ఎన్టీఆర్ జిల్లా: మైలవరం నియోజకవర్గం కేతనకొండ గ్రామంలో జనసేన నాయకుల రెచ్చగొట్టే చర్యలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ గారి జన్మదినం, సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని జనసేన నాయకులు పోలీసుల సమక్షంలోనే చించి వేయడం తీవ్ర వివాదానికి కారణమైంది.ఇటీవలే కేతనకొండ గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళితులపై దాడి జరిగిన నేపథ్యంలో, మళ్లీ గ్రామంలో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా రెచ్చగొట్టే చర్యలకు జనసేన నాయకులు పాల్పడుతున్నారని వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా, పోలీస్ పికెట్ ఏర్పాటు చేసినప్పటికీ, దళితులు చట్టబద్ధంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని పోలీసుల సమక్షంలోనే చించివేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఫ్లెక్సీ చించడాన్ని అడ్డుకున్న దళిత యువకులను దుర్భాషలాడుతూ, “మీ పల్లె ఎక్కడ? ఈ సెంటర్ మాది… ఇక్కడ ఫ్లెక్సీలు కట్టే అధికారం మీకు లేదు” అంటూ కులం పేరుతో అవమానకరంగా దూషించినట్లు ఆరోపించారు. 144 సెక్షన్, పోలీస్ పికెట్ ఉన్నా కూడా వాటిని ఉల్లంఘిస్తూ ఫ్లెక్సీలు చించడాలు, దాడులు, కులం పేరుతో దూషణలు జరగడం కూటమి పాలనలోని నిరంకుశత్వానికి నిదర్శనమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శించారు. ఈ ఘటనపై వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, దళితులపై జరుగుతున్న దాడులను, అణచివేతను వైయస్ఆర్‌సీపీ ఖండించింది. కూటమి నాయకుల నిరంకుశ పాలనకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని పార్టీ నేతలు హెచ్చరించారు.