మచిలీపట్నం: జిల్లా రెవెన్యూ యంత్రాంగం తీరుపై కృష్ణా జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పేర్ని నాని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను ఇబ్బంది పెడితే సహించబోమని హెచ్చరించారు. బందరు ఆర్డీవో సాంబశివరావు, ఎమ్మార్వోల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి ప్రభుత్వ దళారులను అడ్డుపెట్టుకుని రెవెన్యూ అధికారులు చిన్న, సన్నకారు రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంపై పీజీఆర్‌ఎస్‌లో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బందరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని కొందరు ఎమ్మార్వోలు, ఆర్డీవో కలిసి ఆక్వా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. చిన్నాపురం, వాడపాలెం, వాడగొయ్యి, కోన, పల్లెతుమ్మలపాలెం, కెపిటి పాలెం, పాతేరు వంటి గ్రామాల్లో ఎకరం, రెండు ఎకరాల రైతులను చెరువుల మరమ్మతులు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మరోవైపు పెద్ద ఎత్తున భూములు ఉన్న వారికి సౌకర్యాలు కల్పిస్తూ, చిన్న రైతులపై ఆంక్షలు విధించడం వికృత ధోరణి అని అన్నారు. చెరువు మరమ్మతులకు ఎకరాకు రూ.50 వేల వరకు, బోరు వేసేందుకు మరో రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. పెదపట్నం, కానూరు గ్రామాల్లో పెద్ద ఎత్తున మడ అడవులను చెరువులుగా మార్చుకుంటున్నా పట్టించుకోకుండా, కోన గ్రామంలో చిన్న రైతును వేధించడం అన్యాయమని ప్రశ్నించారు. ముడుపుల ప్రభావంతో అధికారులు రైతులపై అన్యాయాలకు పాల్పడితే సహించబోమని హెచ్చరించారు. రైతుల హక్కులను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని పేర్ని నాని స్పష్టం చేశారు.