న్యూఢిల్లీ: కేంద్రం నుంచి ఆంధ్రరాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకోవడమే పనిగా పెట్టుకొని తెలుగుదేశం పార్టీ దుష్టరాజకీయాలు చేస్తోందని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి నిర్మాణాత్మక సలహాలు ఇవ్వకపోవడమే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలకు టీడీపీ అడ్డుపుల్లలు వేయడం, అందుకు రఘురామకృష్ణరాజును పావుగా వాడుకోవడం హేయమైన రాజకీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హట్కో రుణాల రాష్ట్రానికి మంజూరు కాకుండా రఘురామకృష్ణరాజుతో టీడీపీ నేతలు పిటీషన్ వేయించారని, నరేగ గ్రాంట్స్‌ను కూడా ఏదో విధంగా నిలిపివేయాలని, ఆంధ్రప్రదేశ్‌లో పేద ప్రజల ఇళ్లకు ఆ నిధులు వినియోగించకుండా కేంద్రం నుంచి స్టే ఇప్పించడంలో రఘురామరాజు ప్రధాన పాత్ర పోషించారని మండిపడ్డారు. ఇటువంటి నీచ రాజకీయాలు, దుష్ట రాజకీయాలు తెలుగుదేశం పార్టీ చేస్తోందని ధ్వజమెత్తారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల రాష్ట్ర అభివృద్ధితో పాటు పేదలకు ఇబ్బందికలిగించే పరిస్థితులు సృష్టించడం ఒక రాజకీయ పార్టీగా తెలుగుదేశం పార్టీ నిర్ణయాలు, కార్యక్రమాలు సహేతుకమైనవి కావన్నారు. రాజులకు పోరాటమే ఊపిరిగా ఉంటుంది. కానీ, రఘురామరాజులో ఆ పటిమ కనిపించడం లేదని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. కేవలం మాటల తూటాలే కనిపిస్తున్నాయన్నారు. 5వ తేదీ, 8వ తేదీ రాజీనామా చేస్తానని ప్రకటించడం.. పారిపోవడం.. రాజులకు ఉండాల్సిన లక్షణాలు కావని, రఘురామరాజు రాజీనామా చేసి సత్తా ఏంటో తేల్చుకోవాలి తప్ప న్యూసెన్స్ చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ మద్దతుతో రాష్ట్రానికి రావాల్సిన నిధులు అడ్డుకోవడం దుర్మార్గమని ఎంపీ సుభాస్ చంద్రబోస్ మండిపడ్డారు.