రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పెండింగ్‌ గ్రాంట్లు ఇవ్వండి

అఖిలపక్ష సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు
 

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పెండింగ్‌ గ్రాంట్లు విడుదల చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు మరోసారి గళమెత్తారు. పార్లమెంట్‌ లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి సహా వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీలు సమావేశంలో ఆంధ్రరాష్ట్ర అభివృద్ధికి సంబంధించి 9 అంశాలను లేవనెత్తారు. రెవెన్యూ లోటు గ్రాంట్‌ కింద రాష్ట్రానికి రావాల్సిన రూ.18,969 కోట్ల బకాయిలు విడుదల చేయాలని, వెనుకబడిన జిల్లాలకు 23 వేల కోట్లు ఇవ్వాలని, పోలవరంకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3,283 కోట్లను కేంద్ర రీయింబర్స్‌మెంట్‌ చేయాలని, పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనా వ్యయం రూ.55,548 కోట్లను ఆమోదించాలన్నారు. రాజధాని నగర అభివృద్ధి కోసం  గ్రాంట్‌గా రూ. 47,424 కోట్లు ఇవ్వాలని, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్‌ ప్లాంట్‌కు ఆర్థికసాయం అందించాలన్నారు. రాష్ట్రానికి పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్ను రాయితీలు కల్పించాలని, అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని, పెండింగ్‌ గ్రాంట్లు విడుదల చేయాలని ఎంపీలు కోరారు.

Back to Top