నరసరావుపేట: గురజాల అభివృద్ధి, ఎమ్మెల్యే హత్యా రాజకీయాలు, పల్నాడు ఫ్యాక్షన్, ప్రభుత్వ సంక్షేమం.. దేనిపైన అయినా ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ తో తాను చర్చకు సిద్ధమేనని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. నరసరావుపేటలోని తన నివాసంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ యరపతినేని ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేసి ప్రతి గ్రామంలోనూ ప్రజల మధ్య అశాంతికి కారణమయ్యాడని ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అమాయకులను బలి తీసుకోవడం రాజకీయం కాదని, దమ్ముంటే పల్నాడు గ్రామాలను అభివృద్ధి బాట పట్టించి శాంతి నెలకొల్పుదామని పిలుపునిచ్చారు. దమ్ముంటే తన ఆరోపణలకు దీటుగా సమాధానం చెప్పాలని, వ్యక్తిగత విమర్శలతో రెచ్చగొట్టే కార్యక్రమాలు మానుకోవాలని హితవుపలికారు. గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల, దాచేపల్లి మండలాల్లో డయేరియాతో చనిపోయిన ఏడుగురికి ప్రభుత్వం తరఫున ఏడాదిన్న అవుతున్నా ఇంతవరకు ఎక్స్‌గ్రేషియా ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించారు. మందా సాల్మన్ హత్యకు ఎమ్మెల్యే యరపతినేని, సీఎం చంద్రబాబుదే బాధ్యత అని ఆరోపించారు. దేశంలో తొలిసారిగా అంత్యక్రియలకు ఆధార్ కార్డు చూపించాల్సిన దౌర్భాగ్య స్థితికి రాష్ట్రాన్ని తీసుకెళ్లినందుకు వారు సిగ్గుపడాలని మండిపడ్డారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో చేసిన పనులకే ఎమ్మెల్యే యరపతినేని శంకుస్థాపనలు చేసుకుంటున్నాడని చెప్పిన మహేష్‌రెడ్డి.. ఎమ్మెల్యేకు చేతనైతే వైయస్ఆర్‌సీపీ హయాంలోనే 60 శాతం పూర్తయిన గురజాల మెడికల్ కాలేజీని పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే... ● అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పరాకాష్ట 1994లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన అతికొద్ది కాలంలోనే ఆయనకి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడు. ఈనాడులో తప్పుడు వార్తలు రాయించి ఎన్టీఆర్ వ్యక్తిత్వ హననం చేశాడు. వైస్రాయ్ హోటల్ లో ఉన్న ఎమ్మెల్యేలతో మాట్లాడటానికి వెళ్లిన ఎన్టీఆర్ మీద చెప్పులు వేయించాడు. ఈనాడును అడ్డం పెట్టుకుని సీఎం కుర్చీ కోసం చంద్రబాబు చేసిన వికృత రాజకీయ క్రీడకి ఎన్టీఆర్ బలైపోయాడు. పిల్లనిచ్చిన కృతజ్ఞత కూడా లేకుండా చంద్రబాబు తనకు చేసిన ద్రోహాన్ని అనుక్షణం తలచుకుని మనోవేదనతో ఎన్టీఆర్ కన్నుమూశారు. తన చివరి రోజుల్లో చంద్రబాబు గురించి ఎన్టీఆర్ మాట్లాడిన మాటల్ని తెలుగు ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఎన్టీఆర్ బతికున్నప్పుడు చనిపోయేదాకా వేధించిన చంద్రబాబు.. తీరా చనిపోయాక వర్థంతి, జయంతుల పేరిట ఆయన మీద ప్రేమ ఒలకబోస్తున్నాడు. చంద్రబాబుకి నిజంగా ఎన్టీఆర్ మీద అభిమానం ఉంటే ఆయన తీసుకొచ్చిన మద్యపాన నిషేధం, రూపాయికే కిలో బియ్యం పథకాలను ఎత్తేవాడే కాదు. తన రాజకీయ మనుగడ కోసం అవసరమైనప్పుడు ఎన్టీఆర్ పేరుని జపం చేస్తున్నాడు. తిట్టిన వారినే పొగడటం, తిట్టిన పార్టీతోనే పొత్తులు పెట్టుకోవడం.. అవసరానికి సిద్ధాంతాలు మార్చడం చంద్రబాబు నైజం. అవకాశవాద రాజకీయాలకు చంద్రబాబు పరాకాష్ట. ● ఎక్కడా సంక్రాంతి శోభ కనిపించడం లేదు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు అమలు చేయలేదు. హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తున్న వైయస్ఆర్‌సీపీ నాయకుల మీద చంద్రబాబు అక్రమ కేసులు పెడుతున్నాడు. రైతులు పండించే పంటలకు కూడా గిట్టుబాటు ధరలు లేవు. రాష్ట్రంలో ఎక్కడా సంక్రాంతి శోభ కనిపించడం లేదు. ఆ రోజున ఎలాగైతే ఎల్లో మీడియాలో తప్పుడు కథనాలు రాయించి ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని హననం చేశాడో, వైయస్ఆర్ సీఎం అయ్యాక అదే విధానాలు అవలంభించాడు. ఇదే చంద్రబాబు.. వైయస్ జగన్ గారు పార్టీ పెట్టక ముందు నుంచే వైయస్ జగన్ గారి వ్యక్తిత్వం మీద దాడిని మొదలుపెట్టాడు. ఎల్లో మీడియా కుట్రలను చేదించి ప్రజలకు నిజాలను నిక్కచ్చిగా తెలియజేస్తుంది కాబట్టే సాక్షి మీద చంద్రబాబు నిత్యం విషం కక్కుతున్నాడు. ఆ రోజుల్లో సాక్షి అనే పత్రిక ఉంటే ఎన్టీఆర్‌కి వెన్నుపోటు తప్పిపోయేదేమో. కూటమి పాలనలో ఏ ఒక్క పథకం పేదలకు అందడం లేదు. ● మందా సాల్మన్ చేసిన తప్పేంటి? మందా సాల్మన్ అనే దళితుడిని రాడ్లు, కర్రలతో దాడి చేసి చంపితే ఈ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్టు కూడా లేదు. పైగా సిగ్గులేకుండా అపస్మారక స్థితిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న అతడిపైనే కేసులు పెట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గ్రామంలో అడ్డుకుపెట్టకుండా అడ్డుకున్నది కాకుండా ఆఖరుకి స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకుండా అడ్డుకోవాలని చూశారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఇంతలా రాజకీయాలు చేయాలా? సాల్మన్ సొంతూరికి రాకూడదా? తన భార్యను చూడటానికి వెళ్లడం ఆయన చేసిన తప్పా? మందా సాల్మన్‌ది ఖచ్చితంగా ప్రభుత్వ హత్యే. దీనికి ఎమ్మెల్యే యరపతినేని, సీఎం చంద్రబాబుదే బాధ్యత. వైయస్ఆర్‌సీపీ హయాంలో పల్నాడు జిల్లాలో ఇంటింటికీ అభివృద్ధిని పరిచయం చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల కాలంలో జిల్లాలో ఎక్కడా అభివృద్ధి ఆనవాళ్లు కనిపించడం లేదు. వైయస్ జగన్ ప్రారంభించిన మెడికల్ కాలేజీని కూడా ఆపేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సాల్మన్ సొంతూరికి రాకూడదా? కలుషిత తాగునీరు తాగి గురజాల నియోజకవర్గంలో డయేరియాతో ఏడుగురు చనిపోయారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో కూడా సురక్షితమైన తాగునీరు కూడా అందించలేకపోవడం ప్రభుత్వ చేతకానితనం కాదా? బాధిత కుటుంబాలకు ఇంతవరకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించలేదు. ఎమ్మెల్యే యరపతినేని వైఫల్యాలను ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పుకోలేక నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నాడు. గురజాల నుంచి గెలిచి గుంటూరులో కాపురం ఉంటున్న యరపతినేని నా గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. 2019-24 మధ్య పిన్నెల్లి గ్రామంలో అడుగుపెట్టడానికే భయపడిన యరపతినేని.. నేను పిన్నెల్లి మెయిన్ రోడ్డులో వెళ్లలేదని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. దేశంలో తొలిసారిగా అంత్యక్రియలకు ఆధార్ కార్డు చూపించాల్సిన దౌర్భాగ్య స్థితికి రాష్ట్రం వెళ్లిపోయింది. ● యరపతినేని అరాచకాలపై చర్చకు సిద్ధం యరపతినేనితో ఎక్కడైనా బహిరంగ చర్చకు నేను సిద్ధం. అభివృద్ధి, హత్యలు, ఎమ్మెల్యేగా వైఫ్యల్యాలు, హింస, సంక్షేమం దేని గురించైనా మాట్లాడుకుందాం. వైయస్ఆర్‌సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలకు కూడా సంక్షేమ పథకాలు అందించాం. నాడు అందరూ స్వేచ్ఛగా మైనింగ్ చేసుకుంటే ఇప్పుడు యరపతినేని ఒక్కడే చేసుకుంటున్నాడు. ఏ ఛానెల్‌లో చర్చకు రమ్మన్నా రావడానికి నేను ఎప్పుడూ సిద్ధమే. యరపతినేని ఇంట్లో చర్చ పెట్టినా కాసు మహేష్ రెడ్డి ఒక్కడే వస్తాడు. మెడికల్ కాలేజీ మీద చర్చకు సిద్ధమా అని ప్రశ్నిస్తే ఇంతవరకు యరపతినేని నుంచి సమాధానం లేదు. యరపతినేని శ్రీనివాస్ ఎప్పుడు ఎమ్మెల్యేగా గెలిచినా గురజాలలో ఫ్యాక్షన్ రాజ్యమేలుతుంది. 2009 -14 మధ్య నరేంద్ర మర్డర్ కేసులో యరపతినేని జైలుకు కూడా వెళ్లాడు. 2014-19 మధ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కేసు వేసిన పాపానికి కుందుర్తి గురవాచారి అనే బీసీ నాయకుడు దారుణంగా కొట్టించాడు. 70 ఏళ్ల వయసున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి మీద రేప్ కేసు పెట్టించాడు. ఆయన పార్టీలో ఉన్న కాపు లీడర్ వేమవరం సర్పంచ్ మీద దాడి చేయించాడు. ఆయన్ను చంపినోళ్లను యరపతినేని రక్షించాడు. ఇప్పుడు పిన్నెల్లిలో మందా సాల్మన్‌ను దారుణంగా హత్య చేయించాడు. జూలకల్లులో ఇప్పటికే నలుగురిని కొట్టించాడు. తేలుకుట్లలో వడియరాజు బిడ్డ నాగరాజును దారుణంగా కొట్టించాడు. యరపతినేని రౌడీయిజం గురించి మాజీ ఎమ్మెల్యే మల్లిఖార్జునరావు కొడుకులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. ● మేం చేసిన పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు వైయస్ఆర్‌సీపీ హయాంలో మొదలైన మెడికల్ కాలేజీని మూలనపడేసింది కాకుండా రూ.900 కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నట్టు చెప్పుకుంటున్నాడు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే రూ. 217 కోట్లతో మెడికల్ కాలేజీ పనులు 60 శాతం, ఆస్పత్రి పనులు 90 శాతం పూర్తి చేస్తే పెండింగ్ పనులు చేయడం యరపతినేనికి చేతకావడం లేదు. వైయస్ఆర్‌సీపీ హయాంలోనే పిడుగురాళ్ల రోడ్డు వెడల్పు చేశాం. 25 ఎకరాలు స్థలం సేకరించి మున్సిపల్ ఆఫీసు కడితే దానికి మంత్రితో రిబ్బన్ కటింగ్ చేయించి యరపతినేని తన ఘనతగా చెప్పుకుంటున్నాడు. మా హయాంలో పూర్తిచేసిన జానపాడు బ్రిడ్జినే ఇప్పుడు ప్రారంభించారు. రూ. 15 కోట్లతో ప్రారంభించిన బ్రహ్మానందరెడ్డి పార్కు పనులకు మరోసారి శంకుస్థాపన చేసుకున్నాడు. మేం అమృత్ పథకం కింద తీసుకొచ్చిన తాగునీటి పథకాలకే రివైజ్డ్ ఎస్టిమేట్స్‌తో పనులు ప్రారంభించి శంకుస్థాపనలు చేసుకుంటున్నాడు. డయేరియాతో మరణించిన కుటుంబాలకు ఇప్పటివరకు ఎందుకు పరిహారం ఇవ్వలేదో చెప్పాలి. నియోజకవర్గంలో శాంతి నెలకొనేలా ప్రయత్నించాలే కానీ ఫ్యాక్షన్ రాజకీయాలను ప్రోత్సహిస్తూ కుటుంబాలను ఆగం చేయడం ఇకనైనా మానుకోవాలి. చేతనైతే రాజకీయాలను మార్చాలి. మగతనం, దమ్ము, ఉంటే కక్షలను తగ్గించాలి. రాజకీయాల్లో కొత్త ఒరవడిని తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని కాసు మహేష్ రెడ్డి అన్నారు.