అనంతపురం: కళంకితుడైన బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో వైయస్ఆర్‌సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో తీవ్ర నిరసన చేపట్టారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీదేవి నేతృత్వంలో నిర్వహించిన ఈ ఆందోళనలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నిరసనకు ముందు శ్రీకంఠం సర్కిల్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రోడ్డు దిగ్బంధం చేపట్టి ఆందోళనను మరింత ఉధృతం చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ మహిళా నేతలు నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్వీ మనోహరి, శశికళ రెడ్డి, జడ్పీ చైర్మన్ గిరిజమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నైరుతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.