కనకమేడలపై చర్యలు తీసుకోండి

రాజ్యసభ చైర్మన్‌కు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు

రవీంద్రకుమార్‌ వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించాలి

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాలలో ఉన్న వ్యక్తుల గురించి రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని, అతనిపై తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడుకు వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్‌కు లేఖ రాశారు. ఫిబ్రవరి 4న రాజ్యసభలో కనకమేడల చేసిన ప్రసంగం సభ నియమ నిబంధనలకు ఉల్లంఘన అవుతుందని, ఆయన తన ప్రసంగంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ రికార్డుల నుంచి తొలగించకపోవడం అత్యంత దురదృష్టకరమని తన ఫిర్యాదులో ఎంపీ విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యకలాపాల గురించి, అత్యున్నత స్థానాల్లో ఉన్న వ్యక్తుల గురించి కనకమేడల చేసిన వ్యాఖ్యలు అత్యంత హానికరమైనవి. సభలో చర్చ జరిగే అంశం నుంచి పక్కకు మళ్ళుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసన వ్యవస్థల కార్యకలాపాలపైన, వ్యక్తులపైన కనకమేడల చేసిన అసహ్యమైన వ్యాఖ్యలు రాజ్యసభ రూల్‌ 238 (3), రూల్‌ 238 (5) ఉల్లంఘన అవుతుందని విజయసాయి రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విద్వేషపూరిత రాజకీయాలలో భాగంగానే కనకమేడల ప్రసంగాన్ని పరిశీలించాల్సి ఉంటుందని అన్నారు. ఇటీవల తెలుదేశం పార్టీకి చెందిన ఎంపీలు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి రాష్ట్రంలో మత సంఘర్షణలు జరుగుతున్నాయని ఇందుకు సాక్ష్యంగా 2016–17 మధ్య నాటి ఒక వీడియో క్లిప్‌ను ఆయనకు చూపుతూ కేంద్ర ప్రభుత్వాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశారని అన్నారు. పాస్టర్‌ ప్రవీణ్‌ చక్రవర్తికి చెందిన ఆయన వీడియో క్లిప్‌ వాస్తవానికి 2016–17 మధ్య నాటిది. అప్పటికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్న వాస్తవాన్ని టీడీపీ ఎంపీలు హోం మంత్రి వద్ద దాచిపెట్టారని తెలిపారు.

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా కనకనమేడలపై సత్వరమే తగిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఈ విషయాలను మీ (చైర్మన్‌) దృష్టికి తీసుకువస్తున్నట్లు ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. దీనికి సంబంధించి కనకమేడల తన ప్రసంగంలో చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలు ఏ రూల్‌ ప్రకారం సభా నియమాలకు విరుద్దమో వివరిస్తూ ఒక జాబితాను లేఖకు జత చేస్తున్నట్లు తెలిపారు. వీటిని పరిశీలించి ఆ సభ్యుడిపై తగిన చర్యలు తీసుకోవాలని లేఖలో విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. 

 

Back to Top