పేదల ప్రాణాలకు విలువ లేదా?

యాతం శ్రీనివాస్ మృతి ఘటనకు 40 రోజులు… ఇంకా న్యాయం లేదు

అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు చిర్ల జ‌గ్గిరెడ్డి

  రాజమండ్రి:  కూట‌మి ప్ర‌భుత్వంలో పేద‌ల ప్రాణాల‌కు విలువ లేదా అని అంబేద్క‌ర్ కోన‌సీమ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు చిర్ల జ‌గ్గిరెడ్డి ప్ర‌శ్నించారు.  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ఆత్రేయపురం గ్రామానికి చెందిన యాతం శ్రీనివాస్ మృతి ఘటనకు 40 రోజులు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి 28న రాజమండ్రి ఆసుపత్రిలో మత్తుమందు వికటించడం వల్ల శ్రీనివాస్ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఘటన జరిగిన వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పాటు కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో కూడా వినతిపత్రాలు అందజేసినా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి, జిల్లా పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి ఈస్ట్ గోదావరి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాజమండ్రి ఎస్పీ కార్యాలయంలో సెంట్రల్ డిఎస్పీకి కూడా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిర్ల జగ్గిరెడ్డి మాట్లాడుతూ, ఘటనకు 40 రోజులు అయినప్పటికీ నిందితులపై చర్యలు లేకపోవడం బాధాకరమన్నారు. పేదల ప్రాణాలకు విలువ లేదన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

Back to Top