వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా తిరిగి ఇస్తాం

మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వార్నింగ్‌

అనంతపురం: గత ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీని మోసపూరితంగా ఓడించారని, అయితే వచ్చే ఎన్నికల్లో వడ్డీతో సహా తిరిగి ఇచ్చేందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సమయాత్తం కావాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు. అనంతపురంలో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ కూటమి నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి నేతలు “పులివెందుల ఎమ్మెల్యే”, “11 మంది ఎమ్మెల్యేలు” అంటూ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని, వైయ‌స్ఆర్‌ సీపీని కించపరిచే వ్యాఖ్యలు చేయడం వారి భయానికి నిదర్శనమని అన్నారు. “మరి అంత చిన్న పార్టీ అనుకుంటే… వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిని చూసి టీడీపీ కూటమి పెద్దలు ఎందుకు భయపడుతున్నారు?” అని ప్రశ్నించారు.

అనంతపురం అర్బన్ ఫలితాలే నైతిక విజయం
అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలకు కలిపి లక్ష ఓట్లు వచ్చినా, వైయ‌స్ఆర్‌సీపీ అభ్యర్థి అనంత వెంకటరామిరెడ్డి ఒక్కరికి మాత్రమే 80 వేల ఓట్లు వచ్చాయని గుర్తు చేశారు.
ఈ లెక్కలను చూస్తే నైతికంగా ఎవరు గెలిచారో ప్రజలే అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. అక్రమ కేసులపై భయపడాల్సిన అవసరం లేద‌ని వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి అయ్యాక, వైయ‌స్ఆర్ శ్రేణులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా బనాయించిన అక్రమ కేసులన్నింటినీ రద్దు చేస్తారని స్పష్టం చేశారు. “రెడ్ బుక్ రాజ్యాంగానికి, బెదిరింపులకు, తప్పుడు కేసులకు వైయ‌స్ఆర్‌సీపీ కార్యకర్తలు ఎవరూ భయపడొద్దు” అని ధైర్యం చెప్పారు.

కష్టపడే కార్యకర్తలకే ప్రాధాన్యత

వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కష్టపడే కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఉంటుందని, పార్టీ కోసం అహర్నిశలు పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గౌరవం, గుర్తింపు తప్పకుండా లభిస్తుందని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రజల్లోకి వెళ్లి జగన్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమాన్ని విస్తృతంగా చాటిచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.

Back to Top