హత్యా రాజకీయాలపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు 

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఫైర్‌

వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు.

ఎన్టీఆర్‌ వర్ధంతి రోజు చంద్రబాబు ప్రసంగం హేయం

ఆయన నేలబారు, ఛండాల రాజకీయానికి నిదర్శనం

టీజేఆర్‌ సుధాకర్‌బాబు ధ్వజం

ఎన్టీఆర్‌పై చంద్రబాబు ప్రేమ నటన మాత్రమే

ఎన్టీఆర్‌కు వెన్నుపోటుతో పదవి, పార్టీ లాక్కున్నారు

అందుకు లక్ష్మీపార్వతిని బూచిగా చూపిన బాబు

చంద్రబాబుకు నైతికతపై మాట్లాడే హక్కు లేదు  

టీజేఆర్‌ సుధాకర్‌బాబు స్పష్టీకరణ

సాల్మన్‌ కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి

గురజాల ఎమ్మెల్యే, సీఐ, ఎస్‌ఐపై చర్య తీసుకోవాలి

ఆ ముగ్గురిపై ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టాలి 

టీజేఆర్‌ సుధాకర్‌బాబు డిమాండ్‌

సంక్రాంతి సంబరాల్లో కూటమి నేతల దారుణం

యథేచ్ఛగా క్యాసినోలు, కోడి పందేల బరులు

బెల్టుషాప్‌లు. ఏరులై పారిన నకిలీ, కల్తీ మద్యం

వాటన్నింటి నుంచి చంద్రబాబు మళ్లీ డైవర్షన్‌

ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమలో సైతాన్‌ మాటలు

ప్రెస్‌మీట్‌లో తేల్చి చెప్పిన సుధాకర్‌బాబు

తాడేపల్లి:     హత్యా రాజకీయాలపై మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబు నాయుడుకు లేదని, ఎన్టీఆర్‌ వర్ధంతి సభలో ఆయన చేసిన ప్రసంగం పూర్తిగా నేలబారు, ఛండాల రాజకీయానికి నిదర్శనమని వైయస్‌ఆర్‌సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్‌ సుధాకర్‌బాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఎన్టీఆర్‌ పేరును వాడుకుంటూ ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారని ఆరోపించారు.  పిన్నమ్మ తాళిబొట్టు తెంచిన వారితో నేను గొడవ పడాల్సి వస్తుందని, అలాంటి వారితో రాజకీయాలు చేయాల్సి వస్తుందని ఇవాళ చంద్రబాబు అవహేళనగా మాట్లాడారని ఫైర్‌ అయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా చంద్రబాబు తీరు ఉందని దుయ్యబట్టారు.

ప్రెస్‌మీట్‌లో టీజేఆర్‌ సుధాకర్‌బాబు ఏమన్నారంటే..:

ఎన్టీఆర్‌పై చంద్రబాబు ప్రేమ ఓ నటన:
    ఎన్టీఆర్‌పై చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ప్రేమ కేవలం నటన మాత్రమే. ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించిన సమయంలో చంద్రబాబు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నారు, అక్కడ ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత చాలా ఏళ్లకు టీడీపీలో చేరి మెల్లమెల్లగా పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యేగా ఎదిగారు. ఎన్టీఆర్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు లక్ష్మీపార్వతిని బూచిగా చూపించి చంద్రబాబు ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, ఆయన్ను పదవి నుంచి దించి తానే ముఖ్యమంత్రి కుర్చీ ఎక్కిన వాస్తవాలను ప్రజలు మర్చిపోలేదు. ఎన్టీఆర్‌ వారసులు సీఎం కావాల్సిన చోట మధ్యలో పార్టీలో చేరిన చంద్రబాబు ఎలా ముఖ్యమంత్రి అయ్యారో చెప్పాలి, నాడు ఎన్టీఆర్‌ ఐదు నిమిషాలు మాట్లాడాలని వేడుకున్నా నిండుసభలో అవమానించిన ఘటనను గుర్తుచేస్తూ, ఈ నిజాలను ఖండించే ధైర్యం ఉందా?

చంద్రబాబు ఎన్ని తాళిబొట్లు తెంచాడో?:
    వంగవీటి మోహనరంగాను అర్ధాంతరంగా చంపించింది ఎవరు? పల్నాడులో మందా సాల్మన్‌ను హత్య చేసి మా వదిన తాళిబొట్టు తెచ్చించిన దుర్మార్గుడు చంద్రబాబే. పత్తికొండలో చెరుకులపాడు నారాయణరెడ్డిని హత్య చేయించి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తాళిబొట్టు తెచ్చింది నీవు కాదా? వినుకొండలో వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త రషీద్‌ను నడిరోడ్డుపై నరికి చంపింది ఎవరు? ఆ మహిళ తాళిబొట్టు తెచ్చింది ఎవరు? సత్తెనపల్లి నియోజకవర్గంలో నాగమల్లేశ్వరరావును హత్య చేసి ఓ ఆడపడుచు ఉసురు పోసుకున్న వ్యక్తి చంద్రబాబే. ఇలాంటి వ్యక్తి హత్యా రాజకీయాలపై మాట్లాడటం, ఈ రాష్ట్రం వినడం మా దౌర్భాగ్యం. నోటికి వచ్చిన అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటు. ఇవాళ చంద్రబాబు చేసిన ప్రసంగం పూర్తిగా నేలబారు, ఛండాలం రాజకీయం. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్‌ చరిత్ర చదివితే చంద్రబాబు దుర్మార్గమైన రాజకీయ స్వరూపం అర్థమవుతుంది. ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులు కళ్లు తెరవాలి. ఇవాళ ఎన్టీఆర్‌ రాజకీయ వారసులు ఒక్కరూ టీడీపీలో లేరు. హరికృష్ణ కుమారులను రాజకీయాలకు దూరం పెట్టి, ఠక్కుటామరా, గోకర్ల, గజకర్ణ విద్యలతో ఎన్టీఆర్‌ వారసులు ఎదగకుండా చేసినది చంద్రబాబే. 

ఆ కార్యక్రమంలోనూ చంద్రబాబు సైతాన్‌ మాటలు:
    ఇవాళ ఎన్టీఆర్‌ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు సైతాన్‌ మాదిరిగా మాట్లాడారు. చంద్రబాబూ.. ‘నీవు నమ్మిన వేంకటేశ్వరస్వామిపై ప్రమాణం చేసి పల్నాడులో మందా సాల్మన్‌ మరణానికి  తాను కారకుడు కాదని చెప్పగలడా? . సాల్మన్‌ మరణంతో వేలాది మంది ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టారు. ఆ కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఎమ్మెల్యే, సీఐ, ఎస్‌ఐలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ చంద్రబాబు కులాల పేర్లతో రాజకీయాలు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు, చనిపోయిన తరువాత కూడా సాల్మన్‌ కుటుంబానికి న్యాయం చేయకపోవడం దారుణం. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అధికారాన్ని శాశ్వతమని భావించొద్దు. మీకు కేవలం 700 రోజులు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత జగన్‌గారు సీఎం అయ్యాక మీ సంగతి తేలుస్తాం.

వైయస్‌ జగన్‌ చేసిన తప్పేంటి?
    వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తప్పు ఏంటో చంద్రబాబు చెప్పాలి. ఆయన నమ్మిన సిద్ధాంతం ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి కావాలని కోరుకున్నారు. మూడు రాజధానులు ఉంటే బాగుంటుందని చెప్పారు కానీ, అమరావతి రాజధాని కాదని ఎప్పుడూ చెప్పలేదు. అమరావతిలో ఒక్కో చదరపు అడుగుకు రూ.10 వేల ఖర్చు ఎందుకు అవుతోందని వైయస్‌ జగన్‌ ప్రశ్నించారు. ఈ రోజు వరకు చంద్రబాబు ఆ ఖర్చు గురించి సమాధానం చెప్పలేదు. 
    మామూలుగా చదరపు అడుగుకు రూ.2వేల నుంచి రూ.5వేల ఖర్చుతో ఇల్లు కడతారు. రూ.500 కోట్లతో తెలంగాణ సచివాలయం, రూ.700 కోట్లతో పార్లమెంట్‌ భవనం నిర్మించారు. కానీ ఇక్కడ రూ.5 వేల కోట్లు ఖర్చు చేసినా సరైన రోడ్లు కూడా లేవు. ఇదేనా మీరు చూపించే రాజధాని?.
    వైయస్‌ జగన్‌ రాజధాని ఇక్కడే ఉండాలని ఇల్లు కూడా కట్టుకున్నారు. చంద్రబాబు ఇల్లు ఎక్కడ ఉంది? కరకట్టపై ఆయన ఉంటున్నది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఇల్లు. గుంటూరు–మంగళగిరి మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని వైయస్‌ జగన్‌ అన్నదాంట్లో తప్పేం ఉంది? గుంటూరు, మంగళగిరి, విజయవాడ అన్నీ ఒకటే కదా?’’ అని ప్రశ్నించారు. చంద్రబాబు కడుతున్న రాజధాని ఖర్చుపైనే మా అభ్యంతరాలు. ఎన్ని రోజుల్లో రాజధాని కడతారో చెప్పాలి. ఈ రోజుకు రాజధానిలో ఒక్క శాశ్వత భవనం కూడా లేదని చెప్పడానికి సిగ్గుపడాలి.  

ప్రతి దాంట్లో చంద్రబాబు క్రెడిట్‌ చోరీ:
    భోగాపురం ఎయిర్‌పోర్టును తీసుకొచ్చింది వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే. దాన్ని కూడా నేనే కట్టానని చంద్రబాబు క్రెడిట్‌ చోరీ చేస్తున్నారు. 2019–2024 మధ్య ముఖ్యమంత్రి ఎవరు? భోగాపురం ఎయిర్‌పోర్టుకు చంద్రబాబు ఖర్చు చేసింది ఎంత? . అన్ని వర్గాలు, కులాల ప్రజలకు సంక్షేమ పథకాల ద్వారా లక్షలాది రూపాయలు నేరుగా లబ్ధిదారులకు అందించిన చరిత్ర వైయస్‌ జగన్‌దే.

సంక్రాంతి పేరుతో ప్రజాధనం లూటీ:
    ఈ రోజు చంద్రబాబు ప్రజలకు పెద్ద చిప్ప ఇచ్చారు. ప్రజల్లో కొనుగోలు శక్తి తగ్గిపోయింది. సంక్రాంతి పేరుతో ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఒక్క క్వార్టర్‌ మద్యంపై రూ.50 మార్జిన్‌ టీడీపీ నేతలు తీసుకుని దోపిడీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్‌ షాపులు, పర్మిట్‌ రూమ్‌లతో మద్యం ఏరులై పారుతోంది, దీనికి తోడు సంక్రాంతి సీజన్‌లోనే భారీ మద్యం స్కామ్‌ జరిగింది. యథేచ్చగా కోడి పందేలు, క్యాసినోలు నిర్వహించారు. సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రజాప్రతినిధులు బట్టలు విప్పి డ్యాన్స్‌లు వేశారు. దళితులపై దాడులు జరుగుతున్నాయి. సంక్షేమ పథకాలు ఒక్కటీ లేవు. ఇవన్నీ డైవర్ట్‌ చేయడానికి వర్ధంతి సభలకు వెళ్లి ఎన్టీఆర్‌ మహానాయకుడని పొగడ్తలు. ఎన్టీఆర్‌ మహా తేజోమయుడైతే ఆయనపై చెప్పులు ఎందుకు వేశారు? అర్ధాంతరంగా సీఎం పీఠం నుంచి ఎందుకు దించారు? వేంకటేశ్వరస్వామి సాక్షిగా పెళ్లి చేసుకున్న లక్ష్మీపార్వతిని ఎందుకు ఎన్టీఆర్‌ భార్యగా గుర్తించడం లేదు?. అవసరమైనప్పుడు ఎన్టీఆర్‌ బొమ్మను వాడుకుని, అవసరం తీరాక వదిలేస్తున్నారు.

ఇక మిగిలింది 700 రోజులే:
    మళ్లీ మళ్లీ చెబుతున్నాం ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డే. రాసిపెట్టుకోండి. మీకు కేవలం 700 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ 700 రోజుల్లో ప్రజలకు మేలు చేయండి. లేదా, చేతులు కట్టుకుని కూర్చోండి. మమ్మల్ని నిందిస్తూ నోరు పారేస్తే ఖబర్దార్‌.. అని టీజేఆర్‌ సుధాకర్‌బాబు హెచ్చరించారు.

Back to Top