విశాఖ: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు భారత రాజ్యాంగమే స్ఫూర్తి అని వైయస్ఆర్‌సీపీ సీనియర్ నాయకులు, రీజినల్ కో-ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖలో నిర్వహించిన రాజ్యాంగ ఆమోద దినోత్సవంలో మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. దేశ ప్రజలందరికీ న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రాజ్యాంగం రూపొందించబడిందన్నారు. 1949, నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికీ భాతర రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు. అంబేద్కర్ భావజాలాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి కాపాడుతున్నారని చెప్పారు. రాజ్యాంగం చెప్పిన గ్రామ స్వరాజ్యానికి రూపకల్పన చేసి గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. సంక్షేమ పథకాలను గడప వద్దకే అందిస్తూ సీఎం వైయస్ జగన్ ఆదర్శంగా నిలిచారని చెప్పారు. నయా అంటరానితనాన్ని నిర్మూలించేందుకు విద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అనంతరం నూతన జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన పంచకర్ల రమేష్ ను పార్టీ కార్యకర్తలకు వైవీ సుబ్బారెడ్డి పరిచయం చేశారు.