అంబేద్కర్ కోనసీమ జిల్లా: కర్నూలు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. కర్నూలు సమీపంలో శుక్రవారం జరిగినప్రైవేట్ బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన రావులపాలెం గ్రామస్తులు కొవ్వూరి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జగ్గిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఇటీవల కర్నూలు వద్ద హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లే ప్రైవేటు బస్సు ప్రమాదం జరిగి 19 మంది చనిపోగా మిగిలిన వారు గాయపడ్డారని తెలిపారు. చనిపోయిన 19 మందిలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామానికి చెందిన కొవ్వూరు శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి కూడా ఉన్నారని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి హైదరాబాదులో క్రేన్ ఆపరేటింగ్ వర్క్ చేస్తూ సొంత పని నిమిత్తం బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరమన్నారు. బస్సు ప్రమాదం ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని ఆయన మండిపడ్డారు. ప్రమాద ఘటనలో చనిపోయిన కుటుంబాలకు కూటమి ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇచ్చి చేతులు దులిపేసుకుంటుందని తప్పుపట్టారు. కనీసం ఒక కుటుంబానికి 25 లక్షలు చొప్పున ఇవ్వాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ మనీశ్ కుమార్ సిన్హా ఆదేశాల మేర 289 ట్రావెల్ బస్సులపై అధికారులు నమోదు చేస్తే అందులో అగ్నిమాపక పరికరాలు లేని బస్సులు 103, రవాణా చట్టాన్ని లెక్కచేయకుండా తిరుగుతున్న బస్సులు 18, అత్యవసర ద్వారం లేని బస్సులు 13, అసలు సరైన పత్రాలు లేని బస్సులు 127 ఉన్నాయని స్వయంగా ఆంధ్రజ్యోతి పత్రికలోనే ప్రచురించారని తెలిపారు. అధికారులు ప్రైవేట్ బస్సులు యాజమాన్యంతో చేతులు కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆక్షేపించారు . రాత్రి ఒంటిగంట వరకు బెల్ట్ షాపులు నడిపి ప్రజల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారని ఆయన విమర్శించారు.