మందా సాల్మ‌న్ హ‌త్య‌పై త్వ‌ర‌లో వైయ‌స్ఆర్‌సీపీ ఛ‌లో ఢిల్లీ 

కూట‌మి దాడుల‌పై ఢిల్లీ స్థాయిలో వైయ‌స్ఆర్‌సీపీ ఉద్య‌మం 

బాధిత కుటుంబానికి న్యాయం జ‌రిగేదాకా పోరాడ‌తాం

నిందితుల‌ను శిక్షించేదాకా ప్ర‌భుత్వాన్ని వ‌దిలిపెట్టం 

స్ప‌ష్టం చేసిన వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు 

పిన్నెలి గ్రామంలో వైయ‌స్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో మందా సాల్మన్ సంస్మరణ సభ కార్యక్రమం. వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర నాయ‌కులు హాజ‌రై నివాళులు అర్పించారు. 

చంద్ర‌బాబు దృష్టిలో ద‌ళిత ఓట్లకున్న విలువ వారి ప్రాణాల‌కు లేదు

అంబేడ్క‌ర్ విగ్ర‌హంపై దాడితో ద‌ళితుల‌పై దాడుల‌కు కూట‌మి నాయ‌కుల శ్రీకారం

దాడుల‌తో వైయ‌స్ఆర్‌సీపీ నుంచి ద‌ళితుల‌ను వేరు చేసే కుట్ర‌లు

అభివృద్ధి చేయ‌డం చేత‌కాక దాడుల‌తో దారికి తెచ్చుకునే ఎత్తుగ‌డ‌

చంద్ర‌బాబు కుట్ర‌ల‌పై వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు ధ్వ‌జం

ప‌ల్నాడు జిల్లా:   చంద్ర‌బాబు దృష్టిలో ద‌ళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాల‌కు లేదని, అందుకే అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి వైయ‌స్సార్సీపీకి అండ‌గా ఉన్న ద‌ళితుల మీద దాడులు చేసి వారిని పార్టీకి దూరం చేసే కుట్ర‌లు చేస్తున్నార‌ని వైయస్సార్సీపీ నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం మీద దాడితోనే దీనికి శ్రీకారం చుట్ట‌డం సిగ్గుచేటన్నారు. టీడీపీ గూండాల దాడిలో మందా సాల్మ‌న్ దారుణ హ‌త్య‌కు గురై ప‌ది రోజులైన సంద‌ర్భంగా వైయ‌స్సార్సీపీ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన సాల్మ‌న్ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కూట‌మి ప్ర‌భుత్వంపై నాయ‌కులు తీవ్రంగా విరుచుకుప‌డ్డారు. అనంత‌రం నాయ‌కులంతా భారీ ర్యాలీగా పిన్నెల్లి గ్రామానికి వెళ్లి మందా సాల్మ‌న్ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి అండ‌గా ఉంటామ‌ని భ‌రోసా ఇచ్చారు. సాల్మ‌న్ చిత్ర‌ప‌టం వ‌ద్ద నివాళులు అర్పించారు. ముఖ్యంగా ప‌ల్నాడు జిల్లాలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి ప‌థ‌కం ప్ర‌కారం వైయస్సార్సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను టార్గెట్ చేసి దాడులు చేయ‌డంపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ, చేత‌నైతే వైయ‌స్ జ‌గ‌న్ క‌న్నా ఎక్కువ అభివృద్ధి చేసి పల్నాడు ప్ర‌జ‌ల మ‌న‌సు గెలుచుకోవాల‌ని స‌వాల్ విసిరారు. అభివృద్ధి చేత‌కాక ప్ర‌జ‌ల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురిచేస్తే వారే ఎప్ప‌టికీ అధికారంలో ఉండొచ్చ‌న ప‌గ‌టి క‌ల‌లు మానుకోవాల‌ని, వారి వేధింపుల‌ను లెక్క‌చేయ‌కుండా పార్టీ కోసం పోరాడుతున్న కార్య‌కర్త‌ల‌ను ఈ సంద‌ర్భంగా అభినందించారు. మందా సాల్మ‌న్ హ‌త్య పిన్నెల్లిలో చివ‌రి హ‌త్య కావాల‌ని, గ్రామంలో శాంతి నెల‌కొనాల‌ని ఆకాంక్షిస్తున్న సాల్మ‌న్ బిడ్డ‌ల పెద్ద మ‌న‌సుకి పార్టీ నాయ‌కులు హాట్సాప్ చెప్పారు. వారి కుటుంబానికి పార్టీ అండ‌గా ఉంటుంద‌ని, నిందితుల‌కు శిక్ష‌ప‌డేదాకా వైయ‌స్సార్సీపీ పోరాడుతుంద‌ని చెప్పారు. త్వ‌ర‌లోనే వైయ‌స్సార్సీపీ ఆధ్వ‌రంలో ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించి పార్ల‌మెంట్ లో టీడీపీపై ఒత్తిడి తెస్తామ‌ని స్ప‌ష్టం చేశారు.  వారు ఇంకా ఏమ‌న్నారంటే..  

మందా సాల్మ‌న్ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మంలో తిరుప‌తి ఎంపీ మ‌ద్దిల గురుమూర్తి, మాజీ ఎంపీ నందిగం సురేష్‌, మాజీ మంత్రులు మేక‌తోటి సుచ‌రిత, మేరుగ నాగార్జున‌, విడ‌ద‌ల ర‌జ‌ని, సాకె శైల‌జానాథ్‌, వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్య‌క్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి క‌న‌కారావు, వైయ‌స్సార్సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జూపూడి ప్ర‌భాక‌ర్‌, వైయ‌స్సార్సీపీ ప‌ల్నాడు జిల్లా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, కాసు మహేష్ రెడ్డి, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ పార్టీ ఇన్‌చార్జి పూనూరు గౌత‌మ్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు. 

● మందా సాల్మ‌న్ హ‌త్య‌పై త్వ‌ర‌లోనే ఛ‌లో ఢిల్లీ
- మ‌ద్దిల గురుమూర్తి, తిరుప‌తి ఎంపీ 

కూటమి అధికారంలోకి రావ‌డంతోనే రాజ్యాంగాన్ని ర‌చించిన డాక్ట‌ర్ బీఆర్ అంబేడ్క‌ర్ విగ్ర‌హం మీద దాడులు మొద‌లుపెట్టి ఎస్సీల‌ను నిత్యం వేధిస్తున్నారు. ప‌ట్ట‌ప‌గ‌లు హ‌త్య‌లు చేసి గ్రామాల‌నే ఖాళీ చేయించే దారుణాలకు పాల్ప‌డుతున్నారు. కూట‌మి నాయ‌కుల దాడుల‌పై ఎప్ప‌టిక‌ప్పుడు పార్ల‌మెంట్‌లో వైయ‌స్సార్సీపీ త‌ర‌ఫున గళం వినిపిస్తూనే ఉన్నాం. దేశంలో ఎక్క‌డా లేనివిధంగా ఎస్సీల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ప్ర‌భుత్వ నిర్ల‌క్ష్యంతోనే మందా సాల్మ‌న్ దారుణ హ‌త్య జ‌రిగింది. చ‌ట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే రౌడీల‌తో చేతులు క‌లుపుతున్న దుర్మార్గ వాతావ‌ర‌ణం రాష్ట్రంలో క‌నిపిస్తోంది. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై జాతీయ మాన‌వ‌హ‌క్కుల సంఘం (ఎన్‌హెచ్చార్సీ), జాతీయ ఎస్సీ క‌మిష‌న్‌కి ఫిర్యాదు చేస్తాం. నిందితుల‌కు శిక్ష పడేదాకా కోర్టుల్లో వైయ‌స్సార్సీపీ పోరాడుతుంది. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై ఢిల్లీ స్థాయిలో వైయ‌స్సార్సీపీ పోరాడుతుంది. త్వ‌ర‌లోనే ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తాం. 

● వైయ‌స్సార్సీపీని లేకుండా చేయ‌డం ప‌గ‌టి క‌ల‌
- నందిగం సురేష్‌, మాజీ ఎంపీ 

కూట‌మి నాయ‌కుల అరాచ‌క పాల‌న‌తో బీహార్ కూడా చిన్న‌బోయింది. వైయస్సార్సీపీ హ‌యాంలో శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్షణ‌లో పోలీసులు దేశంలో అత్యున్న‌త స్థాయి అవార్డులు గెలుచుకుంటే, చంద్ర‌బాబు సీఎం అయ్యాక ఏడాదిన్న‌రలోనే దేశంలోనే చిట్ట‌చివ‌రి 31వ స్థానానికి ప‌డిపోయింది. అంతలా వ్య‌వ‌స్థ‌ల‌ను దిగ‌జార్చిన ఘ‌న‌త చంద్ర‌బాబుకే ద‌క్కుతుంది. అధికారం చేతిలో ఉంది క‌దా అని చ‌ట్టాల‌ను ఉల్లంఘించి పాల‌న సాగిస్తున్న కూట‌మి నాయ‌కులు ప్ర‌జ‌ల్లో దారుణ‌మైన వ్య‌తిరేక‌త తెచ్చుకున్నారు. అందుకే వైయ‌స్సార్సీపీని లేకుండా చేస్తే మ‌ళ్లీ అధికారంలోకి రావొచ్చ‌ని ప‌గ‌టి క‌ల‌లు కంటున్నారు. ఓటేసిన ప్ర‌జ‌ల‌కే వెన్నుపోటు పొడిచి వేధిస్తున్న ప్ర‌భుత్వానికి పోయేకాలం ద‌గ్గ‌ర‌ప‌డింది. మందా సాల్మ‌న్ హ‌త్య‌కు కార‌ణ‌మైన కూట‌మి ప్ర‌భుత్వానికి ఖ‌చ్చితంగా బుద్ధి చెబుతాం. 

● గుర‌జాల‌లో య‌ర‌ప‌తినేని గూండారాజ్యం
- కాసు మ‌హేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే

అంబేడ్క‌ర్ రాసిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తే ఏం జ‌రుగుతుందో మందా సాల్మ‌న్ హత్య‌తో వచ్చిన ప్ర‌జావ్య‌తిరేక‌త ద్వారా చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, తెలుగుదేశం పార్టీకి ఇప్ప‌టికే అర్థ‌మైపోయింది. ఈ హ‌త్యలో ప్రత్య‌క్షంగా ప‌రోక్షంగా పాల్గొన్న వారిని స‌హ‌క‌రించిన వారిని ఎవ‌రినీ వైయ‌స్సార్సీపీ వ‌దిలిపెట్ట‌దు. నిందితుల‌ను చ‌ట్ట‌ప‌రంగా శిక్షించేదాకా న్యాయ‌స్థానాల్లో పోరాడ‌తాం. జాతీయ‌స్థాయిలో మాన‌వ‌హ‌క్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తాం. పేద‌వాడికి బ‌తికే స్వేచ్చ‌ను హ‌రిస్తున్న ఈ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి బుద్ధిచెబుతాం. గుర‌జాల‌లో గూండా రాజ్యం న‌డుపుతున్న ఎమ్మెల్యే య‌రప‌తినేని శ్రీనివాస్ కి ప్ర‌జాస్వామ్యం బ‌లం చూపిస్తాం. దాడి చేసి చంపార‌ని ఫోన్ చేసిన బాధితుల‌తో గ్రామంలోకి ఎందుకొచ్చార‌ని ప్రశ్నించిన సీఐ భాస్క‌ర్‌రావుని న్యాయ‌స్థానాల ద్వారా శిక్ష ప‌డేలా చేస్తాం. శాంతిభ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌లో చూపించిన నిర్ల‌క్ష్యానికి మూల్యం చెల్లించ‌క‌త‌ప్ప‌దు. అంత్య‌క్రియ‌లు చేసుకుంటామ‌ని వేడుకునే దుస్థితికి, శ్మ‌శానానికి ఆధార్ కార్డులు చూపించాల్సిన దౌర్భాగ్యానికి రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. మందా సాల్మ‌న్‌ని దారుణంగా హత్య చేసినా ప్ర‌తీకారం చేయాల‌నో, ప‌రిహారం కావాల‌నో కోరుకోకుండా గ్రామంలో శాంతి నెల‌కొనాల‌ని ఆశిస్తున్న వారి కుటుంబ స‌భ్యుల‌కు చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా. గ్రామంలో ఇదే చివ‌రి హ‌త్య కావాల‌ని వేడుకుంటున్న వారి పెద్ద మ‌న‌సుని ప్ర‌భుత్వం అర్థం చేసుకోవాలి.  

● రాష్ట్రాన్ని రాతియుగంవైపు తీసుకెళ్తున్నారు 
- మేక‌తోటి సుచ‌రిత‌, మాజీ హోంమంత్రి

నాడు వైయ‌స్సార్సీపీ హయాంలో ప‌ల్నాడులో శాంతిభ‌ద్ర‌త‌లు నెల‌కొనేలా కృషి చేశాం. గ్రామాల నుంచి వెళ్లి బ‌య‌ట నివ‌సిస్తున్న వారిని పోలీసుల సాయంతో వెన‌క్కి రప్పించి కుటుంబంతో ప్ర‌శాంతంగా బ‌తికే వాతావ‌ర‌ణం తీసుకొచ్చాం. కానీ సీఎం చంద్ర‌బాబు మాత్రం విజ‌నరీన‌ని చెప్పుకుంటూనే రాష్ట్రాన్ని మ‌ళ్లీ రాతి యుగంవైపుకి న‌డిపిస్తున్నాడు. రెడ్ బుక్ పాల‌న‌తో క‌క్షా రాజ‌కీయాల‌కు తెర‌లేపాడు. గ్రామానికి ఎందుకొచ్చావ్ అని ప్ర‌శ్నిస్తున్న పోలీసులు ప‌నిచేయ‌డం చేత‌కాని అస‌మ‌ర్థుల కిందే లెక్క‌. అలాంటి వారు ఉద్యోగాల‌కు ప‌నికిరారు. త‌క్ష‌ణ‌మే రాజీనామా చేయాలి. బాధితుల‌కు భ‌రోసా ఇవ్వ‌లేక‌పోవ‌డం ప్ర‌భుత్వ అస‌మ‌ర్థ‌తే అవుతుంది.

● మందా సాల్మ‌న్ హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి
- మేరుగ నాగార్జున‌, మాజీ మంత్రి 

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేవిధంగా మందా సాల్మ‌న్‌ని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేశారు. అమాయ‌క ద‌ళిత కుటుంబంపై దాడి చేసి చంపితే ప్ర‌భుత్వం ఇప్ప‌టివ‌రకు స్పందించ‌లేదు. ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చినా డీజీపీ క‌నీసం క‌ల‌వ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. ద‌ళితుల ప్రాణాలంటే ఈ ప్ర‌భుత్వానికి అంత లెక్క‌లేనిత‌నం. డిప్యూటీసీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పిఠాపురంలో ద‌ళితుల‌ను గ్రామ బ‌హిష్క‌ర‌ణ చేసినా ఆయ‌న ప‌ట్టించుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితుల మీద దాడులు, దౌర్జ‌న్యాలు, ద‌ళిత మ‌హిళ‌ల మీద అఘాయిత్యాలు ఎక్కువైపోయాయి. మందా సాల్మ‌న్ హ‌త్య‌పై సీబీఐ విచార‌ణ జ‌రిపించాలి. వైయ‌స్సార్సీపీ హ‌యాంలో ఒక మ‌హిళ‌ను దారుణంగా చంపితే ద‌ళిత చ‌ట్టాల ప్ర‌కారం వారిని ప్ర‌భుత్వం ఆదుకుంది. కానీ ఇప్పుడు మందా సాల్మ‌న్ హ‌త్య‌ విష‌యంలో ప్ర‌భుత్వం స‌రిగా స్పందించ‌క‌పోవ‌డం దుర్మార్గం. 
 
● మందా సాల్మ‌న్ కుటుంబానికి న్యాయం జ‌రిగేదాకా ఉద్య‌మిస్తాం
- విడ‌ద‌ల ర‌జ‌ని, మాజీ మంత్రి 

కూటమి ప్ర‌భుత్వం వ‌చ్చాక రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా క్షీణించాయి. ముఖ్యంగా ప‌ల్నాడు జిల్లాలో దాడులు, వేధింపులు మ‌రీ ఎక్కువ‌గా ఉంటున్నాయి. అయినా అవ‌న్నీ లెక్క‌చేయ‌కుండా పార్టీ కోసం ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌ల‌కు హ్యాట్సాఫ్ చెబుతున్నా. ప్ర‌భుత్వం, పోలీసుల నిర్ల‌క్ష్యం కార‌ణంగానే మందా సాల్మ‌న్ హ‌త్య జ‌రిగింది. ఇది ఖ‌చ్చితంగా ప్ర‌భుత్వ హ‌త్యే. వైయ‌స్సార్సీపీకి అండ‌గా నిలిచిన వ్య‌క్తుల మీద దాడులు ప‌రిపాటిగా మారాయి. సామాన్యుడు పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లే ప‌రిస్థితి కనిపించ‌డంలేదు. బాధితుల‌నే నిందితులుగా మార్చి చూపిస్తున్నారు. పిన్నెల్లి గ్రామం నుంచి  300 కుటుంబాలు బయ‌ట‌కు వెళ్లి జీవించాల్సిన దుస్థితి వ‌చ్చిందంటే ఇది పోలీసుల చేత‌కానిత‌న‌మే. మందా సాల్మ‌న్ కుటుంబానికి న్యాయం చేసేదాకా వైయస్సార్సీపీ పోరాడుతుంది. 

● దాచేప‌ల్లి పోలీస్‌ స్టేష‌న్‌ని ముట్ట‌డిస్తాం
- సాకె శైల‌జానాథ్‌, మాజీ మంత్రి 

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాజ‌కీయాల‌ను దోపిడీ, దుర్మార్గాల వైపు న‌డిపిస్తున్నాడు. శాంతిభ‌ద్ర‌త‌ల‌ను కాపాడ‌టం చేత‌కాని పోలీసులు ఉద్యోగాల‌కు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ అమాయ‌కులైన ద‌ళితుల‌ను టీడీపీ క‌క్ష‌ల‌కు బ‌లిపెట్ట‌డం మంచిదికాదు. త్వ‌ర‌లోనే ఎస్సీలంతా క‌లిసి దాచేప‌ల్లి పోలీస్‌స్టేష‌న్‌ని ముట్ట‌డిస్తాం. కూట‌మి ప్ర‌భుత్వానికి ఎస్సీల బ‌లం చూపిస్తాం. భ‌య‌ప‌డ‌టానికి వైయ‌స్సార్సీపీ కార్యక‌ర్త‌లు సిద్ధంగా లేరు. వైయ‌స్ జ‌గ‌న్ గారి నాయ‌క‌త్వ‌లో అక్ర‌మాల‌పై తిరుగుబాటు చేస్తాం. ఊరు బాగుంటే చాలు, ఇదే చివ‌రి హ‌త్య కావాల‌ని చెప్పిన మందా సాల్మ‌న్ బిడ్డ‌ల పెద్ద మ‌న‌సుని అభినందిస్తున్నా. 

● పిన్నెల్లి గ్రామంలో శాంతి నెల‌కొనాలి
- వైయ‌స్సార్సీపీ ప‌ల్నాడు జిల్లా వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస‌రెడ్డి

చంద్ర‌బాబు దృష్టిలో ద‌ళితుల ఓట్లకున్న విలువ వారి ప్రాణాల‌కు లేదు. కూట‌మి వ‌చ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ద‌ళితుల‌పై జ‌రుగుతున్న దాడులు, బ‌హిష్క‌ర‌ణ‌లు, వేధింపులే దీనికి నిద‌ర్శ‌నం. మందా సాల్మ‌న్ ని దారుణంగా హత్య చేసి ప‌ది రోజుల‌వుతున్నా ఇంత‌వ‌ర‌కు ఏమాత్రం స్పందించ‌ని చంద్ర‌బాబు, వైయ‌స్సార్సీపీ సంస్మ‌ర‌ణ కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తుంద‌ని తెలుసుకుని గ్రామంలోకి టీడీపీ నాయ‌కుల‌ను పంపించి కుటిల రాజ‌కీయాలు చేస్తున్నాడు. మందా సాల్మ‌న్ హ‌త్య ముమ్మాటికీ ప్ర‌భుత్వ హ‌త్యే. ద‌ళితుల గ్రామ బ‌హిష్క‌ర‌ణ జ‌రిగి రెండేళ్ల‌వుతుంటే ఒక్క‌సారి కూడా ప‌ట్టించుకోని చంద్ర‌బాబు కార‌ణంగానే ఈ హ‌త్య జ‌రిగింది. మందా సాల్మ‌న్ కుటుంబానికి ప్ర‌భుత్వం న్యాయం చేయాలి. గ్రామంలో శాంతి వాతావ‌ర‌ణం తీసుకురావాలి. గ్రామం నుంచి వెళ్లిపోయిన కుటుంబాల‌ను గ్రామానికి రప్పించాలి. మందా సాల్మ‌న్ కుటుంబానికి వైయ‌స్సార్సీపీ అండగా ఉంటుంది. 

● ప‌ల్నాడు వ్యాప్తంగా ఆట‌విక రాజ్యం  
- టీజేఆర్ సుధాక‌ర్ బాబు, వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే

ఎమ్మెల్యే య‌ర‌ప‌తినేని శ్రీనివాస్ డైరెక్ష‌న్‌లో సీఐ భాస్క‌ర్‌రావు సార‌థ్యంలో మందా సాల్మ‌న్ ని దారుణంగా హ‌త‌మార్చారు. దాదాపు రెండేళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటూ భార్య‌ను చూడ‌టానికి వ‌చ్చిన సాల్మ‌న్ ని చంప‌డం సిగ్గుచేటు. వైయ‌స్సార్సీపీకి అండ‌గా ఉన్న కుటుంబాల‌ను భ‌య‌భ్రాంతుల‌కు గురి చేసి పార్టీకి దూరం చేయ‌డానికి జ‌రుగుతున్న చ‌ర్య‌ల్లో భాగంగానే పోలీసుల‌ను అడ్డం పెట్టుకుని చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన నాటి నుంచి ప‌ల్నాడు వ్యాప్తంగా ఆట‌విక రాజ్యం న‌డుస్తోంది. గూండాలు, దోపిడీదారుల‌కు అండగా పోలీసులు ప‌నిచేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేయ‌డం చేత‌కాక దాడుల‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌పెట్టాల‌ని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేత‌నైతే అభివృద్ధిలో పోటీప‌డాలి. మెడిక‌ల్ కాలేజీ పూర్తి చేసి ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేవాలి. మందా సాల్మ‌న్ కుటుంబానికి న్యాయం జ‌రిగేదాకా వైయ‌స్సార్సీపీ పోరాడుతుంది. 

● ప‌లుకూరులో 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచిపోయాయి
- బొల్లా బ్ర‌హ్మ‌నాయుడు, వినుకొండ మాజీ ఎమ్మెల్యే

కూటమి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక వెనుబ‌డిన ఎస్సీఎస్టీబీసీ మైనారిటీ వ‌ర్గాల మీద దాడులు నిత్య‌కృత్యమైపోయాయి. ఏడాది పాల‌న పూర్తికాకుండానే ప్ర‌భుత్వంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ‌చ్చింది. 20 నెల‌ల్లో చంద్ర‌బాబు పాల‌న మీద‌ ప్ర‌జా వ్య‌తిరేక‌త ప‌తాక‌స్థాయికి చేరింది. పిన్నెల్లి మాదిరిగానే బొల్లాప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం ప‌లుకూరులో కూడా కూటమి ప్ర‌భుత్వం ఏర్పాట‌య్యాక 400 కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయి. గ్రామంల భూముల‌న్నీ బీడుబారిపోయాయి. ఇలాంటి దారుణ వాతావ‌ర‌ణాన్ని సృష్టించిన ప్ర‌భుత్వానికి రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లే మంచి గుణ‌పాఠం చెబుతారు. కార్య‌క‌ర్త‌ల‌కు, ప్ర‌జ‌ల‌కు వైయ‌స్సార్సీపీ అండగా ఉంటుంది. 

● హ‌త్య త‌ర్వాతా క్షుద్ర రాజ‌కీయాలు   
- పూనూరు గౌత‌మ్ రెడ్డి, న‌ర‌స‌రావుపేట పార్ల‌మెంట్ పార్టీ ఇన్‌చార్జి 

కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పాటైన నాటి నుంచి రాష్ట్రాన్ని బీహార్ క‌న్నా దారుణంగా త‌యారు చేసింది. వైయ‌స్ జ‌గ‌న్ గారిని రాజ‌కీయంగా ఎదుర్కోలేక వైయ‌స్సార్సీపీకి అండ‌గా నిలిచే వారి మీద దాడులు చేసి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేసే నీచ సంస్కృతికి చంద్ర‌బాబు శ్రీకారం చుట్టారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో పోలీసుల‌ను అడ్డం పెట్టి టీడీపీ నాయ‌కులు ప్ర‌తీకార రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతున్నారు. పిన్నెల్లి గ్రామంలో వైయ‌స్సార్సీపీకి ఉన్న ప్ర‌జాబ‌లాన్ని నిర్వీర్యం చేయాల‌న్న కుట్ర‌తోనే మందా సాల్మ‌న్ హ‌త్య జ‌రిగింది. హ‌త్య అనంత‌రం కూడా తెలుగుదేశం పార్టీ నాయ‌కులు అమాన‌వీయ చ‌ర్య‌లకు దిగారు. మందా సాల్మ‌న్ దేహాన్ని ఖ‌న‌నం చేయ‌డానికి కూడా హైడ్రామా చేశారు. సాల్మ‌న్ క‌డ‌సారి చూపుకి కూడా నోచుకోనీయ‌కుండా కుటుంబ స‌భ్యుల‌ను, బంధువుల‌ను, గ్రామస్తుల‌ను అడ్డుకున్నారు. క‌నీస మాన‌వ‌త్వం లేకుండా అడుగ‌డుగునా క్షుద్ర రాజ‌కీయాలు చేశారు. 

● ఆ పోలీసుల‌ను స‌స్పెండ్ చేయాలి
- కొమ్మూరి క‌న‌కారావు, వైయ‌స్సార్సీపీ ఎస్సీ సెల్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ 

రెండేళ్లుగా 400 కుటుంబాలు ఒక గ్రామాన్ని విడిచి వెళ్లిపోయాయంటే శాంతిభ‌ద్ర‌త‌లు ప‌రిర‌క్షించ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని చెప్ప‌డానికి వేరే ఉదాహ‌ర‌ణ‌లు ఏవీ అవ‌స‌రం లేదు. మందా సాల్మ‌న్ హ‌త్యకు పోలీసుల నిర్ల‌క్ష్య‌మే ప్ర‌ధాన కార‌ణం. అందుకు కార‌ణ‌మైన పోలీస్ అధికారుల‌ను త‌క్ష‌ణం సస్పెండ్ చేయాలి. ఈ దారుణ హ‌త్య‌పై ప్ర‌భుత్వ పెద్ద‌లు స్పందించ‌క‌పోగా ఈ కేసును నీరుగార్చాల‌నే కుట్ర చేస్తున్నారు. మందా సాల్మ‌న్ కుటుంబానికి ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ప‌రిహారం, ఐదెక‌రాల పొలం ఇచ్చి ఆదుకోవాలి. 

● పిన్నెల్లిలో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించుకోలేని దుస్థితి
- గ‌జ్జ‌ల సుధీర్ భార్గ‌వ్ రెడ్డి, స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గ పార్టీ స‌మ‌న్వ‌య‌క‌ర్త‌

మందా సాల్మ‌న్‌ను ప్ర‌త్య‌ర్థులు దారుణంగా ఇనుప రాడ్డుల‌తో కొట్టి దాడి చేస్తే, అప‌స్మార‌క స్థితిలో ప్రాణాపాయంతో ఆస్ప‌త్రిలో ఉన్న బాధితుడిపైనే పోలీసులు కేసు న‌మోదు చేశారంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమ‌ల్లో పోలీసులు ఎంత అప్ర‌మ‌త్తంగా ప‌నిచేస్తున్నారో అర్థం చేసుకోవ‌చ్చు. ప్ర‌జ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన పోలీసులు, నిందితుల‌కు అండ‌గా ఉండి బాధితుల‌పైనే కేసులు పెడుతున్నారు. గ్రామం నుంచి వెళ్లిపోయిన 300 కుటుంబాల‌ను వెన‌క్కి ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయక‌పోవ‌డం దుర్మార్గం. బ‌య‌ట‌కెళ్లిన వారు ఎవ‌రైనా మ‌ర‌ణిస్తే పోలీసుల ర‌క్ష‌ణ లేకుండా గ్రామ‌స్తుడి అంత్య‌క్రియ‌లు చేసుకోలేని దుస్థితి. పోలీసుల ర‌క్ష‌ణ‌లో అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలంటే ల‌క్ష‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని భ‌య‌పెడుతున్నారు. గ‌తంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రభుత్వం మారిన నాటి నుంచి ప‌ల్నాడులో ఫ్యాక్ష‌న్ వాతావ‌ర‌ణం తీసుకొచ్చారు. 

● ద‌ళితుల‌పై దాడులు ఆపాలి
- నారాయ‌ణమూర్తి, వైయ‌స్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ ప్రెసిడెంట్ 

మందా సాల్మ‌న్ హ‌త్య‌ను ఈ స‌మాజం తీవ్రంగా ఖండిస్తోంది. ద‌ళితుల మీద దాడుల‌ను కూట‌మి నాయ‌కులు ఆప‌క‌పోతే రాబోయే రోజుల్లో ఖ‌చ్చితంగా ప్ర‌తిఫ‌లం అనుభ‌విస్తారని హెచ్చరించారు.

Back to Top