నట్లు నిరూపించడానికి మేము సిద్ధం. బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్న టీడీపీకి అనుకూలమైన వ్యక్తుల వివరాలన్నీ మాకు తెలుసు. – అలాంటిది ప్రభుత్వం తన యంత్రాగంతో విచారణ జరిపించి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. – విశాఖపట్నం పోర్టు అథారిటీ (వీపీఏ)కు అనుబంధంగా విశాఖ కంటైనర్ టెర్మినల్ ప్రైవేట్ లిమిటెడ్ (వీసీటీపీఎల్) పని చేస్తోంది. ఇక్కడి నుంచే వివిధ దేశాలకు ఎగుమతి దిగుమతులు జరుగుతుంటాయి. – కంటైనర్ కార్గోకు సంబంధించి కంటైనర్ ఫ్రీట్ స్టేషన్లు (సీఎఫ్‌ఎస్) ఉంటాయి. ఈనెల 9న మంత్రి నాదెండ్ల సీఎఫ్‌ఎస్‌లను ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అక్కడి బియ్యం ప్రజా పంపిణీ వ్యవస్థకు చెందిందని, అందుకే వెంటనే దాన్ని సీజ్ చేయాలని ఆదేశించారు. – కానీ పక్కనే ఉన్నమరో రెండు వేర్‌హౌజ్‌లను మాత్రం పట్టించుకోకుండా వదిలేశారు. నిజానికి అక్కడే కోట్ల విలువైన వేల టన్నుల రేషన్ బియ్యం ఉంది. ఆ విషయం తెలిసే, మంత్రి అక్కడికి వెళ్లలేదు. – బ్రోకర్ సంస్థలతో కుమ్మక్కై , అది పీడీఎస్ బియ్యం అని తెలిసినా తనిఖీ చేయకుండా వెళ్లపోయారు. దీని వల్ల బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ పెద్దలే కవచంలా దగ్గరుండి ప్రోత్సహిస్తున్నట్టు అర్థమైపోతోంది. – బియ్యం అక్రమ రవాణాలో మంత్రి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి విశాఖలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ద్వారా రేషన్ బియ్యాన్ని సీఎఫ్‌ఎస్‌కి పంపించి యథేచ్చగా కంటైనర్లు దేశం దాటిస్తున్నారు. – టీడీపీ సానుభూతిపరుడిగా ఉండి షిప్పింగ్ వ్యవస్థను శాసించే స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి ఇప్పటికే 60 కంటైనర్లలో బియ్యం తరలించగా, మరో 110 టన్నులు తరలిస్తున్నారు. మొత్తం 10,600 టన్నుల బియ్యం దేశం దాటిస్తున్నారు. మరో వారంలో 90 కంటైనర్లలో బియ్యం తరలించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. – కాగా, ఈనెల 9న 483 టన్నుల బియ్యాన్ని సీజ్ చేయాలని ఆదేశించిన మంత్రి, 48 గంటల్లో దానికి సంబంధించిన డాక్యుమెంట్లు, బిల్లులు సమర్పించాలని కోరినా, ఇప్పటికీ దానిపై ఎలాంటి స్పందన లేదు. – ఇంత అడ్డగోలుగా బియ్యం అక్రమ తరలిస్తున్న విషయం మాలాంటి వారికే తెలుస్తున్నప్పుడు మంత్రిగా అధికారం చెలాయిస్తున్న వ్యక్తికి ఎందుకు తెలియడం లేదు?. వేల కోట్ల విలువ చేసే బియ్యం మీ కనుసన్నల్లో విదేశాలకు అక్రమంగా తరలిపోతుంటే మామీద ఆరోపణలు చేయడం సబబేనా?. – ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి రేషన్ బియ్యం అక్రమ తరలింపును అడ్డుకోవాలని మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కోరారు.