బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యత వైయస్ఆర్‌సీపీ తీసుకుంది

 జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి

బీసీల ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైయస్ఆర్‌సీపీనే
 
బీసీలంటే బాబు గారికి "బానిస క్లాస్"..!

 బాబు 5 ఏళ్ళలో  రూ.19 వేల కోట్లు ఇస్తే..  మా ప్రభుత్వం రూ. 2 లక్షల కోట్లు ఇచ్చింది.

మహిళా, బీసీ రిజర్వేషన్ల కోసం పార్లమెంటులో పోరాటం కొనసాగిస్తాం

 రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటమే వైయస్ఆర్‌సీపీ విధానం

తాడేప‌ల్లి:  బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యత వైయస్ఆర్‌సీపీ తీసుకుంద‌ని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ వి. విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.   బీసీ సామాజిక వర్గాల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, వారి సమస్యలను పరిష్కరించే దిశలో వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్లుగా చేస్తున్న కృషిని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి, ఆ వర్గాలకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకే బీసీ ప్రజా ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేశామ‌న్నారు.  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ప్రజా ప్రతినిధుల ఆత్మీయ స‌మ్మేళ‌నం తాడేప‌ల్లిలోని సీఎస్ఆర్ క‌ళ్యాణ మండ‌పంలో నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పార్టీ బీసీ ప్రజా ప్రతినిధులతో కలిసి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర కో- ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

 రాష్ట్రంలో ఉన్న 139 బీసీ సామాజిక వర్గాల నుంచి ఫీడ్‌ బ్యాక్‌  తీసుకుని,  బీసీ సామజిక వర్గాలను సంతృప్తి పరిచేలా మా ప్రభుత్వం పనిచేస్తుంది. ఇందులో భాగంగానే 225 మంది బీసీ ప్రజా ప్రతినిధులతో  సమావేశాన్ని ఏర్పాటు చేశాం. దీన్ని ఒక కోర్‌ కమిటీ సమావేశంగా మేము పరిగణిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిగారి ఆదేశాల మేరకు, రాష్ట్రవ్యాప్తంగా క్షేత్రస్థాయిలోని బీసీ నాయకులందరిని కలుపుకుని, రాబోయే రోజుల్లో 26 జిల్లాల్లో కూడా సమావేశాలు నిర్వహించదలచుకున్నాం. ఇవాళ సమావేశానికి హాజరు అయిన 225మంది దగ్గర నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. జరగబోయే కార్యక్రమంలోనూ సూచనలు తీసుకుంటాం. 

డీబీటీ ద్వారా రూ. 2 లక్షల కోట్లు ఇచ్చాం        
        మను ధర్మశాస్త్రం నుంచి రాష్ట్రంలోనూ, దేశంలో కూడా ప్రతి పనిలోనూ బీసీ సామాజిక వర్గాల కృషి దాగి వుంది. అందుకే వైయస్సార్‌ సీపీ బీసీలకు అత్యున్నత ప్రాధాన్యత ఇచ్చింది. రాజకీయంగా, ఆర్థికంగా, ఇతర సామాజిక వర్గాలకు సమానంగా బీసీల అభివృద్ధి చెందేలా మా ప్రభుత్వం కృషి చేస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం అయిదేళ్ల కాలంలో  బీసీల కోసం  ఖర్చు పెట్టిన మొత్తం కేవలం రూ. 19,369 కోట్లు మాత్రమే. అదే వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం మూడున్నరేళ్లలో ఏ వర్గానికి ఎంతెంత ఖర్చు పెట్టిందనేది ప్రజలకు వివరిస్తాం. ఈ ప్రభుత్వం గడిచిన మూడున్నరేళ్ళల్లో డీబీటీ ద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు దాదాపు రూ. 2 లక్షల కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేసింది. 

కేబినెట్ నుంచి.. నామినేటెడ్ పదవుల వరకు
            ఈ ప్రభుత్వం సామాజిక న్యాయానికి పెద్ద  పీట వేస్తుంది. మొత్తం 137 కార్పొరేషన్లకు సంబంధించి 484 పదవులు ఇస్తే, అందులో 243 బీసీలకు ఇచ్చాం. బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. శాశ్వత ప్రాతిపదిక పైన బీసీ కమిషన్ ను  ఏర్పాటు చేశాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఉద్యోగాలకు సంబంధించి ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుంది. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా   1.3 లక్షల శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే.. అందులో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలే. సచివాలయాల్లో  2.7లక్షల వాలంటీర్‌ ఉద్యోగాలతో పాటు మిగతావాటిని కలుపుకుని 6లక్షల 3వేల ఉద్యోగాలును కల్పిస్తే.. అందులో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఇచ్చాం. అలాగే రెగ్యులర్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు కలిపి మొత్తం 2లక్షల 61వేల 571 ఉద్యోగాలు బీసీలకే ఇవ్వడం జరిగింది. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రిమండలిలో 70శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు చోటు కల్పించాం.  మంత్రివర్గం నుంచి.. నామినేటెడ్‌ పోస్టులు, స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు..  ఇలా అన్నింటిలోనూ రిజర్వేషన్లు కల్పించాం. డిప్యూటీ సీఎం పదవులు ఐదుగురికి ఇస్తే ..అందులో 80శాతం బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు దక్కాయి. శాసన సభ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్‌ పర్సన్, పదవులు బీసీలు, ఎస్సీలకే చోటు కల్పించాం. అలాగే మండలి డిప్యూటీ చైర్మన్‌గా మైనార్టీ మహిళను నియమించడం రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమం.

బాబు దృష్టిలో బీసీలంటే బాబు గారి బానిస క్లాస్
        చంద్రబాబు నాయుడు దృష్టిలో... బీసీలంటే బ్యాక్ వర్డ్ క్లాసెస్‌ కాదు... బాబు గారి క్లాస్ గా పరిగణిస్తారు. బీసీలు అంటే ఆయన దృష్టిలో బానిస క్లాస్‌గా పరిగణిస్తారు. ఏనాడైనా వెనుకబడిన బీసీ వర్గాలను మిగతా సామాజిక వర్గాలతో సమాంతరంగా అభివృద్ధి చెందేలా చూడాలని కనీసం ఆలోచన కూడా చేయని వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా, నాయిబ్రాహ్మణులు తమ సమస్యలు చెప్పుకునేందుకు వస్తే... వారిని లోనికి రానివ్వకుండా అడ్డుకుని, బయటకు వచ్చి,  మీ తోకలు కత్తిరిస్తానని వారిని బెదిరించారు, అవమానించారు. జ్యూడీషియరీ విషయానికి వస్తే..  బీసీలు న్యాయమూర్తులుగా ఉండటానికి వీల్లేదంటూ అప్పటి కేంద్ర న్యాయ శాఖమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కు లేఖ రాసిన దుర్మార్గపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడే. బీసీల పట్ల బాబుకు ఎలాంటి ప్రేమ ఉందో వీటిని బట్టే అర్థం చేసుకోవచ్చు. 

జనాభా ప్రాతిపదికన బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని పోరాడుతున్నాం
            జనాభా ప్రాతిపదికన డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు కల్పించారు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఎస్సీ, ఎస్టీ జనాభా శాతం ఉంటుంది. ఆ జనాభా శాతాన్ని బట్టే రిజర్వేషన్లు ఉంటాయి. 50శాతానికి పైగా రిజర్వేషన్లు అమలు చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పు చెబుతోంది. రాష్ట్రంలో ఉన్న 139 బీసీ సామాజికవర్గాలకు జనాభా ప్రాతిపదికపైన చూస్తే..  బీసీలు ఇంచుమించుగా 50శాతం ఉన్నారు. బీసీలకు జనాభా ప్రతిపాదికపైన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యసభలో మా పార్టీ తరపున ఒక ప్రయివేట్‌ మెంబర్‌ బిల్లును ప్రతిపాదించాం. దాని కోసం మా పోరాటం కొనసాగిస్తాం. 139 బీసీ కులాలు కలిసికట్టుగా, సమిష్టిగా పోరాటం చేస్తేనే ఏదైనా సాధించవచ్చు. వీరంతా వేర్వేరు భావనలతో ఉండకుండా ఒకే గొడుగు కిందకు వస్తే..  రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది. తమ ప్రయోజనాలు కాపాడేలా పనిచేసేవారికే ఓటు వేస్తాం అనే ధృక్పథం తో బీసీ వర్గాలు ముందుకెళ్ళాలి.  బీసీల అభ్యున్నతికి ఏం చేయాలో.. అన్నీ చేయడానికి  వైయస్సార్‌ సీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మంత్రి మండలి నుంచి నామినేటెడ్‌ పదవులకు వరకూ మహిళలకు 50శాతం రిజర్వేషన్లు ఏ విధంగా అయితే పాలసీ పెట్టుకుని కల్పిస్తున్నామో, అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు కూడా 80శాతం వరకూ పదవులు కల్పించాం. అదే పాలసీని మేము భవిష్యత్‌ లో కూడా కొనసాగిస్తాం. బీసీ సామాజిక వర్గాల ప్రయోజనాల కోసం పోరాడతాం. రాష్ట్రంలో మహిళలకు నామినేటెడ్‌ పోస్టుల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించామో, అదేవిధంగా ప్రధానమంత్రి అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పించి, చట్టబద్ధం చేయాలని మా పార్టీ తరఫున డిమాండ్‌ చేశాం.  

బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైఎస్ఆర్సీపీ తీసుకుంది
            బీసీల హక్కుల కోసం పోరాడే బాధ్యతను వైయస్సార్‌ సీపీ తీసుకుంది. భవిష్యత్‌లో ఇవన్నీ సాధించి తీరతాం. రాబోయే 2024 ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గాలన్నింటిని ఏకం చేసి, వారి ప్రయోజనాలను కాపాడగలిగేది ఒక్క వైయస్సార్‌ సీపీ మాత్రమే కాబట్టి, వారందరూ సమిష్టిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకువచ్చి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి.  మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలంటే అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. అక్కడ పోరాడాల్సి ఉంది. మా పార్టీ సభ్యులు ప్రయివేట్‌ బిల్లు కూడా పెట్టారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం రాజ్యాంగ సవరణ చేయాలి. ప్రతి అఖిల పక్ష సమావేశంలోనూ మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ చేయాలని ప్రధానమంత్రిగారి దృష్టికి తీసుకువెళుతూనే ఉన్నాం. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేవనేది వాస్తవం. మా పార్టీలో ఒక పాలసీ పెట్టుకుని,  నామినేటెడ్‌ పోస్టుల కోసం నియోజకవర్గాల సమన్వయకర్తల నుంచి ప్రతిపాదనలను ఒక కండిషన్‌ మీదే తీసుకున్నాం. వారు పంపించే ప్రతిపాదనల్లో 50 శాతం మహిళలు తప్పనిసరి అని నియమం పెట్టాం. కార్పొరేషన్ పదవుల్లో కూడా రిజర్వేషన్లు పాటించిన పార్టీ ఒక్క వైయస్సార్‌ సీపీనే.

- మా పార్టీ ఒక ఇండిపెండెంట్‌ పొలిటికల్‌ పార్టీ. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో మేము ఎప్పుడూ రాజీపడం. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏ విషయంలో అయినా ఏ రాజకీయ పార్టీకైనా మద్దతు తెలియచేయడానికి మేము సిద్ధం.

- ఈ మీడియా సమావేశంలో స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు జోగి రమేష్, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, ఉషాశ్రీ చరణ్,  గుమ్మనూరు జయరాం, ఎంపీలు మార్గాని భరత్, డాక్టర్ సత్యవతి, ఎమ్మెల్సీ, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జంగా కృష్ణమూర్తి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ పోతుల సునీత, కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు. 

- బీసీ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, ఆర్ కృష్ణయ్య, డాక్టర్ సంజీవ్ కుమార్, తలారి రంగయ్య,  బెల్లాన చంద్రశేఖర్, గోరంట్ల మాధవ్, మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, దాడి వీరభద్రరావు తదితరులు హాజరయ్యారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top