పోలవరం అంచనాలపై కాలయాపన ఏమిటి?

అఖిలపక్ష సమావేశంలో కేంద్రాన్ని ప్రశ్నించిన వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీలు 

న్యూఢిల్లీ : పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి సవరించిన అంచనా వ్యయంను ఆమోదించకుండా 29 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే  కాలయాపన చేస్తోందని వైయ‌స్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకులు  వి.విజయసాయి రెడ్డి అన్నారు. 55 వేల 657 కోట్ల రూపాయల సవరించిన అంచనా వ్యయానికి టెక్నికల్‌ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ ఇంకా ఆ ఫైలు జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ పెండింగ్‌లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. ఇది రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ద్రోహంగా అభివర్ణించారు. 
పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం ఇక్కడ జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి, మిధున్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తిన సమస్యలను వారిద్దరూ మీడియాకు వివరించారు. 

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరంకు తరలించాల్సిందిగా అనేకసార్లు విజ్ఞప్తులు చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వాటిని పెడచెవిన పెట్టిందని అన్నారు. ఈ అంశాలను పార్లమెంట్‌ ఉభయ సభల్లో లేవనెత్తుతామని సమావేశంలో తెలిపినట్లు ఆయన వెల్లడించారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైయ‌స్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి విస్పష్టంగా చెప్పినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. నష్టాలలో ఉన్న ఏదైనా ప్రభుత్వరంగ సంస్థను పురుద్ధరించి వాటిని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి కానీ ఏకంగా తెగనమ్మడం పరిష్కారం కాబోదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలనేవి దేశానికి మూలధన ఆస్తి వంటివి. వాటిని అమ్మే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను తిరిగి లాభాల బాట పట్టించడానికి మూడు మార్గాలను తాము సూచించినట్లు చెప్పారు. అందులో సొంత గనుల కేటాయింపు, ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌పై ఉన్న రుణ భారాన్ని ఈక్విటీ కింద మార్పు. లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం వంటివి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలుగా సూచించినట్లు తెలిపారు.

రాష్ట్రం పట్ల కేంద్రం సవతి తల్లి వైఖరి  
ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం పట్ల సవతి తల్లి వైఖరి అనుసరిస్తోందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో స్పెషల్‌ క్యాటగిరీ స్టేటస్‌ అన్నది పొందుపరిచినప్పటికీ 8 ఏళ్ళు పూర్తవుతున్నా బీజేపీ ప్రభుత్వం చట్టానికి అతీతంగా వ్యవహరిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిని అనుసరిస్తోందని అన్నారు. గడచిన పాండిచ్చేరి శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో పాండిచ్చేరికి స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇదే విషయాన్ని సమావేశంలో ప్రస్తావించినట్లు చెప్పారు. అదే ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వచ్చే సరికి ఆర్థిక సంఘం పేరు చెప్పి స్పెషల్‌ స్టేటస్‌ ఇవ్వకుండా మొండిచేయి చూస్తోంది. బీజేపీయేతర పార్టీలు ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం ప్రదర్శిస్తోంది.   దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు, ద్వంద ప్రమాణాలకు పాల్పడుతూ అవసరమైతే చట్టాలను సైతం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధుల విడుదల, స్పెషల్‌ స్టేటస్‌తోపాటు ప్రతి విషయంలోను ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని అన్నారు.

పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరాం. అలాగే బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన 5,056 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశాం. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఉపాధి పనులు చేసిన కార్మికులు వేతనాలు అందక ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి బకాయి పడిన 6,750 కోట్ల రూపాయలను తక్షణమే విడుదల చేయాలని కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వంశధార ప్రాజెక్ట్‌కు సంబంధించి ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసే రేషన్‌ కార్డుల సంఖ్య విషయంలో నెలకొన్న అసమానతలను కూడా సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 75 శాతం పైగా రేషన్‌ కార్డులు మంజూరు చేస్తే జనాభా అధికంగా ఉండి, తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేవలం 54 శాతం ప్రజలకు మాత్రమే రేషన్‌ కార్డులు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఈ అసమానతను తక్షణమే సరిదిద్దాలని కోరినట్లు చెప్పారు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లును ఆమోదించాలని కోరాం.

2016 నుంచి 18 వరకు చంద్రబాబు హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పంపిణీ చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం 6,112 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడం లేదు. పరిస్థితులలో కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి మినహాయించి ఈ బకాయిలను రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక మూడు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణను కోరడం జరిగింది. అమరావతి సీఆర్‌డీఏ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌ స్కాం, అంతర్వేదిలోని రథం దగ్ధం వంటి అంశాలపై సీబీఐ విచారణ కోరితే ఇప్పటి వరకు స్పందించని విషయాన్ని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకురావడం జరిగింది.

పార్టీ ఫిరాయింపుల చట్టం అమలులో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా  వ్యవహరిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. మాజీ జేడీయూ ఎంపీ శరద్‌ యాదవ్‌పై కేవలం వారం రోజుల నోటీసుతో అనర్హత వేటు వేస్తే రఘురామ విషయంలో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేస్తే దానిపై చర్యలను ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ 11 నెలల తర్వాత స్పీకర్‌ నిద్ర లేచి పిటిషన్‌లో ఏవో లోపాలున్నాయి వాటిని సరిదిద్దమని అడిగారు. ఫిరాయింపుల చట్టం కింద దాఖలయ్యే పిటిషన్‌పై స్పీకర్‌ మూడు నుంచి ఆరు మాసాలలోగా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విస్పష్టమైన ఆదేశాలను సైతం స్పీకర్‌ బేఖాతరు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద ప్రమాణాలను విడనాడాలని సమావేశంలో చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలన్నింటినీ సభలో కూడా లేవనెత్తుతామని ఆయన చెప్పారు.

తాజా వీడియోలు

Back to Top