విజయనగరం :పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన వైయస్ఆర్‌సీపీ దళిత కార్యకర్త మండా సాల్మన్‌ను టీడీపీ నాయకులు అతి కిరాతకంగా హత్య చేయడాన్ని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని విజయనగరం జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) స్పష్టం చేశారు. ఈ హత్యకు నిరసనగా శనివారం విజయనగరం జిల్లా కేంద్రంలోని డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు పీరుబండ జైహింద్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను పాల్గొని మాట్లాడారు. శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయి ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, చట్టబద్ధ పాలన నిర్వీర్యమైందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం, రెడ్ బుక్ పాలన పేరుతో దళితులను, వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని హింసకు పాల్పడుతోందని మండిపడ్డారు. అధికార పార్టీ గూండాల అరాచకానికి నిదర్శనం దళిత వైయస్ఆర్‌సీపీ కార్యకర్త సాల్మన్ హత్య టీడీపీ అధికార పార్టీ గూండాల అరాచకానికి ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులు నిత్యకృత్యంగా మారాయని, పోలీసు వ్యవస్థ కూడా అధికార పార్టీ నేతలతో కుమ్మక్కై పనిచేస్తోందని ఆరోపించారు. హత్య జరిగి 24 గంటలు దాటినా ఒక్క నిందితుడిని కూడా అరెస్ట్ చేయకపోవడం, ఈ ప్రభుత్వ ఉద్దేశాలను స్పష్టంగా బయటపెడుతోందని విమర్శించారు. కావాలనే ఈ కూటమి ప్రభుత్వం హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తోందని దుయ్యబట్టారు. బాధిత కుటుంబానికి కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి హత్యకు గురైన సాల్మన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం తక్షణమే కోటి రూపాయల పరిహారం అందించి ఆదుకోవాలని చిన్న శ్రీను డిమాండ్ చేశారు. ఈ కష్టకాలంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక పోలీసులు అధికార పార్టీ నేతలకు వంతపాడుతూ, హత్యకు గురైన బాధితులపైనే 305 సెక్షన్ కింద తప్పుడు కేసులు నమోదు చేయడం అత్యంత అమానుషమైన చర్య అని తీవ్రంగా ఖండించారు. ఇది దళితులపై, ప్రతిపక్షాలపై జరుగుతున్న కక్ష సాధింపు చర్యలకు నిదర్శనమని అన్నారు. వైయస్ఆర్‌సీపీ అధికారంలోకి రాగానే కఠిన చర్యలు భవిష్యత్తులో వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి రాగానే, ఈ హత్యకు బాధ్యులైన ప్రతి ఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుని తగిన శిక్ష పడేలా వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకుంటారని చిన్న శ్రీను స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వైయస్ఆర్‌సీపీ క్యాడర్ ఎవరూ భయాందోళనకు గురికావద్దని, పార్టీ నాయకత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. దళితులపై, ప్రతిపక్షాలపై జరుగుతున్న దాడులను ఇక సహించబోమని హెచ్చరించారు.