ఢిల్లీ: నగరి నియోజకవర్గంలో ఉన్న సుమారు 600 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం జాతీయ రహదారి పనుల వల్ల ప్రమాదంలో పడిందని మాజీ మంత్రి ఆర్‌కే రోజా ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం ఆమెతో పాటు ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, మద్దిల గురుమూర్తి, గుమ్మ తనుజా రాణిలు కలిసి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీను కలసి దేవాలయాన్ని కాపాడాలని వినతిపత్రం సమర్పించారు. నగరి పరిధిలో జాతీయ రహదారి కొండ చుట్టూ వెళ్లేలా రూపకల్పన చేయడంతో ఈ చారిత్రక ఆలయాన్ని తొలగించే పరిస్థితి ఏర్పడిందని వారు వివరించారు. ప్రతి ఏడాది 21 దేవతామూర్తులతో గ్రామస్థులు భారీగా నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల దృష్ట్యా ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన నితిన్ గడ్కరీ, రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన భూమి సేకరణకు నిధులు కేటాయిస్తే రహదారి మార్గాన్ని మళ్లించి దేవాలయాన్ని రక్షించే అవకాశముందని హామీ ఇచ్చారు. ఈ అంశంపై రోజా స్పందిస్తూ, ఇది స్థానిక ఎమ్మెల్యే బాధ్యత అని, కానీ ఆయన నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే భాను ప్రకాష్, సంబంధిత ఎంపీలు బాధ్యతగా వ్యవహరించలేదని ఆరోపించారు. దేవాలయం రక్షణ కోసం ఇప్పటికే కోర్టులో స్టే తీసుకువచ్చినట్లు తెలిపారు. అవసరమైతే న్యాయపోరాటం కొనసాగిస్తామని, ప్రజల తరఫున చివరివరకు పోరాటం చేస్తామని రోజా స్పష్టం చేశారు.