రామచంద్రపురం: అమరావతి రాజధాని పేరుతో అసెంబ్లీలో తీర్మానం తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను మరోసారి మోసానికి గురిచేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు, రామచంద్రపురం నియోజకవర్గ సమన్వయకర్త పిల్లి సూర్యప్రకాశ్ తీవ్రంగా విమర్శించారు. పట్టణంలోని గాంధీపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అమరావతికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల అభివృద్ధే తమ లక్ష్యమని తెలిపారు.ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, 2028 నాటికి రాజధానిని పూర్తి చేస్తామని చెబుతూ ఇప్పుడు తీర్మానం ఎందుకు అవసరమైందో చెప్పాలని ప్రశ్నించారు. ఇది కేవలం ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమేనని విమర్శించారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, అమరావతి పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. మొదటి దశలో వేల ఎకరాలు సేకరించినప్పటికీ అభివృద్ధి పనులు పూర్తి చేయలేదని, ఇప్పుడు రెండో దశ పేరుతో మరింత భూమి సేకరణకు ప్రయత్నించడం సరైంది కాదన్నారు. అమరావతి నిర్మాణానికి భారీగా ఖర్చు అవసరమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అది సాధ్యమా అని ప్రశ్నించారు. ప్రజలకు స్పష్టత ఇవ్వకుండా పెద్ద ప్రణాళికలు ప్రకటించడం మోసపూరిత చర్యలేనన్నారు. అమరావతిలో అవినీతి జరుగుతుందనే అంశాన్నే తమ పార్టీ వ్యతిరేకిస్తోందని, రాజధానికి మాత్రం వ్యతిరేకం కాదని మరోసారి స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి అమరావతిలోనే ఇల్లు నిర్మించుకున్నారని గుర్తు చేశారు. ఇక రైతుల సమస్యలపై మాట్లాడుతూ, గతంలో రైతుల నుంచి ఒక్క రూపాయి కూడా వసూలు చేయకుండా పంట బీమా అమలు చేశామని, ఇప్పుడు రైతులనే డబ్బులు చెల్లింపజేసి కూడా నష్టపరిహారం ఇవ్వడం లేదని విమర్శించారు. తుఫానుల వల్ల నష్టపోయిన రైతులకు వెంటనే పంట బీమా డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టౌన్ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్, మండల కన్వీనర్ పోలినాటి వరప్రసాద్, జిల్లా నాయకులు, రైతు విభాగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.