అనంతపురం: ఎన్నికల సమయంలో రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక మాట తప్పారని వైయస్ఆర్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మండిపడ్డారు. ఆ ధరల స్థిరీకరణ నిధి ఉండి ఉంటే అనంతపురం జిల్లాలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకునేవాడు కాదని స్పష్టం చేశారు. రైతు ఆత్మహత్య చేసుకుంటే హడావుడిగా పోస్టుమార్టం చేయించి శవ రాజకీయం చేసింది కూటమి ప్రభుత్వమేనని, మేం రైతు గౌరవాన్ని కాపాడేవిధంగా వ్యవహరించామన్నారు. రైతుల కోసమే మా నాయకుడు వైయస్ జగన్ రాజకీయం చేస్తారని ఉద్ఘాటించారు. అనంతపురం జిల్లాలో అరటి రైతు నాగలింగం ఆత్మహత్యపై ప్రభుత్వం వ్యవహరించిన తీరు అనాగరికమని ఆయన తీవ్రంగా విమర్శించారు. అనంతపురం పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రెస్‌మీట్‌లో డాక్టర్ సాకే శైలజానాథ్ ఏమన్నారంటే.. రైతుని కాపాడుకోవాలని మా పోరాటం అనంతపురం జిల్లాలోని ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం ఆత్మహత్య వార్త అందరికీ కలచివేసింది. ఈ జిల్లా ఎంత కష్టాన్ని చూసిందో అందరికీ తెలుసు. నాలుగు రోజులు బాగుంటే పది రోజులు కష్టాలు తప్పవు. రైతు కుటుంబం శిధిలమవుతుంటే అధికార పార్టీ మాత్రం మానవత్వం లేకుండా ప్రవర్తించింది. రైతు నాగలింగం మృతదేహానికి ఉదయం 6 గంటలకు హడావుడిగా పోస్టుమార్టం చేయించారు. ప్రభుత్వ ఒత్తిళ్లు, బెదిరింపులతోఆ కుటుంబాన్ని బలవంతంగా ఒప్పించారు. ఇది సెన్సిటివిటీ ఉన్న ప్రభుత్వమా?. హడావుడిగా పోస్టుమార్టం..పోలీసు బందోబస్తు మధ్య అంత్యక్రియలు అరటి రైతు నాగలింగం ఆత్మహత్య చేసుకుంటే ఈ ప్రభుత్వం హడావుడిగా పోస్టు మార్టం చేయించింది. పోలీసు బందోబస్తు మధ్య అంత్య క్రియలు నిర్వహించింది. మేం రైతు అంత్యక్రియల్లో పాల్గొన్నాం. అధికార పార్టీ నేతలు కూడా వస్తారని అనుకున్నాం. కానీ ఎక్కడా కనిపించలేదు. రైతును రాజుగా మార్చాలన్నదే వైయస్ జగన్ విధానం “వ్యవసాయం దండగ అన్నదే మీ నాయకుడి (చంద్రబాబు) అసలు స్వభావం. అదే కారణంగా నాగలింగం లాంటి రైతులు బలవన్మరణాలు చేసుకుంటున్నారు. శవ రాజకీయాలు చేయడమే మీ పార్టీ చరిత్ర. రైతులను రాజులుగా మార్చాలన్నదే వైఎస్సార్, వైఎస్ జగన్ విధానం. రైతు సమస్యలపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు అరటి రైతుల సమస్యపై మా నాయకుడు వైఎస్ జగన్ పార్లమెంట్‌లో గళమెత్తించారు. కాని ఇంతవరకు చంద్రబాబు ఒక్క సమీక్ష కూడా పెట్టలేదు. 7 వేల రూపాయలకు కొనేస్తామని చెప్పి, ఒక గెల అరటి కూడా ఈ ప్రభుత్వం కొనలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ లేదు, బీమా లేదు. పేపర్లలో యాడ్స్ మాత్రమే ఉన్నాయి రాయితీలు, బీమా – మేమే ఇచ్చాం మా ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు 10,778 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు వాటి తలుపులు తీసే నాథుడులేడు. రైతు భరోసా కింద 53.58 లక్షల మంది రైతులకు రూ.34,800 కోట్లు మేమే ఇచ్చాం. ఉచిత పంటల బీమా కింద 54 లక్షల మంది రైతులకు రూ.7805 కోట్లు మా ప్రభుత్వం చెల్లించింది. రైతు జీవితాలను బాగుచేయడమే మా రాజకీయాలు విత్తనం నుంచి విక్రయం వరకు రైతు చేయిపట్టుకుని నడిపించేది మా వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం. ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లు అనంతపురానికి కేటాయించి ఉంటే నాగలింగం చనిపోయేవాడా?. కూటమి పాలనలో ఇప్పటి వరకు 250 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు — ఒక్క కుటుంబానికీ పరిహారం లేదు. నాగలింగం కుటుంబానికి రూ.25 లక్షలు వెంటనే ఇవ్వాలి. “ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ రైతుల గురించి ఒక్క మాట మాట్లాడడంలేదు. రైతులారా… నిరాశ పడకండి — భవిష్యత్తు మనదే. ఆత్మహత్యల గురించి ఆలోచించకండి. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఇంటికి పంపించి, మళ్లీ రైతు ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం ” అని డాక్టర్ సాకే శైలజానాథ్ విజ్ఞప్తి చేశారు.