అది బాబు బినామీల పాదయాత్ర

టీడీపీ కనుసన్నల్లో, చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తోంది

రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం కోసం జరుగుతున్న డ్రామా

రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసింది చంద్రబాబే

బాబు దిగిపోయేనాటికి రాష్ట్ర అప్పు రూ.3.60 లక్షల కోట్ల పైనే

వికేంద్రీకరణతోనే రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి

హైదరాబాద్‌ను కోల్పోయినప్పటి ఇబ్బంది.. మళ్లీ ఎదురవ్వకూడదు

వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ

ఢిల్లీ: అమరావతి పరిరక్షణ సమితి, న్యాయస్థానం టు దేవస్థానం అని రకరకాల పేర్లతో కొందరు పాదయాత్ర చేస్తున్నారని, అది పూర్తిగా చంద్రబాబు బినామీలు, టీడీపీ కార్యకర్తల పాదయాత్రేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు. తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో, చంద్రబాబు డైరెక్షన్‌లో ఆ పాదయాత్ర జరుగుతుందన్నారు. ఢిల్లీలోని ఏపీభవన్‌లో ఎంపీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, బెల్లాన చంద్రశేఖర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎంపీ మోపిదేవి వెంకటరమణ మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను అస్తవ్యస్థం చేసి.. అప్పుల ఊబిలోకి నెట్టిన చరిత్ర చంద్రబాబుదని, చంద్రబాబు అధికారం చేపట్టే నాటికి రూ. 96 వేల కోట్లుగా ఉన్న అప్పు.. బాబును ప్రజలు ఇంటికి పంపించే నాటికి సుమారు రూ.3.60 లక్షల కోట్లకు చేర్చాడని, రాష్ట్ర ఖజానా మీద అప్పుల భారం మోపాడన్నారు. అలాంటి పరిస్థితుల్లోనూ సీఎం వైయస్‌ జగన్‌ మొక్కవోని ధైర్యంతో ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని అమలు చేస్తున్నారన్నారు. కోవిడ్‌ లాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎక్కడా ఏ ఇబ్బంది కలగకుండా.. అటు ప్రజారోగ్యాన్ని పరిరక్షిస్తూనే.. ఇటు సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేశారన్నారు.  

ఆంధ్రరాష్ట్రంలో జరిగేది రాజధానితో ముడిపడి ఉన్న పాదయాత్ర కాదు. పూర్తిగా స్వార్థపూరితమైన తెలుగుదేశం కనుసన్నల్లో, చంద్రబాబు డైరెక్షన్‌లో నడుస్తున్న పాదయాత్ర అని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. గతంలో అభివృద్ధి అంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు ప్రతిపైసా హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టి ఆ నగరాన్ని అభివృద్ధి చేశారని, రాష్ట్రం విడిపోయి బయటకు వచ్చిన తరువాత అనేక ఇబ్బందులు చూశామన్నారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి అనేది ఒక్కచోటే కేంద్రీకృతం కాకూడదు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని సీఎం వైయస్‌ జగన్‌ బలంగా నమ్మారని, ప్రజలు కూడా సీఎంకు మద్దతుగా నిలిచారని చెప్పారు.
 

Back to Top