పెనుమూరు బస్టాండ్ వద్ద టీడీపీ నాయకుల అర్ధరాత్రి దౌర్జన్యం

వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరుల షాపులనే లక్ష్యంగా తొలగింపు

 చిత్తూరు జిల్లా: గంగాధర నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద శనివారం అర్ధరాత్రి టీడీపీ నాయకులు ఘోర దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎలాంటి అధికారిక ఉత్తర్వులు, నోటీసులు లేకుండా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సానుభూతిపరుల షాపులపై దాడి చేసి బలవంతంగా తొలగించారు.

అనధికారికంగా సుమారు 30 నుంచి 40 మంది టీడీపీ నాయకులు మద్యం సేవించిన స్థితిలో బస్టాండ్ వద్దకు చేరుకుని, వైయస్ఆర్‌సీపీ సానుభూతిపరులైన నాలుగు కుటుంబాలకు చెందిన షాపులనే ప్రత్యేకంగా టార్గెట్ చేసి ధ్వంసం చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. బస్టాండ్ పరిసరాల్లో దాదాపు 70 నుంచి 80 షాపులు ఉన్నప్పటికీ, వాటిని వదిలేసి కేవలం వైయస్ఆర్‌సీపీకి చెందిన కుటుంబాల షాపులనే తొలగించడం రాజకీయ కక్షకు నిదర్శనమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

గ్రామపంచాయతీకి తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆర్‌అండ్‌బీ పరిధిలో సుమారు 40 ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని బాధితులు తెలిపారు. ప్రస్తుతం బస్టాండ్ ప్రాంతంలో దాదాపు 100 వరకు షాపులు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ వదిలేసి తమపై మాత్రమే కూటమి ప్రభుత్వ నాయకులు దౌర్జన్యానికి పాల్పడటం తీవ్ర అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు లేకుండా రాత్రికి రాత్రి షాపులను పీకి పారేయడంతో తమ కుటుంబాలు రోడ్డుపై పడే పరిస్థితి ఏర్పడిందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. 40 ఏళ్లుగా జీవనాధారంగా మారిన వ్యాపారాలను ఒక్క రాత్రిలో ధ్వంసం చేయడం కూటమి ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ విభేదాల పేరుతో పేదల జీవనాధారాలను ధ్వంసం చేయడం అమానుషమని, ఈ ఘటనపై వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Back to Top