కంది ఎంఎస్‌పీ కొనుగోలులో ఆంధ్రప్రదేశ్ వెనుకబాటు  

రైతులను నష్టాలకు నెట్టుతున్న ప్రభుత్వ విధానాలు

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.వి.ఎస్. నాగిరెడ్డి ఫైర్‌

గుడివాడ : 2025–26 ఖరీఫ్ సీజన్‌లో కంది  ఎంఎస్‌పీ  ఆధారంగా ప్రభుత్వ కొనుగోలు విషయంలో ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల మధ్య స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మిషన్ మాజీ ఉపాధ్యక్షుడు, భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి మాజీ సభ్యుడు, వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఎం.వి.ఎస్. నాగిరెడ్డి  తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి

కేంద్ర ప్రభుత్వం Price Support Scheme (PSS) కింద ఆంధ్రప్రదేశ్‌కు 1,16,690 మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు అనుమతి ఇచ్చిందని, అలాగే 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములకు కూడా MSP కొనుగోలు ఆమోదం ఉందని ఆయన తెలిపారు. కంది MSP ధరను రూ.8,000 క్వింటాల్‌గా నిర్ణయించినప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు రూ.6,500 నుంచి రూ.7,000 మధ్యే పంటను విక్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

2025–26లో ఆంధ్రప్రదేశ్‌లో కంది సాగు సుమారు 3,21,743 హెక్టార్లలో జరిగినప్పటికీ, ప్రభుత్వం ప్రకటించిన MSP కొనుగోలు మొత్తం ఉత్పత్తిలో 25 శాతం కూడా కవర్ చేయలేని పరిస్థితి ఉందన్నారు. ఎంతవరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్న స్పష్టత లేక రైతుల్లో నమ్మకం లేకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు.

కొన్ని ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ, పూర్తి స్థాయిలో కొనుగోలు జరగకపోవడంతో ప్రభుత్వం డబ్బులు త్వరగా చెల్లించదన్న భయంతో రైతులు ప్రైవేట్ వ్యాపారులకు తక్కువ ధరకే పంటను అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. గతంలో పొగాకు, మామిడి, ఉల్లి రైతులకు చెల్లింపుల్లో జరిగిన జాప్యాలు రైతుల విశ్వాసాన్ని మరింత దెబ్బతీశాయని విమర్శించారు.

కర్ణాటకలో పరిస్థితి

కర్ణాటక రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2025–26 ఖరీఫ్ సీజన్‌లో 9.67 లక్షల మెట్రిక్ టన్నుల కంది MSP కొనుగోలుకు PSS కింద అనుమతి ఇచ్చిందని తెలిపారు. అక్కడ కూడా MSP ధర రూ.8,000 క్వింటాల్‌గా నిర్ణయించారని, రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో పాటు కొనుగోలు ప్రక్రియ వేగవంతంగా అమలు అవుతోందన్నారు.

కలబుర్గి వంటి జిల్లాల్లో ఆధార్‌ ఆధారిత రిజిస్ట్రేషన్‌తో రైతుల నుంచి నేరుగా MSPకి కంది కొనుగోలు జరుగుతోందని, పెద్ద సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు.

 పరిమాణం (Quantity) తులనాత్మక దృష్టి అంశం..

ఆంధ్రప్రదేశ్: MSP అనుమతి – సుమారు 1,16,690 మెట్రిక్ టన్నులు

కర్ణాటక: MSP అనుమతి – సుమారు 9,67,000 మెట్రిక్ టన్నులు

MSP ధర (రెండు రాష్ట్రాల్లో): రూ.8,000/క్వింటాల్

ఆంధ్రప్రదేశ్‌లో మార్కెట్ ధర: రూ.6,500 – రూ.7,000/క్వింటాల్

రైతులపై ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో MSP కొనుగోలు సమర్థవంతంగా జరగకపోవడంతో రైతులు తక్కువ ధరలకు పంటను అమ్ముకుని తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. కర్ణాటకలో మాత్రం ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థ బలంగా ఉండటంతో రైతులు నేరుగా MSPకి పంటను విక్రయించి ఆదాయం పొందుతున్నారని చెప్పారు.

ఇతర పంటల పరిస్థితి

తెలంగాణ రాష్ట్రంలో మొక్కజొన్నను MSP రూ.2,400 క్వింటాల్‌కు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంటే, ఆంధ్రప్రదేశ్‌లో రైతులు రూ.1,400 నుంచి రూ.1,800కే అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. సజ్జకు MSP రూ.2,750 ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రూ.1,800–1,900కే అమ్ముకున్న పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

వరి సాగు విస్తీర్ణం పెరిగినా, మోన్థా తుఫాన్ ప్రభావంతో ఎకరాకు సగటు దిగుబడి తగ్గిందని, దీని వల్ల రైతులపై తీవ్ర ఆర్థిక భారం పడిందన్నారు. వేరుశనగ, మినుము, పెసర, ప్రత్తి వంటి పంటలు కూడా సరైన ధరలు లేక రైతులు నష్టానికి అమ్ముకున్నారని విమర్శించారు. పంటలు వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిన తరువాత ధరలు పెరిగాయని ప్రకటనలు చేయడం రైతులను అవమానించడమేనన్నారు.

సిఫార్సులు

ఆంధ్రప్రదేశ్‌లో MSP కొనుగోలు విధానాన్ని మరింత విస్తృతం చేయాలని, ప్రతి ప్రధాన కంది ఉత్పత్తి నియోజకవర్గంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, MSP కొనుగోలుపై రైతులకు ఎప్పటికప్పుడు స్పష్టమైన సమాచారం ఇవ్వాలని సూచించారు.

చివరగా ఆయన మాట్లాడుతూ, ఒకటి రెండు పంటలు తప్ప మిగిలిన అన్ని పంటల రైతులు సాగు విస్తీర్ణం తగ్గి, ఉత్పత్తి వ్యయం పెరిగినా సరైన ధర లేక తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడుతున్నారని అన్నారు.
“అన్నదాత కంట కన్నీరు ప్రభుత్వానికి, రాష్ట్రానికి మంచిది కాదు” అని హెచ్చరించారు.

Back to Top