ప్రాణాలు బ‌లికోరుతున్న టీడీపీ న‌కిలీ మ‌ద్యం

రాష్ట్రంలో వేళాపాలా లేకుండా రాత్రింబ‌వ‌ళ్లు మ‌ద్యం విక్ర‌యాలు

వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల ఆగ్ర‌హం

తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన పార్టీ అధికార ప్రతినిధి ఆరె శ్యామ‌ల‌

కర్నూలు బ‌స్సు ప్ర‌మాదానికి నకిలీ మ‌ద్య‌మే కార‌ణం

20 మంది అమాయ‌కుల మ‌ర‌ణాల‌కు ప్ర‌భుత్వానిదే బాధ్య‌త‌

అర్థ‌రాత్రయినా బెల్ట్ షాపుల్లో మ‌ద్యం దొరుకుతోంది  

బ‌స్సు ప్ర‌మాదం తర్వాత  ల‌క్ష్మీపురం బెల్ట్ షాపు మూసేశారు

అక్క‌డ మ‌ద్యం తాగిన మ‌త్తులోనే హైవేపై బైక‌ర్ కి ప్ర‌మాదం 

అందుకే సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం భ‌య‌ప‌డుతోంది

స్ప‌ష్టం చేసిన ఆరె శ్యామ‌ల 

తాడేప‌ల్లి:  రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయ‌కుల కనుస‌న్న‌ల్లో వేళాపాలా లేకుండా రాత్రింబ‌వ‌ళ్లు న‌డుస్తున్న న‌కిలీ మ‌ద్యం కార‌ణంగానే కర్నూలులో బ‌స్సు ప్ర‌మాదం జ‌రిగి 20 మంది అమాయ‌కుల ప్రాణాలు గాల్లో క‌లిసిపోయాయ‌ని వైయస్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి ఆరె శ్యామ‌ల ఆగ్ర‌హం వ్యక్తం చేశారు. తాడేప‌ల్లి లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ న‌కిలీ మ‌ద్యం విక్ర‌యాల కార‌ణంగా నిత్యం ప్ర‌మాదాలు, దారుణాలు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు జరుగుతున్నా ప్ర‌భుత్వానికి చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌న్నారు. న‌కిలీ మ‌ద్యం కార‌ణంగా బ‌స్సు ప్ర‌మాదం జ‌ర‌గ‌లేద‌ని చెప్ప‌డానికి కూట‌మి ప్ర‌భుత్వం నానాతిప్ప‌లు ప‌డుతోంద‌ని ఆరోపించారు. బైక‌ర్ శివ‌శంక‌ర్ ప్ర‌మాదం జ‌రిగిన రోజున రాత్రి 7 గంట‌లకు, 8.30గంట‌ల‌కు మ‌ద్యం తాగాడని పోలీసులు చేస్తున్న వాద‌న పేల‌వంగా ఉంద‌ని, అర్ధ‌రాత్రి 2.30 గంట‌ల స‌మ‌యంలో పెట్రోల్ బంకులో దొరికిన సీసీ టీవీ ఫుటేజీలో బైక‌ర్ బాగా మ‌త్తులో క‌నిపిస్తున్నాడ‌ని శ్యామ‌ల వివ‌రించారు. బైకర్ శివ‌శంక‌ర్ కార‌ణంగా ప్ర‌మాదం జ‌రిగింద‌ని తెలిసిన త‌ర్వాత అత‌డు అర్ధ‌రాత్రి మ‌ద్యం కొనుగోలు చేసిన ల‌క్ష్మీపురం బెల్ట్ షాపును టీడీపీ నాయ‌కులు మూసేశార‌ని, కాబ‌ట్టే సీసీ టీవీ ఫుటేజ్ ఇవ్వ‌డానికి ఈ ప్ర‌భుత్వం భ‌య‌ప‌డిపోతోంద‌ని ఆరె శ్యామ‌ల ఆమె స్ప‌ష్టం చేశారు. ఆమె ఇంకా ఏమ‌న్నారంటే... 

● వేళాపాలా లేకుండా రాత్రింబ‌వ‌ళ్లు మ‌ద్యం అమ్మ‌కాలు

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక మ‌ద్యం ఏరులై పారుతోంది. ప‌గ‌లూ రాత్రీ అనే తేడాలేకుండా అర్థ‌రాత్రి కూడా విచ్చ‌లవిడిగా మ‌ద్యం విక్ర‌యిస్తున్నారు. ఒకవైపు మద్యం షాపుల మాఫియా, మరోవైపు బెల్ట్ షాపుల ద్వారా దందా యథేచ్చగా కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్షన్నరకు పైగానే బెల్ట్ షాపులు అనధికారికంగా నడుస్తున్నాయి. వీటిలో అధిక ధరలకు మద్యాన్ని వేళాపాలా లేకుండా విక్రయిస్తున్నారు. అందులోనూ ప్రజల జీవితాలను పణంగా పెట్టి నకిలీ మద్యం విక్ర‌యిస్తున్నారు. ముల‌క‌ల‌చెరువులో నకిలీ మ‌ద్యం రాకెట్‌ గుట్టుర‌ట్టవ‌డంతో తాము తాగేది న‌కిలీ మ‌ద్య‌మో, ఒరిజిన‌ల్ మ‌ద్య‌మో అర్థం కాని ఆందోళ‌న‌లో మ‌ద్యం ప్రియులున్నారు. మ‌ద్యం బాటిల్‌పైన క్యూఆర్ కోడ్ ఉండేలా కొత్త‌గా జీవో విడుద‌ల చేశారు. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి న‌కిలీదో ఒరిజిన‌ల్‌దో తెలుసుకోవాలంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా ఒక్క బాటిలైనా స్కాన్ చేశారా? ఎక్క‌డైనా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన వీడియోలున్నాయా? మద్యం షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బెల్టు షాప్‌లు అన్నీ ఏ రకంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు నడుపుతున్నప్పుడు ఎవ‌రు క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారు?  ఎక్క‌డైనా, ఏ స‌మ‌యంలోనైనా మ‌ద్యం య‌థేచ్చ‌గా దొరుకుతుండ‌టంతో మ‌ద్యం ప్రియులు విచ్చ‌ల‌విడిగా తాగేసి ఆరోగ్యం పాడు చేసుకోవ‌డమే కాకుండా కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఇంకోప‌క్క మ‌ద్యం మ‌త్తులో మ‌హిళ‌ల‌పై దారుణాలు పెరిగిపోయాయి. మ‌ద్యం మ‌త్తులో దాడులు జ‌రుగుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు అదుపుత‌ప్పాయి. అయినా మ‌ద్యం మాఫియా ఆగ‌డాల‌కు క‌ళ్లెం వేసే చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి మాత్రం చంద్ర‌బాబు ముందుకు రావ‌డం లేదు. దీంతో నేరాలకు పాల్ప‌డినా త‌మ‌కేమీ కాద‌నే ధైర్య‌మొచ్చింది. 24 గంట‌లూ మ‌ద్యం అందుబాటులో ఉంచి తాగొద్దంటే ఎవ‌రు ఊరుకుంటారు? 

● బెల్ట్‌ షాప్‌లో మ‌ద్యం అమ్మ‌క‌మే ప్ర‌మాదానికి కార‌ణం

క‌ర్నూలులో జ‌రిగిన బస్సు ప్ర‌మాదం వెనుక న‌కిలీ మ‌ద్యమే కార‌ణమ‌ని తెలిసి ప్ర‌జ‌లు తీవ్రంగా ఆందోళ‌న చెందుతున్నారు. అర్థరాత్రి మ‌ద్యం తాగిన బైక‌ర్ డివైడ‌ర్ ఢీకొట్టి న‌డిరోడ్డుపై చ‌నిపోవ‌డంతో ఆ బైకును ఢీకొట్టిన బ‌స్సు మంట‌ల్లో కాలిపోయింది. ఈ దుర్ఘ‌ట‌న‌లో బైక‌ర్‌తో స‌హా 20 మంది అమాయ‌కులు త‌మ ప్రాణాలు కోల్పోయారు. అందులో అభంశుభం తెలియ‌ని చిన్నారులు కూడా ఉండ‌టం మ‌రింత బాధ‌ను క‌లిగిస్తోంది. ప్రమాదానికి కార‌ణ‌మైన‌ బైక‌ర్ కి అర్ధరాత్రి మ‌ద్యం దొరక్క‌పోయుంటే ఆ ప్ర‌మాద‌మే జ‌ర‌గ‌క‌పోయేది. 20 మంది ప్రాణాల‌తో మిగిలేవారు.అక్రమార్జ‌నే ధ్యేయంగా తెలుగుదేశం నాయకుల క‌నుస‌న్న‌ల్లో న‌డుస్తున్న న‌కిలీ మ‌ద్యం మాఫియా కార‌ణంగానే అమాయ‌కులు బ‌లైపోయారు. వారి కుటుంబాలు క్షోభ‌ను అనుభ‌విస్తున్నాయి. తాగిన వ్యక్తి చనిపోయాడు,  అమాయకులనూ బలిగొన్నాడు. ఇంకా ఎంత మంది చనిపోతే చంద్రబాబు గారు మేల్కొంటారో అర్థం కావడం లేదు. మ‌ద్యం విచ్చ‌లవిడిగా అమ్మ‌డ‌మే ప్ర‌మాదానికి కార‌ణం. దీన్ని తెలుగుదేశం నాయ‌కులు కాద‌న‌గ‌ల‌రా? హైవే రోడ్ల‌కు అత్యంత స‌మీపంలో విచ్చ‌ల‌విడిగా రాత్రింబ‌వ‌ళ్లు మ‌ద్యం అమ్మ‌కాలు జ‌రిపడం త‌ప్పు కాదా? ఇది ప్ర‌భుత్వ బాధ్య‌త‌రాహిత్యం కాదా? వ్య‌వ‌స్థీకృతంగా జ‌రుగుతున్న ఈ మ‌ద్యం మాఫియాకు కూట‌మి ప్ర‌భుత్వం బాధ్య‌త వ‌హించాలి. దీన్నుంచి ఎవ‌రూ త‌ప్పించుకోలేరు. 

● బెల్ట్‌ షాప్ సీసీ టీవీ ఫుటేజీ ఎందుకివ్వ‌డం లేదు? 

రాత్రి 7 గంట‌ల‌కు ఒక‌సారి, 8.45 గంట‌ల‌కు బైక‌ర్ శివశంక‌ర్ లిక్క‌ర్ తాగాడని పోలీసులే చెబుతున్నారు. ఆ స‌మ‌యంలో తాగితే తెల్ల‌వారుజామున 2.30 గంట‌ల స‌మ‌యంలో మ‌ద్యం మ‌త్తులో ప్ర‌మాదం జ‌రిగి శివ‌శంక‌ర్ చ‌నిపోయాడ‌ని చెబుతున్నారు. ల‌క్ష్మీపురంలో బెల్ట్ షాపు నిర్వ‌హిస్తున్న విష‌యం వాస్త‌వ‌మా కాదా?  బెల్ట్ షాపు నిర్వ‌హిస్తున్న వ్య‌క్తి త‌న ఇంటికి సీసీ కెమెరా కూడా అమ‌ర్చుకున్నాడు. ఆ ఫుటేజీ ఇవ్వ‌డానికి ప్ర‌భుత్వం ఎందుకు వెన‌కాడుతోంది?  అత‌డ్ని పిలిచి పోలీసులు ఎందుకు విచారించ‌డం లేదు?  అత‌డ్ని విచారిస్తే ప్ర‌భుత్వ త‌ప్పులు బ‌య‌ట‌ప‌డ‌తాయ‌ని, బ‌స్సు ప్ర‌మాదానికి న‌కిలీ మ‌ద్యం విక్ర‌యాలే కార‌ణ‌మ‌ని తెలిసిపోతుంద‌ని ప్ర‌భుత్వ భ‌యం. ల‌క్ష్మీపురంలో ఒక‌టి కాదు రెండు కాదు. ఏకంగా మూడు బెల్ట్ షాపులున్న మాట వాస్త‌వం కాదా? దీన్ని కాద‌న‌గ‌ల‌రా? బైక‌ర్ శివ‌శంక‌ర్ ల‌క్ష్మీపురంలో మద్యం కొన్న బెల్ట్ షాపు కనిపించకుండా మూసేశారు. రోజూ కనిపించే బెల్ట్ షాపు ఈ బస్సు ప్రమాదం తర్వాత వెంటనే మూత వేశారంటే దాని అర్థం ప్రజలకు నిజాలు తెలియకుండా దాచేందుకేనని ఎవరికైనా అర్థం అవుతుంది. బెల్ట్ షాపు వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజీని మాయం చేసి, అసలక్కడ బెల్ట్ షాపే లేదన్నట్లు బుకాయించడం చూస్తుంటే.. చంద్రబాబు ప్రభుత్వం, వారి లిక్కర్ మాఫియా ఏ స్థాయిలో బరితెగించిందో తెలుస్తుంది. 

● రాష్ట్ర వ్యాప్తంగా న‌కిలీ మ‌ద్యం ఫ్యాక్టరీలు 

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్క‌డిక‌క్క‌డ‌ ఏకంగా చిన్నపాటి నకిలీ మద్యం ఫ్యాక్టరీలు కనిపిస్తున్నాయి. మద్యం విక్రయాలన్నీ మాఫియా కనుసన్నల్లోనే కొనసాగుతున్నాయి. మద్యాన్ని వాళ్లే తయారు చేస్తున్నారు. వాళ్లకు చెందిన షాపుల ద్వారానే ఆ మద్యాన్ని వాళ్లే అమ్ముతున్నారు. వారికే చెందిన బెల్ట్‌ షాపుల ద్వారా కూడా విక్రయాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఏకంగా వేలం వేసి బెల్టు షాప్‌లు ఏర్పాటు చేశారు. వాటికి పోలీస్‌ రక్షణ ఇచ్చి, వారి ఆధ్వర్యంలో గ్రామాల్లో మద్యం అమ్మేందుకు ఈ మాఫియా ఎలా శ్రీకారం చుట్టింది. వాటిలోనూ నకిలీ మద్యం అమ్ముతున్నారు. బెల్ట్‌ షాపులే కాకుండా ఇల్లీగల్‌ పర్మిట్‌ రూమ్‌ల ద్వారా కూడా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ప్రభుత్వ ఖాజానాకు వేల కోట్ల నష్టం కలిగిస్తూ, ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతూ, వీళ్ల జేబులు నింపుకునేందుకు ఏ స్థాయికైనా దిగజారిపోయి, ఈరోజు డబ్బుల కోసం వ్యాపారం చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. వ్యవస్థీకృతంగా నకిలీ మద్యం తయారు చేయడం, అంతే వ్యవస్థీకృతంగా డిస్ట్రిబ్యూషన్‌ ఛానల్స్‌ అన్నీ వీళ్ల కంట్రోల్‌లోకి తీసుకోవడం. వాటి ద్వారా మార్కెటింగ్‌ చేయడం. ఇంత ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌ చేయడం ఒక్క చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేశ్‌కి మాత్రమే సాధ్యం. నిజంగా నకిలీ మద్యం ఫ్యాక్టరీలు పెట్టింది చంద్రబాబు నాయుడు మనుషులే. నకిలీ మద్యాన్ని తయారు చేసి, తమ మాఫియాలో భాగమైన ప్రైవేట్‌ లిక్కర్‌ షాపులకు సరఫరా చేసేదీ వాళ్లే. అక్కడే కాదు. తమ వారు నడిపే బెల్ట్‌ షాపులకు సప్లయ్‌ చేసేది కూడా చంద్రబాబు మనుషులు. అమ్మేది కూడా ఈయనకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలే. నకిలీ లిక్కర్‌ దందా మొత్తం నడిచేది టీడీపీ కార్యకర్తలు, వారి సిండికేట్‌ మాఫియా కనుసన్నల్లోనే. ఇలాంటి వారికే చంద్రబాబు నాయుడు క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేసే బాధ్యతలు ఇస్తున్నాడు. అంటే దొంగ చేతికి తాళాలు ఇవ్వడం అంటే ఇది కాదా? గ్రామాల్లో బెల్ట్‌ షాపుల్లో న‌కిలీ మ‌ద్యం యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. క్యూఆర్‌ కోడ్ అక్కడ ఎవరు స్కాన్‌ చేస్తారు?  కల్తీ మద్యం విచ్చలవిడిగా తయారవుతోంది అనేది కంటికి కనిపిస్తోంది. ఫ్యాక్టరీలతో సహా వీళ్ల పెట్టుబడుల్లో, ఆదాయాల్లో వీళ్లకు వీళ్లకు మనస్పర్దలు వచ్చిన చోట పట్టుబడుతున్నాయి. డిస్ట్రిబ్యూషన్‌ నెట్వర్క్‌ కనిపిస్తోంది. అమ్ముతున్నది కనిపిస్తోంది. అయినా వీళ్లకే మాత్రం స్పృహ కూడా లేదు. 

● నిందితుల‌ను కాపాడటానికే సిట్‌

న‌కిలీ మ‌ద్యం మాఫియా వెనుక టీడీపీ నాయ‌కులే ఉన్నార‌ని క‌ళ్ల ముందు ఎన్నో ఆధారాలు క‌నిపిస్తున్నా, టాపిక్ డైవ‌ర్ష‌న్ చేసి వైయస్ఆర్‌సీపీ మీద‌కు నెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. వాటాల పంప‌కాల ద‌గ్గ‌ర తేడా రావ‌డంతో న‌కిలీ మ‌ద్యం గుట్టు బ‌య‌ట‌పడింది. దాన్ని డైవ‌ర్ట్ చేయ‌డానికి చంద్ర‌బాబు చేస్తున్న కుట్ర‌లు అన్నీఇన్నీ కావు.  నాడు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన నాటి నుంచి ఆయన ఫ్లాష్‌ బ్యాక్‌ చూస్తే.. చేసేది ఆయనే. నెపాన్ని వేరేవాళ్ల మీదకు నెట్టేది ఆయనే. దానికి వత్తాసు పలికేది ఇదే ఎల్లో మీడియానే. చంద్రబాబే నేరాలు చేస్తాడు. అది బయటపడే సరికి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఎల్లో మీడియా సిద్ధం అవుతుంది. ఒక అబద్ధాన్ని నిజమని నమ్మించడం కోసం చెప్పిన అబద్ధమే వంద సార్లు చెప్పే కార్యక్రమం. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఇదే మోడస్‌ ఆపరెండీ. టాపిక్‌ డైవర్షన్‌లో భాగంగా ఎదుటివారిపై వారే బురద జల్లుతారు. వాళ్లే కొత్త కొత్త ఆరోపణలు చేస్తారు. వాళ్లే ఆ ఆరోపణలను నిజం చేయాలనే తాపత్రయంతో ఒక సిట్‌ కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తారు. డ్రామాను నడుపుతారు. ఇదేంటని పొరపాటున ప్రశ్నిస్తే.. వారిపై కూడా ముద్ర వేసేస్తారు. వారిని కూడా జైళ్లకు పంపించే కార్యక్రమం చేస్తారు. గ‌త చ‌రిత్ర చూస్తే చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్ ఎప్పుడూ నిజాలు నిగ్గుతేల్చ‌క‌పోగా, నిందితుల‌ను కాపాడుతుంది. 

● 50 ఇళ్ల‌కు బెల్ట్ షాపు, 2 వేల జ‌నాభాకి మ‌ద్యం షాపు

వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో అన్ని వ‌ర్గాల‌కు సంక్షేమ పాల‌న అందిస్తే, కూట‌మి ప్ర‌భుత్వం అన్ని వ‌ర్గాల‌ను దోచుకోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంది. మంత్రివ‌ర్గంలో ఉన్న వారెవ‌రికీ వారి శాఖ‌ల మీద త‌ప్ప మిగ‌తా అంశాల మీద‌నే ఎక్కువ శ్ర‌ద్ధ చూపిస్తున్నారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు నిత్యం ప్ర‌మోష‌న్‌, ప‌బ్లిసిటీల కోసం ప్ర‌జ‌ల సొమ్మును ఖ‌ర్చు చేస్తుంటే, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎంత‌సేపటికీ హోంశాఖ మీద దృష్టి. హోంమంత్రి అనిత మాత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను పొగడ‌ట‌మే స‌రిపోతుంది. మంత్రి లోకేశ్‌కి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి మీద ఆశ‌. అంతేత‌ప్ప న‌కిలీ మ‌ద్యంపైన‌ కానీ, ఆగిపోయిన ఆరోగ్య‌శ్రీ మీద కానీ, గురుకులాల్లో విద్యార్థుల చావుల మీద కానీ అస్స‌లు మాట్లాడ‌రు. 16 నెల‌ల‌కే రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్ర‌భుత్వంపైన తీవ్ర‌మైన వ్య‌తిరేక‌త వ‌చ్చేసింది. మెడిక‌ల్ కాలేజీల ప్రైవేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా వైయస్ఆర్‌సీపీ చేప‌ట్టిన కోటి సంత‌కాల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మానికి విప‌రీత‌మైన స్పంద‌న క‌నిపిస్తోంది. వైయస్ఆర్‌సీపీ హ‌యాంలో ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక వ‌లంటీర్‌ను నియ‌మించి సంక్షేమ ప‌థ‌కాల‌ను అంద‌జేస్తే, కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌తి 50 ఇళ్ల‌కు ఒక బెల్ట్ షాపు, ప్ర‌తి  2 వేల మంది జనాభాకు ఒక మ‌ద్యం షాపు, దానికి అనుబంధంగా ప‌ర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేస్తే ఎల్లో మీడియా చంద్ర‌బాబును విజ‌నరీగా కీర్తిస్తోంది. యువ‌త కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న త‌ప్పుల‌ను గ్ర‌హించారు. రాబోయే రోజుల్లో ప్ర‌జ‌లంతా కూట‌మి ప్రభుత్వానికి బుద్ది చెప్ప‌డానికి సిద్ధంగా ఉన్నారు.
 

Back to Top