టర్కీ, సిరియాల్లో చిక్కుకున్న తెలుగువారిని ఆదుకోండి 

వారు తిరిగి వస్తామంటే కావాల్సిన సహకారం అందించండి

విదేశాంగ శాఖకు వైయ‌స్ఆర్ సీపీ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: టర్కీ, సిరియాల్లో సంభవించిన భారీ భూకంపంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన వారు చిక్కుకున్నారని, వారికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్‌ను కోరినట్లు వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు నిధుల వంటి వాటిపై పార్లమెంటులో ప్రశ్నించినట్లు వారు తెలిపారు. ఈ మేర‌కు ఢిల్లీలోని ఏపీ భ‌వ‌న్‌లో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు బెల్లాన చంద్రశేఖర్, పోచా బ్రహ్మానందరెడ్డి, తలారి రంగయ్య, రెడ్డప్ప విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఈ సంద‌ర్భంగా వైయ‌స్ఆర్ సీపీ ఎంపీలు ఏం మాట్లాడారంటే..

వారంద‌రికీ ర‌క్ష‌ణ క‌ల్పించాలి : ఎంపీ బెల్లాన‌
టర్కీ, సిరియాలో వచ్చిన భూకంపంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన వెయ్యి మంది వలస కార్మికులు చిక్కుకున్నారు. వారందరికీ రక్షణ, వైద్య సదుపాయాలు అందించాలని విదేశాంగ మంత్రి జయశంకర్‌కు వినతి పత్రం ఇచ్చాం. ప్రత్యేక హోదా గురించి గతంలో ఇచ్చిన హామీ నెరవేర్చాలని మా పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. ప్రతిపక్షాలు ఎన్ని ఆటంకాలు కల్పించినా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయడం కోసం ఆయన మాట్లాడారు. పోలవరం, విభజన సమస్యల పరిష్కారంతో పాటు భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి అంశాలకు పరిపాలన అనుమతులు ఇవ్వాలని కోరాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో మత్స్యకారులు ఎక్కువగా ఉన్నందున జెట్టీలు, హార్బర్లు కావాలని కోరాం.

వారిని సుర‌క్షితంగా ఏపీకి చేర్చాలి : ఎంపీ తలారి రంగయ్య
టర్కీకి పెద్ద ఆపద వచ్చింది. భారతదేశం ఇప్పటికే సహాయక చర్యలు చేపట్టింది. అందుకు మా పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాం. ఉత్తరాంధ్రకు చెందిన వెయ్యి మంది టర్కీలో చిక్కుకున్నారు. వారికి సహాయ సహకారాలు అందించాలని కోరాం. టర్కీ, సిరియాల్లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారు ఇక్కడికి తిరిగి రావాలనుకుంటే సహాయ సహకారాలు అందించాలని భారత విదేశాంగ శాఖ మంత్రిని కోరాం. రాబోయే రోజుల్లో ఆయా దేశాల ఎంబసీలను కూడా సంప్రదించి పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున సహాయం అందేలా గట్టి ప్రయత్నం చేస్తాం.

వారిద్ద‌రూ భూస్థాపితం అయ్యారు.. : ఎంపీ రెడ్డప్ప
లోకేశ్‌ పాదయాత్రలో పోలీసులను తీసేస్తే 30 మంది కంటే ఎక్కువ లేరు. రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డిలే. అందుకే వారిద్దరూ రాజకీయంగా భూస్థాపితం అయ్యారు. నమ్మిన వారిని మోసం చేస్తే వారి గతి అలా అయ్యింది. సీఎం వైయ‌స్ జగన్‌లా సొంతంగా వారు పార్టీ పెట్టలేదు. ఇక వారెలా నాయకులు అవుతారు.? పోలవరం ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం చేసిన ఘనకార్యం వల్లనే. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పరిపాలన రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అందుకే వీళ్లెన్ని విమర్శలు చేసినా ఫలితం లేదు. ఏపీలోని వెనకబడిన జిల్లాలకు కేంద్రం ఇస్తామన్న నిధులు ఇవ్వలేదు. పోలవరం ప్రాజెక్టుకు రావాల్సిన నిధులు రావడం లేదు. వీటన్నింటి విషయంలో కేంద్రం సానుకూలంగా నిర్ణయం తీసుకుని, వెంటనే నిధులు విడుదల చేయాలి. కేంద్రం ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలను కూడా రాష్ట్రానికి మరిన్ని మంజూరు చేయాలి.

Back to Top