నరసరావుపేట: రాష్ట్రంలో వైద్య, ఆరోగ్యరంగాలను సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేస్తూ, ప్రజారోగ్యాన్ని ప్రమాదంలోకి నెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రులకు బకాయిలు చెల్లించకపోవడంతో సమ్మె చేస్తున్నాయని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల పేదలకు అందాల్సిన ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అపర సంజీవని లాంటి సేవలు అందించే 108, 104 సర్వీసులను కూడా అర్హత లేని సంస్థకు, ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెట్టారని ధ్వజమెత్తారు. టీడీపీకి చెందిన డాక్టర్స్ సెల్ అధ్యక్షుడికి చెందిన సంస్థకు నిబంధనల విరుద్దంగా ఇటువంటి కీలకమైన ప్రజారోగ్యాన్ని అందించే సర్వీసుల బాధ్యతను అప్పగించడం ద్వారా ప్రజారోగ్యంతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ఆక్షేపించారు. ఇంకా ఆయనేమన్నారంటే... ఈ రాష్ట్ర చరిత్రలో స్వర్గీయ డాక్టర్ వైయస్ఆర్ పేరు ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచిపోవడానికి కారణం ఆరోగ్యశ్రీ పథకం. ప్రపంచంలోనే ఈ దేశం కూడా ప్రజారోగ్య రంగంలో ఇటువంటి గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టలేదు. కానీ ఆనాడు డాక్టర్ వైయస్ఆర్ ఎంతో ఆలోచనతో పేదవారికి మెరుగైన కార్పోరేట్ వైద్యాన్ని ఉచితంగా పొందేందుకు గానూ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువచ్చి, ప్రజారోగ్య రంగంలో విప్లవాత్మక మార్పుకు బీజం వేశారు. దాదాపు రెండువేల ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని నేడు రాష్ట్రంలో నడుపుతున్నారంటే దానికి కారణం ఆనాడు వైయస్ఆర్ తీసుకున్న నిర్ణయమే. దేశంలోనే రోల్‌మోడల్‌గా నిలబడ్డ ఈ ఆరోగ్యశ్రీ పథకాన్ని వైయస్ జగన్ గారు సీఎంగా మరింత విస్తృతం చేస్తూ, గతంలో 1700 ప్రొసీజర్స్ ఉంటే దానిని సుమారు 3700 ప్రోసీజర్లకు పెంచి, పేదలకు మెరుగైన వైద్యంను అందుబాటులోకి తీసుకువచ్చారు. రూ.1000 ఖర్చు అయ్యే వైద్యంను కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చారు. కోవిడ్ వంటి మహమ్మారిని కూడా ఆరోగ్యశ్రీ కిందకు తీసుకువచ్చి దాదాపు రూ.700 కోట్లు ఖర్చు చేశారు. కూటమి సర్కార్‌కు ప్రజారోగ్యంపై కనీస శ్రద్ద లేదు రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మెలో ఉన్నాయి. ఈ ఆసుపత్రులను కనీసం పిలిచి మాట్లాడే పరిస్తితి ఈ ప్రభుత్వంలో లేదు. ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చలు జరపడానికి కూడా తమకు సమయం లేదనే రీతిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఒకవైపున లక్షలాది మంది పేషంట్లకు ఆరోగ్యసేవలు నిలిచిపోయినా కూడా ఈ ప్రభుత్వానికి పట్టనట్లుగా ఉంది. ప్రజారోగ్యం పట్ల కూటమి ప్రభుత్వానికి, సీఎం చంద్రబాబుకు ఉన్న చిన్నచూపును వైయస్ఆర్‌సీపీ తరుఫున ప్రశ్నిస్తున్నాం. ఆరోగ్యశ్రీని తీసుకువచ్చిన డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి, ఈ పథకాన్ని మరింత బలోపేతం చేసిన వైయస్ జగన్ గారిపై చంద్రబాబుకు కోపం ఉండవచ్చు, కానీ ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాధి మంది పేదల మీద ఎందుకు తమ కోపాన్ని చూపుతున్నారో అర్థం కావడం లేదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కనీస ఆరోగ్య భద్రత కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోకుండా ఒక గ్రీన్ ఛానెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనిద్వారా నెలకు రూ.300 కోట్లు కేటాయిస్తే అన్ని ఆసుపత్రులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి. ఈ మేరకు నిధులు ఇవ్వలేరా? కనీసం మూడు నెలలకు ఒకసారి అయినా బకాయిలు చెల్లించినా కూడా ఆసుపత్రులు తమ విధులను కొనసాగిస్తాయి. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు విదేశీ పర్యటనలపై ఉన్న శ్రద్దలో కాస్త అయినా ప్రజారోగ్యంపై చూపాలని కోరుతున్నాం. గత ప్రభుత్వంలో వైయస్ జగన్ గారు రూ.13000 కోట్లు ప్రజారోగ్యం కోసం ఖర్చు పెట్టారు. దానిలో కనీసం పదిశాతం కూడా ఈ ప్రభుత్వం వెచ్చించలేదా? కేవలం పదహారు నెలల్లోనే దాదాపు రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ కింద నిలిచిపోయిన ఆపరేషన్లు ఆరోగ్యశ్రీ బకాయిలను చెల్లించకపోవడం వల్ల రాష్ట్రంలో చాలా ఆసుపత్రుల్లో జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితి కనిపిస్తోంది. ఈ రాష్ట్రంలో రోజుకు దాదాపు 9000 ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల సమ్మె కారణంగా ఈ ఆపరేషన్ల సంఖ్య కేవలం 3000కి తగ్గిపోయింది. రాష్ట్రంలో దాదాపు 95 శాతం ప్రైవేటు ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను బకాయిలు చెల్లించలేదనే కారణంగా నిలిపివేశాయి. గత పద్దెనిమిది రోజులుగా సమ్మె జరుగుతుంటే రూ.3000 కోట్లకు గానూ కేవలం రూ.250 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అది కూడా తమకు కావాల్సిన ఆసుపత్రులకు మాత్రమే చెల్లించి, ప్రైవేటు ఆసుపత్రి యాజమాన్యాలను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోంది. పేదలు ఆరోగ్యశ్రీ సేవలు పొందలేక, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ ప్రభుత్వం నిర్వాకాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. ఆరోగ్యశ్రీ వంటి గొప్ప పథకాన్ని గబ్బు పట్టిస్తున్న సీఎం చంద్రబాబు పాలనను చీత్కరిస్తున్నారు. రాష్ట్రంలో మొన్నటి దాకా పీహెచ్‌సీ డాక్టర్లు సమ్మె చేశారు. ఇరవై రోజుల తరువాత ఆరోగ్యశాఖ మంత్రి నామమాత్రపు చర్చల జరిపి, వారి ఆందోళలను విరమింపచేశారు. అయినా కూడా పీహెచ్‌సీ వైద్యులు అసంతృప్తితో పనిచేస్తున్నారు. మరోవైపు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రలు బకాయిలు ఇవ్వాలంటూ సమ్మె చేస్తుండటంతో పేదలు ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. 104, 108 సేవలను కూడా నీరుగార్చే కుట్ర రాష్ట్రంలో పేదలకు ఆపద కాలంలో అండగా ఉండటం, గ్రామాల్లో క్రమం తప్పకుండా వైద్యసేవలను అందించడం ద్వారా అపర సంజీవనీ అని కీర్తిని సంపాధించిన 108, 104 సేవలను కూడా కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా నీరుగారుస్తోంది. గతంలో ప్రతిష్టాత్మకమైన సంస్థల పర్యవేక్షణ, నిర్వహణలో ఈ సర్వీసులు నడిచేవి. నేడు కూటమి ప్రభుత్వం వీటిని కూడా సమర్థత లేని సంస్థలకు, తమకు కావాల్సిన వారికి కట్టబెట్టింది. దీనితో సంస్థ నిర్వహణలో కీలకమైన ఆరోగ్య సేవలు ఏ మేరకు ప్రజలకు అందుతాయోననే అనుమానం సర్వత్రా వ్యక్తమవుతోంది. 108, 104 సేవలను అరవిందో, జీవీకే వంటి ప్రతిష్టాత్మక సంస్థలు గతంలో పకడ్భందీగా నిర్వహించాయి. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ డాక్టర్స్ వింగ్ అధ్యక్షుడు పవన్ కుమార్ కు చెందిన సంస్థకు దాదాపు రూ.300 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను నామినేషన్ పద్దతిలో, ఎటువంటి టెండర్లు లేకుండానే కట్టబెట్టారు. అయిదు కోట్లు కూడా టర్నోవర్ కూడా లేని కంపెనీకి దాదాపు రూ.మూడు వందల కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను ఎలా కట్టబెడతారు? ఇంత కన్నా దారుణం ఏమైనా ఉంటుందా? జీవీకె, అరవిందో వంటి ప్రముఖ సంస్థల సరసన, కనీసం టర్నోవర్, అనుభవం కూడా లేని సంస్థకు 108, 104 సేవల కాంట్రాక్ట్‌లను కట్టబెట్టడం వెనుక ఉన్న అవినీతిని బయటపెట్టాలి. ఈ నిర్ణయంతోనే ప్రజల ఆరోగ్యం మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది, సీరియస్‌సెన్ ఏమిటో అర్థమవుతోంది. ఇప్పటికే ప్రభుత్వ రంగంలో నిర్మించాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు ఉచితంగా అందించాలన్న వైయస్ జగన్ లక్ష్యాన్ని నీరుగారుస్తున్నారు. పేద విద్యార్ధులకు వైద్య విద్యను దూరం చేశారు. తరువాత వారి దృష్టి మిగిలిన ప్రజారోగ్య విభాగాల మీద పడింది. రాష్ట్రంలో కార్పోరేట్ వైద్యాన్ని ప్రోత్సహించడం, ప్రభుత్వ వైద్య రంగాన్ని నీరుగార్చేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది.