గుంటూరు: ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయని, ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు జరుగుతున్నాయని వైయస్‌ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ సమీపంలోని ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను టీటీడీ చైర్మన్, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నియోజకవర్గ స్థాయి, జిల్లా ప్లీనరీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయి. 8, 9 తేదీల్లో రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశం గుంటూరులో ఏఎన్‌యూ సమీపంలో జరగబోతుంది. ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు వేగవంతంగా జరుగుతున్నాయి. అనేక మంది పార్టీ ప్రతినిధులు ప్లీనరీకి హాజరవుతారు. అనేక అంశాలపై తీర్మానాలు ఉంటాయి. పార్టీ రాజ్యాంగానికి కొన్ని సవరణలను ప్రతిపాదించి.. ఆమోదానికి పెట్టడం జరుగుతుంది. వక్తలందరూ వివిధ ముఖ్యమైన అంశాలపై ప్రసంగిస్తారు. ముఖ్యంగా విద్య, వ్యవసాయం, వైద్యం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, మీడియా పక్షపాత వైఖరిపై ప్రసంగిస్తారు. వాటిపై వివిధ తీర్మానాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ, జిల్లా స్థాయి సమావేశాలకు అద్భుతమైన స్పందన వచ్చింది. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. సంక్షేమ పథకాలతో లబ్ధిపొందినవారు, సామాజిక న్యాయంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాల్లోని పేదలంతా వైయస్‌ఆర్ సీపీ, సీఎం వైయస్ జగన్ పరిపాలన పట్ల పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. రాబోయే ప్లీనరీ సమావేశంలో ప్రజల నుంచి వచ్చే స్పందన అందరికీ తెలుస్తుంది. ప్లీనరీకి వచ్చేవారి కోసం ఆహారానికి సంబంధించిన ఏర్పాట్లు, వార్డు స్థాయి మెంబర్స్ నుంచి పైస్థాయి నాయకుల వరకు అందరికీ అన్ని వసతులు చేయడం జరుగుతుంది. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ తప్పకుండా విజయవంతం అవుతుంది. రెండ్రోజులు సీఎం వైయస్ జగన్ సభా వేదికపైనే ఉంటారు. వివిధ తీర్మానాలపై చర్చించి.. ఆమోదిస్తారు`` అని ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.