గుంటూరు : చరిత్ర కలిగిన అంజుమన్–ఏ–ఇస్లామియా సంస్థకు చెందిన చినకాకానిలోని 71.57 ఎకరాల భూమిని ప్రైవేటీకరణకు లీజుకు ఇస్తామని బహిరంగంగా ప్రకటించడం సిగ్గుచేటని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, పరిశీలకులు షేక్ గులాం రసూల్ తీవ్రంగా మండిపడ్డారు. అంజుమన్ సంస్థ అధ్యక్షుడిగా, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా, రాష్ట్ర వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌గా ఉన్న నసీర్ అహమ్మద్ ఈ వ్యాఖ్యలు చేయడం ముస్లిం సమాజానికి చేసిన ఘోర ద్రోహమని విమర్శించారు. గుంటూరు నగరంలోని ఇక్బాల్ మసీదు వద్ద జిల్లా మజిలిస్ ఉల్ ఉలెమా, జమియతుల్ ఉలెమాల ఆధ్వర్యంలో ముస్లిం సంఘాలు, మత పెద్దలు, వివిధ రాజకీయ పార్టీల నాయకులతో కలిసి అంజుమన్ భూముల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షేక్ గులాం రసూల్, “అంజుమన్ సంస్థ భూమిని కాపాడాల్సిన బాధ్యత ఎమ్మెల్యే నసీర్‌దే. కానీ ఆయన ఈ భూమిని లీజుకు ఇస్తామని, దీనిపై ఎవరితో అయినా పోరాడతానని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి వెళ్లిపోవడం వెనుక అంతర్యామేమిటి?” అని ప్రశ్నించారు. ముస్లింలు ఏకమై ఓట్లు వేసి గెలిపిస్తే, ఎమ్మెల్యే నసీర్ ముస్లింలకు ఇచ్చిన బహుమతి ఇదేనా అని నిలదీశారు. ఇప్పటివరకు మూడుసార్లు ముస్లిం మత పెద్దలు సమావేశాలు నిర్వహించినప్పటికీ, “అంజుమన్ భూమిలో అంగుళం కూడా పోనివ్వను” అని చెప్పకుండా, లీజు ఇస్తే ముస్లిం సమాజానికి మేలు జరుగుతుందంటూ మాట్లాడడం దుర్మార్గమైన వైఖరని తీవ్రంగా విమర్శించారు. గత రెండు సంవత్సరాలలో అంజుమన్ సంస్థ ద్వారా ఎంతమంది ముస్లింలకు మేలు చేశారో ఎమ్మెల్యే నసీర్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అంజుమన్ భూములను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కుట్రలో ఎమ్మెల్యే నసీర్‌కు ఎంత వాటా ఉంది..? చంద్రబాబు ప్రభుత్వానికి ఎంత వాటా ఉంది..? ప్రభుత్వ పెద్దల వాటా ఎంత..? అన్నది గుంటూరు నగర ముస్లిం ప్రజలకు స్పష్టంగా చెప్పాలని షేక్ గులాం రసూల్ డిమాండ్ చేశారు. అంజుమన్ భూమిని తీసుకునే దమ్ము, ధైర్యం నీకైనా, నీ ప్రభుత్వానికైనా లేదని ఎమ్మెల్యే నసీర్‌ను హెచ్చరించారు. అంజుమన్ భూమిలో గుప్పెడు మట్టిని కూడా తీసుకువెళ్లలేరని స్పష్టం చేస్తూ, ముస్లిం సమాజం ఎమ్మెల్యే చేస్తున్న కుయుక్తులను నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ఈ భూముల ప్రైవేటీకరణను వెంటనే విరమించుకోకపోతే, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్‌రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు అంబటి రాంబాబు, తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జి నూరి ఫాతిమాలతో పాటు ముస్లిం సంఘాలన్నిటిని కలుపుకుని పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని షేక్ గులాం రసూల్ స్పష్టం చేశారు.