పవన్‌ కార్పొరేటర్‌కి ఎక్కువ.. ఎమ్మెల్యేకి తక్కువ

ప్రభుత్వంపై పవన్‌ మాటలు చేతగానితనానికి పరాకాష్ట

2008 నుంచి ఒక్కచోట అయినా గెలిచిన దాఖలాలు ఉన్నాయా..?

చంద్రబాబు, పవన్‌.. దొంగనాటకాలు ఇక ఆపేయండి

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు

తాడేపల్లి: రెండు చోట్ల ఓడిపోయాననే సిగ్గులేకుండా.. ఎందుకు ఓడిపోయాననే విశ్లేషణ చేసుకోకుండా నూతన ప్రభుత్వంపై మాటలదాడిని పవన్‌కల్యాణ్‌ చేతగానితనం, సినిమా వేషాలకు పరాకాష్టగా భావిస్తున్నామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు అన్నారు. పవన్‌ కల్యాణ్‌ కార్పొరేటర్‌కు ఎక్కవ.. ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. ఈ రోజు వరకు చట్టసభల్లోకి ప్రవేశించింది లేదు కానీ మాటలు కోటలు దాటుతున్నాయని దుయ్యబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పత్రికల్లో వచ్చే కట్టుకథలను ఆధారంగా చేసుకొని పవన్‌ చేసే విన్యాసాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో టీజేఆర్‌ సుధాకర్‌బాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇసుక కొరతకు కారణాలను విశ్లేషించుకోవడంలో పవన్, చంద్రబాబు విఫలమయ్యారన్నారు. 

గత ప్రభుత్వం ఇసుకను విచ్చలవిడిగా దోపిడీ చేసింది. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ధనాన్ని ఇసుక రూపంలో దోపిడీ దొంగల్లా టీడీపీ నేతలు, స్వయాన చంద్రబాబు కొడుకు దోచేసుకున్నారన్నారు. అలాంటి పరిస్థితిని రూపుమాపి పేదలకు కూడా ఇసుకను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ నూతన పాలసీ తీసుకువచ్చారన్నారు. అది అమలు చేస్తున్న క్రమంలో వరదలు వచ్చాయి. ఎక్కడా ఇసుక తీయడానికి అవకాశం లేకపోవడంతో ఇసుక కొరత కొంత ఏర్పడిందన్నారు. ఇసుకపై చంద్రబాబు, పవన్‌ వైఖరి, రాజకీయ విన్యాసాలు చాలా అవమానకరంగా ఉన్నాయన్నారు. 

2008లో చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువజన విభాగం అధ్యక్షుడిగా పవన్‌ కల్యాణ్‌ రాజకీయ ప్రయాణం మొదలైందని, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక్కచోట ఎన్నికల్లో దాఖలాలు లేవన్నారు. నిజంగా చట్టాలు తెలిసి ఉంటే పవన్‌ ఇలా మాట్లాడి ఉండేవారు కాదన్నారు. పచ్చపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పవన్‌ మాట్లాడడం సిగ్గుచేటని, పవన్‌ మాటలు విని ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. స్థాయి తెలుసుకొని పవన్‌ మాట్లాడితే మంచిదన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ సినిమా ప్రయాణం చిరంజీవి తమ్ముడిగా మొదలైందని, రాజకీయాల్లోకి చిరంజీవి తమ్ముడిగానే వచ్చాడని ఎమ్మెల్యే సుధాకర్‌బాబు అన్నారు. కానీ ఇప్పుడు అన్నయ్య చిరంజీవితో సంబంధం లేకుండా.. చంద్రబాబు తొత్తులు, కార్పొరేట్‌ సెక్టార్‌ తొత్తులతో జతకట్టాడన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన పవన్‌ కల్యాణ్‌ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల టికెట్ల కేటాయింపు సొంతంగా తీసుకున్న నిర్ణయమా.. లేక చంద్రబాబు నిర్ణయించారా.. సూటిగా అడుగుతున్నాం సమాధానం చెప్పండి అంటూ నిలదీశారు. పవన్‌ నటన ఇప్పటికైనా ఆపేయాలని, బాబు డైరెక్షన్‌లో నటన చూసి రోడ్డు మీద వెళ్లే వారు కూడా నవ్వుకుంటున్నారన్నారు. 

అసలు పుత్రుడు లోకేష్‌ పనికి రాడని చంద్రబాబు పవన్‌ కల్యాణ్‌ను దత్తపుత్రుడిగా తెచ్చుకున్నారన్నారు. పవన్‌కు ఉన్న సినిమా క్రేజ్‌ను అడ్డును పెట్టుకొని ప్రజల్లోకి వెళ్తున్నాడన్నారు. చిన్నపిల్లలను పోగుచేసి ఉపన్యాసాలకు కేరింతలు కొడుతున్నట్లుగా విజువల్స్‌ చూపించి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైనట్లు చంద్రబాబు, పవన్‌ సమూహం చేసే దొంగనాటకాలను ఇక్కడితో ఆపేయాలని సూచించారు. 
 

Read Also: జనరంజక పాలనకు పాదయాత్రే ప్రధాన కారణం

Back to Top