మనుషులను చంపే వ్యక్తిత్వం చంద్రబాబుది

అంబులెన్స్‌కు దారివ్వకపోవడం బాబు నీచ సంస్కృతికి నిదర్శనం

చంద్రబాబు ప్రసంగం అంతా అబద్ధాల పుట్ట

మద్యం ధరలపై గగ్గోలుపెట్టడం విడ్డూరంగా ఉంది

ఐటీ దాడులపై మాట్లాడకుండా తండ్రీకొడుకులు తప్పించుకుని తిరుగుతున్నారు

తొమ్మిది మాసాలుగా రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన సాగుతోంది

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం దిశగా సీఎం వైయస్‌ జగన్‌ అడుగులు

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు

తాడేపల్లి: చంద్రబాబుది మనషులను చంపే రాక్షసానందం పొందే వ్యక్తిత్వమని,  పిల్లనిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచి కర్కశంగా చంపాడని, పదవి కోసం ఎన్ని ప్రాణాలు పోయినా లెక్క చేయని స్వభావం చంద్రబాబుదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. 108 వాహనానికి దారి ఇవ్వకపోవడం చంద్రబాబు విష సంస్కృతికి నిదర్శనమన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే అంబటి రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
 
‘చంద్రబాబు తన యాత్రను మారుటూరు నుంచి ప్రారంభిస్తూ.. సుమారు 50 నిమిషాల పాటు సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారు. యాత్ర ఈ రోజు ప్రారంభించాడు. మరో వారం రోజులు సెలవు తీసుకొని యాత్ర కొనసాగిస్తారంట. వైయస్‌ జగన్‌ ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు మధ్యలో ఒక రోజు విరామం ఇస్తే ఎన్ని విమర్శలు చేశారో గుర్తు లేదా..? 3648 కిలోమీటర్లు ఎండా, వాన, చలి అన్నింటికీ తట్టుకొని సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైయస్‌ జగన్‌పై చంద్రబాబు బృందం అంతా వచ్చి ఏమేమి విమర్శలు చేశారో మర్చిపోయారా..? మారుటూరులో ఉపన్యాసం ఇచ్చి ఇంటికి సర్దుకున్నాడు.

వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత అందరిపై దాడులు చేస్తుందంట. కేసులు పెడుతున్నారంట. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైయస్‌ఆర్, వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేశారు. నేను ఎవరినీ ఇబ్బందులు పెట్టలేదని మాట్లాడాడు. నీ యాత్రకు ఎవరు అడ్డం వచ్చారు. తెనాలిలో బహిరంగ సభ పెట్టినా అనుమతి ఇచ్చాం. ప్రజా చైతన్య యాత్రకు కూడా అనుమతి ఇచ్చాం. ట్రాఫిక్‌ జామ్‌ చేసి ఉపన్యాసం ఇచ్చాడు. గ్రానైట్‌ కార్మికుడు యాక్సిడెంట్‌ అయ్యి 108లో తీసుకెళ్తుంటే ఆ వాహనానికి ఎందుకు దారి ఇవ్వలేకపోయారు. ఇదేనా మీ సంస్కారం..

వైయస్‌ జగన్‌ ప్రజా సంకల్పయాత్రలో అనేక చోట్ల ట్రాఫిక్స్‌ స్తంభించినప్పుడు 108 వాహనాలు వస్తే.. తప్పుకోండి దారి ఇవ్వండి అని చెప్పిన వ్యక్తి వైయస్‌ జగన్‌. మానవత దృక్పథంతో పనిచేసే కుటుంబం వైయస్‌ఆర్‌ కుటుంబం. చంద్రబాబుది మనషులను చంపే కుటుంబం. మామకే వెన్నుపోటు పొడిచి కర్కషంగా చంపిన వ్యక్తి. పదవి కోసం ఎన్ని ప్రాణాలు పోయినా లెక్క చేయని స్వభావం చంద్రబాబుది. 108 వాహనానికి దారి ఇవ్వలేని విష సంస్కృతితో బతికే చంద్రబాబుకు ప్రభుత్వాన్ని దూషించే అర్హత లేదు.

తొమ్మిది మాసాలుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ విధానం గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తొమ్మిది మాసాల క్రితం ఎన్నికలు జరిగితే చంద్రబాబు, లోకేష్, టీడీపీ తోక కూడా ప్రజలు కత్తిరించారు. ప్రజలంతా చైతన్యవంతులు... వారిని చంద్రబాబు చైతన్యం చేయాల్సిన అవసరం లేదు. ఐటీ దాడులపై మాట్లాడకుండా మీడియాకు దొరక్కుండా చంద్రబాబు, లోకేష్‌ తప్పించుకొని తిరుగుతున్నారు. ప్రజలపై నెపం మోపే ప్రయత్నం చేస్తున్నాడు.. నీకు ఆపద వస్తే ప్రజలు ఎందుకు పట్టించుకోవాలి. ఈ రాష్ట్రంలో స్వచ్ఛమైన పాలన జరుగుతుంది. రూ. 40 కోట్ల ప్రభుత్వ సొమ్మును ఇంటికి కేటాయించుకున్నాడని తప్పుడు మాట చంద్రబాబు మాట్లాడాడు. రూ.2 కోట్ల పైచిలుకు ఖర్చుకు జీఓ ఇస్తే..  దాన్ని కూడా సీఎం వైయస్‌ జగన్‌ రద్దు చేశారు.

చేప అయినా నీళ్లలోంచి తీస్తే బతుకుతుంది కానీ, అధికారం లేకపోతే చంద్రబాబు బతికే పరిస్థితుల్లో లేడు. పెన్షన్‌ ఇవ్వలేదని ఒక మహిళ గుండె ఆగి చనిపోయిందంట. ఎందుకీ తప్పుడు మాటలు చంద్రబాబూ..? అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్‌ ఇవ్వండి అని సీఎం వైయస్‌ జగన్‌ స్పష్టంగా చెప్పారు.

మద్యం ధర పెరిగిపోయిందని చంద్రబాబు గగ్గోలు పెడుతున్నాడు. ధరలు పెరిగితే.. అన్ని బ్రాండ్లు దొరక్కపోతే చంద్రబాబుకు వచ్చిన బాధేంటీ..? అనుభవం కలిగిన వ్యక్తి మద్యం తాగొద్దు అని చెప్పాల్సిందిబోయి.. ఉన్న డబ్బులు మొత్తం తాగేస్తున్నారని మాట ఎందుకు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై కోపం ఉంటే.. మద్యం నిషేధం పాలసీని కూడా వ్యతిరేకిస్తున్నావంటే.. మద్యం ధరలు పెరిగిపోయాయని ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నాడు.

టీడీపీకి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌ సీపీ ప్రభుత్వం పంచాయతీ రాజ్‌ చట్టంలో మార్పు చేసిందని చంద్రబాబు మాట్లాడుతున్నాడు. ఎవరైనా మద్యం, డబ్బు పంపిణీ చేస్తే వారిని శిక్షించడం, అభ్యర్థులు చేస్తే అనర్హత వేటు వేయాలని ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. ఆ చట్టం టీడీపీకి వ్యతిరేకంగా తీసుకువచ్చారని మాట్లాడుతున్నాడు. చిత్తశుద్ధితో సీఎం వైయస్‌ జగన్‌ మంచి కార్యక్రమాన్ని తీసుకువస్తే దాన్ని అందరూ హర్షించాలి. ఐటీ దాడుల నేపథ్యంలో వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు తప్పించుకున్నారు. చంద్రబాబు ఎన్ని యాత్రలు చేసుకున్నా.. నిజాయితీతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరు. చంద్రబాబు అవినీతి అంతా తొందరలోనే బయటపడుతోంది. ప్రతి ఫలం అనుభవించక తప్పదు’ అని హెచ్చరించారు.

 

తాజా వీడియోలు

Back to Top