ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేయలేరా? 

అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ ట్రేడ్ యూనియ‌న్ ఆధ్వ‌ర్యంలో క‌లెక్ట‌రేట్ ఎదుట కోటి సంత‌కాల సేక‌ర‌ణ 

అనంతపురం  : మెడిక‌ల్ కాలేజీల నిర్మాణానికి ఏడాదికి రూ.1000 కోట్లు ఖ‌ర్చు చేయ‌లేరా అని అనంత‌పురం జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు అనంత వెంక‌ట్రామిరెడ్డి కూట‌మి ప్ర‌భుత్వాన్ని సూటిగా ప్ర‌శ్నించారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అనంతపురంలోని కలెక్టరేట్‌ ఎదుట వైయ‌స్‌ఆర్‌ ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి ఆధ్వర్యంలో సోమ‌వారం ‘కోటి సంతకాల సేకరణ’ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘కూటమి ప్రభుత్వంపై ఏడాదిన్నరలోనే ప్రజా వ్యతిరేకత తీవ్రంగా వచ్చింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజాప్రతినిధులు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకున్నారు. ఎక్కడ చూసినా భూ ఆక్రమణలు పెరిగిపోయాయి.  కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రభుత్వం అవలంభిస్తోంది.  వైయ‌స్‌ జగన్‌ హయాంలో ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో మెరుగైన వైద్యంతో పాటు వైద్య విద్యను పేదలకు చేరువ చేయాలని ముందుకెళ్లాం. వైయ‌స్‌ జగన్‌ పాలనలో రూ.8 వేల కోట్లతో రాష్ట్రంలో 17 మెడికల్‌ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. రూ.3 వేల కోట్లు ఖర్చు చేశాం. వైయ‌స్ఆర్‌సీపీ హయాంలోనే ఏడు మెడికల్‌ కళాశాలల పూర్తి చేసి ఐదింట్లో తరగతులు ప్రారంభించాం. మిగిలిన కళాశాలలు నిర్మాణంలో ఉన్నాయి. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక 10 మెడికల్‌ కళాశాలలను తన వాళ్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయ‌స్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ చేస్తున్నాం. అక్టోబర్‌ 10వ తేదీ నుంచి ప్రారంభమైన ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాలు భాగస్వాములు అవుతున్నారు.  గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతుగా నిలిచిన వాళ్లు కూడా మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నారు.  చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకుని ప్రభుత్వం ఆధ్వర్యంలో మెడికల్‌ కళాశాలల నిర్మాణాలు చేపట్టాలి. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలకు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయలేమని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి చెప్పడం సిగ్గుచేటు.  ఏడాదికి రూ.1000 కోట్లు ఖర్చు చేసినా 10 మెడికల్‌ కళాశాలలు అందుబాటులోకి వస్తాయి. ఆ మాత్రం ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేయడం లేదు?  ప్రభుత్వ మెడలు వంచేందుకు వామపక్షాలు, ప్రజా సంఘాలు, మేధావులు కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలి’’ అని అనంత వెంక‌ట్రామిరెడ్డి కోరారు.

Back to Top