రాజధాని పేరుతో మోసం చేసింది చంద్రబాబే..

 అమరావతి రైతులది త్యాగమయితే.. పోలవరం నిర్వాసితులదేంటి?

వెంకయ్యనాయుడుకు ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబాటు కనిపించలేదా?

అనంత రైతుల ఆక్రందన వినిపించలేదా?

ఉపరాష్ట్రపతిగా మాట్లాడండి గౌరవిస్తాం

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి

అమరావతి: రాజధాని పేరుతో అమరావతి రైతులను మోసం చేసింది చంద్రబాబు నాయుడేనని రాప్తాడు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి విమర్శించారు. అమరావతి రైతుల కష్టం ఆవేదన కలిగిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అనడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గురువారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. అమరావతి ప్రజలది త్యాగం అయితే.. రాష్ట్రం కోసం 1.5 లక్షల ఎకరాలు ఇచ్చిన రైతులది ఏంటని ప్రశ్నించారు. 
మభ్యపెట్టి..
ఇక్కడ రాజధాని వస్తే.. రూ.10 లక్షల విలువ చేసే భూములు రూ.10 కోట్లు చేస్తాయని మభ్యపెట్టి తీసుకున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి విమర్శించారు. రాజధాని కోసం ప్రజలు ఇచ్చింది చాలా తక్కువ భూమి అని ఆయన వివరించారు. అమరావతికి భూములు ఇవ్వమని 5వేల ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు ఎక్కారరి చెప్పారు. కేంద్రం నిధులు ఇస్తుంది..బహుళజాతి కంపెనీలు వస్తాయి.. సింగపూర్‌ కంపెనీలు పెట్టుబడులు పెడతాయని అమరావతి రైతులకు అరచేతిలో స్వర్గం చూపించారని దుయ్యబట్టారు. 
ఖర్చు చేసింది రూ.5వేల కోట్లే..
ల్యాండ్‌ పూలింగ్‌ చేసి..రైతులను నిండా ముంచి 33 వేల ఎకరాలను సేకరించి.. అమరావతి కోసం ఖర్చుచేసింది కేవలం రూ.5వేల కోట్లేనని ఆయన గుర్తు చేశారు. దీంట్లో కేంద్రం ఇచ్చింది.. రూ.1500 కోట్లు, రాష్ట్రం ఖర్చుచేసింది రూ.227 కోట్లు. మిగతావన్నీ అప్పులేనని ప్రకాశ్‌ రెడ్డి విమర్శించారు. లక్షకోట్లు అవసరమైన చోట కేంద్రం రూ.1500కోట్లు ఇచ్చినప్పుడు ఏమైంది మీ భావోద్వేగం, చిత్తశుద్ధి అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆయన విమర్శించారు. అమరావతికి బీజేపీ ప్రభుత్వం ఒక ముంత నీళ్లు, మట్టి ఇచ్చి రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగిందని మాట్లాడటం సబబు కాదని అన్నారు.
బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఏదీ..
వెనకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు బుందేల్‌ఖండ్‌ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పింది బీజేపీ ప్రభుత్వం కాదా అని ప్రకాశ్‌ రెడ్డి ప్రశ్నించారు. పోలవరం నిర్వాసితులకు ఇప్పటికీ రూ.30 వేల కోట్లు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నద ఎవరని ఆయన నిలదీశారు. ఈ నిధులను ఇప్పించేందుకు ఎందుకు చొరవ తీసుకోలేదని ప్రకాశ్‌ రెడ్డి ప్రశ్నించారు. 
ఆకలి కేకల నుంచి..
ఆకలి కేకలనుంచి పుట్టిందే నక్సల్బరీ ఉద్యమమని ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఇలాంటి ఉద్యమాలు మళ్లీ రాకూడదంటే అభివద్ధి అన్ని ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ఫ్లోరైడ్‌ నీరు తాగి ఇబ్బందులు పడుతున్న ఒంగోలు ప్రజల కష్టాలు కనిపించలేదా? వర్షాల్లేక కేరళలో భిక్షాటన చేస్తున్న అనంత రైతుల వ్యథ మీకు వినిపించలేదా? ఉద్దానం కిడ్నీ బాధితుల ఆక్రందనలు ఎందుకు మీకు పట్టలేదు అని వెంకయ్యనాయుడుపై ప్రశ్నల వర్షం కురింపించారు. అరకు, పాడేరులు మీకు టూరిజం స్పాట్లుగా కనిపిస్తే.. మాకు వాటి వెనకబాటు కనిపిస్తోందని ప్రకాశ్‌ రెడ్డి చెప్పారు. అన్ని ప్రాంతాల అభివద్ధే వైఎస్సార్‌సీపీ లక్ష్యమమన్నారు. అమరావతిని కూడా తప్పకుండా అభివద్ధి చేస్తామని తెలిపారు. 
పెద్దమనిషిగా మాట్లాడండి..
ఉపరాష్ట్రపతిగా పెద్దమనిషిగా మాట్లాడాలని ప్రకాశ్‌ రెడ్డి అన్నారు. ఒక ప్రాంతం మనిషిగా కాకుండా..రాష్ట్రం కోసం ఆలోచించాలని సూచించారు. వీలైతే కడప స్టీల్‌ప్లాంటు, రాష్ట్ర అభివద్ధి కోసం నిధులు వచ్చేలా చూడాలని వెంకయ్యనాయుడును ఆయనకోరారు. తెలుగుదేశం ప్రభుత్వానికి చేతకాలేదు కాబట్టే మాకు అధికారం ఇచ్చారు... రాజధాని ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టారని గుర్తు చేశారు. రాజకీయాలు మాట్లాడాలనుకుంటే.. రాజీనామా చేసి రండి మాట్లాడుకుందామని సూచించారు. 
త్వరలో ఆమోదయోగ్య నిర్ణయం..
త్వరలో రాజధాని ప్రజలందరూ మెచ్చేలా ఆమోదయోగ్య నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకుంటారని తోపుదుర్తి వివరించారు. అన్ని ప్రాంతాల అభివద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించారు. టీడీ ప్రభుత్వంలా మేం మోసం చేసేందుకు సిద్ధంగా లేమని ఆయనఅన్నారు. అన్ని ప్రాంతాల్లో అభివద్ధిని కొనసాగిస్తామని చెప్పారు.  

 

Back to Top