న్యూఢిల్లీ: అబద్ధాలు చెప్పడంలో తండ్రిని మించిన తనయుడిగా లోకేష్ తయారయ్యాడని, యువగళం పేరుతో పెయిడ్ ఆర్టిస్టులతో కలిసి యాత్రలు, కుల సంఘాల మీటింగ్‌లు పెట్టి వాస్తవాలను వక్రీకరిస్తూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నాడని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణ మండిపడ్డారు. చిరంజీవి అమర్‌నాథ్ కుటుంబాన్ని ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకుందని, ముద్దాయిలను 24 గంటల్లోనే పోలీసులు కోర్టులో హాజరుపరిచారని చెప్పారు. వాస్తవాలను వక్రీకరిస్తూ బాధిత కుటుంబానికి ట్రైనింగ్ ఇప్పించి ఏమీ అందలేదని చెప్పించే ప్రయత్నం లోకేష్ చేశాడని ధ్వజమెత్తారు. నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందనే ముని శాపం చంద్రబాబుతో పాటు లోకేష్‌కు కూడా అంటినట్టుందని ఎద్దేవా చేశారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో బీసీల అభ్యున్నతికి చంద్రబాబు చేసిన నిర్ణయాలు.. ప్రస్తుత నాలుగు సంవత్సరాల సీఎం వైయస్ జగన్ పాలనలో బీసీల ఆర్థిక, రాజకీయ, సామాజిక అభ్యున్నతికి చేస్తున్న కార్యక్రమాలపై చర్చకు వచ్చే దమ్ముందా..? అని సవాల్ విసిరారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోపిదేవి వెంకట రమణ మాట్లాడారు. ‘ఒంగోలులో బీసీ సమ్మేళనం పేరుతో సమావేశం ఏర్పాటు చేసి రేపల్లె నియోజకవర్గంలో జరిగిన సంఘటనను ప్రస్తావించారు. మే 16వ తేదీన ఉప్పాలవారిపాలెం గ్రామంలో చిరంజీవి అమర్‌నాథ్ దారుణ హత్యకు గురయ్యాడు. దానికి ప్రత్యేకించి రాజకీయపరమైన కారణాలు లేవు. అమర్‌నాథ్ మృతికి కారకులైన నలుగురిని కస్టడీలోకి తీసుకున్నారు. సంఘటన ఉదయం 5.30 గంటలకు జరిగితే 11 గంటలకల్లా ముగ్గురు ముద్దాయిలను కస్టడీలోకి తీసుకున్నారు. 17వ తేదీన కోర్టులో హాజరుపరిచారు. 20వ తేదీన నాల్గవ ముద్దాయిని కస్టడీలోకి తీసుకున్నారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే ముగ్గురు ముద్దాయిలను కోర్టులో హాజరుపరిచారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రభుత్వం నుంచి రూ.10 లక్షల ఆర్థిక సాయం 24 గంటల్లో బాధిత కుటుంబానికి అందించాం. అంగన్‌వాడీ ఆయా పోస్టు ఖాళీగా ఉంటే 24 గంటల్లోనే అపాయింట్మెంట్‌ఆర్డర్ వారికి ఇచ్చాం. ఇంటి స్థలం ఇచ్చి, నిర్మాణానికి క్లియరెన్స్ ఇచ్చాం. ప్రభుత్వ పరంగా కనీసం 2వ రోజుకు కూడా ఛాన్స్ లేకుండా వారు కోరిన డిమాండ్స్‌ను నెరవేర్చాం. చనిపోయిన పిల్లాడిని తిరిగి తీసుకురాలేం.. కానీ, మనవతా దృక్పథంతో స్పందించి అన్ని విధాలుగా ఆ కుటుంబాన్ని ఆదుకున్నాం. వాస్తవాలు ఈరకంగా ఉంటే.. టీడీపీ బీసీ సమ్మేళనానికి మృతుడు అమర్‌నాథ్ తల్లి, చెల్లితో పోలీసులు స్పందించలేదు, ముద్దాయిలను అరెస్టు చేయలేదు, ఏ విధమైన సహకారం అందలేదని పచ్చి అబద్ధాలు మాట్లాడించారు. అమర్‌నాథ్ సోదరికి ట్రైనింగ్ ఇప్పించి ఆ చిన్నారితో పచ్చి అబద్ధాలు చెప్పించారు. వాస్తవాలు రేపల్లె నియోజకవర్గం, ఆ ప్రాంత ప్రజానీకానికి తెలుసు. వాస్తవాలు మాట్లాడితే తలలు వెయ్యి ముక్కలు అవుతాయని చంద్రబాబు కుటుంబానికి ముని శాపం ఉంది. అది చంద్రబాబుకే పరిమితం అయ్యిందనుకుంటే బాబుకు మించి అబద్ధాలు చెప్పడంలో లోకేష్ తయారయ్యాడు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగార్జున యూనివర్సిటీలో ఓ విద్యార్థిని అతిదారుణంగా చనిపోతే కనీసం తల్లిదండ్రులను కలుసుకునేందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేని దుస్థితి చంద్రబాబుది. అధికారులపై చేయి చేసుకున్న వ్యక్తులను శిక్షించకుండా రాజీ కుదిర్చిన నీచులు మీరు. బీసీలను ఉద్దరిస్తున్నామని ఇష్టానుసారంగా లోకేష్ మాట్లాడాడు. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలేంటీ..? వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత బీసీ సామాజిక వర్గాలను ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా గౌరవ ప్రదమైన జీవితాన్ని కొనసాగించేందుకు తీసుకున్న నిర్ణయాలను ఆధారాలతో సహా వివరిస్తున్నాం. రాజకీయంగా.. శాశ్వతంగా ఒక బీసీ కమిషన్ ఏర్పాటు, శాసనసభ స్పీకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, కేబినెట్‌లో 45 శాతం మంది బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు ఉన్నారు. రాజ్యసభలో ఏనాడైనా టీడీపీ కోసం పనిచేసిన నాయకుడు, కార్యకర్తకు రాజ్యసభలో అడుగుపెట్టే అవకాశం చంద్రబాబు ఏనాడూ కల్పించలేదు. రాజ్యసభ సీట్ల కోసం బేరాలు పెట్టడం చంద్రబాబు నైజం. కానీ, సీఎం వైయస్ జగన్ పార్టీ కోసం పనిచేసిన బీసీ సామాజిక వర్గాలకు చెందిన నలుగురు వ్యక్తులకు రాజ్యసభలో ప్రవేశించే అవకాశం కల్పించారు. లోక్‌సభలో వైయస్‌ఆర్ సీపీ ఎంపీల్లో ఆరుగురు బీసీ సామాజికవర్గానికి చెందిన వారు ఉన్నారు. శాసనసభ్యులు 31 మంది, 12 మంది ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్లు, స్థానిక సంస్థల ఎన్నికల్లో మున్సిపల్ కార్పొరేషన్‌లో 98, జెడ్పీ చైర్మన్లు 9 మంది ఉన్నారు. జెడ్పీటీసీలు 215 మంది, మేయర్లు 9 మంది బీసీలు ఉన్నారు. ఉద్యోగ నియామకాల్లో కూడా సచివాలయం ద్వారా సుమారు 1.50 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు కల్పిస్తే.. వారిలో 60 శాతం మంది బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి ఉద్యోగాలు లభించాయి. ఏనాడైనా ఈ విధమైన నిర్ణయాలు చంద్రబాబు పాలనలో జరిగాయా..? ఆర్థిక స్థితిగతులు.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో డైరెక్ట్, ఇన్‌డైరెక్ట్ రూ.1,63,334 కోట్లు వివిధ పథకాల ద్వారా బీసీ సామాజిక వర్గాలకు ఆర్థిక ప్రయోజనం చేకూరింది. అందులో 30 శాతం అయినా చంద్రబాబు ఇచ్చిన దాఖలాలు లేవు. కానీ, నాలుగు సంవత్సరాల్లోనే సీఎం వైయస్ జగన్ బీసీ వర్గాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూర్చారు. బడ్జెట్‌లో.. చంద్రబాబు బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఐదు సంవత్సరాల్లో కేటాయించింది చేసింది రూ.16 వేల కోట్లు. సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన నాలుగు సంవత్సరాల్లోనే రూ.82 వేల కోట్లను బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి బడ్జెట్‌లో కేటాయించారు. బీసీ సామాజిక వర్గాల అభ్యున్నతికి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా చంద్రబాబు ఐదేళ్ల కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు.. సీఎం వైయస్ జగన్ పాలనలో బీసీల అభ్యున్నతికి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో ఇంతకు మించిన నిదర్శనాలు లేవు, ఇది కాదు అని చెప్పే దమ్మూ, ధైర్యం చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు ఉందా..? మీరు ఎన్ని పాదయాత్రలు, విహార యాత్రలు చేసినా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. సీఎం వైయస్ జగన్ పరిపాలనపై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉంది. రాష్ట్రంలో అమలువుతున్న సంక్షేమ పథకాలు, పాలనా సంస్కరణలపై ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు. మళ్లీ వైయస్ జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు’ అని ఎంపీ మోపిదేవి చెప్పారు.