హైదరాబాద్: తనప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం మొదట్నుంచీ చంద్రబాబుకి అలవాటేనని, ఎన్టీఆర్ విగ్రహం పేరుతో ఆయన చేస్తున్న హడావుడి కూడా అలాంటిదేనని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ 2014 లో ముఖ్యమంత్రి అయినప్పుడే నీరుకొండపై ఎన్టీఆర్ విగ్రహం పెడతానని చెప్పి పక్కన భూములు కాజేశాడని, చంద్రబాబుకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఐదేళ్లలో విగ్రహం నిర్మాణం పూర్తి చేయలేడా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్పటికైనా చంద్రబాబు మోసాలను గుర్తించాలని విజ్ఙప్తి చేశారు. చంద్రబాబుకి చేతనైతే మోడీతో మాట్లాడి ఎన్టీఆర్‌కి భారతరత్న ఇప్పించాలని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. తండ్రీకొడుకులు నారా చంద్రబాబు, లోకేష్ రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలపై బీజేపీ నాయకులు స్పందించాలని కోరారు. వారి దోపిడీలు, అరాచకాలపై తాను కూడా ప్రధాని మోడీకి లేఖ రాస్తానని చెప్పారు. జూదాలు, కోడి పందేలు, కేసినోలు, అర్థనగ్న నృత్యాలతో రాష్ట్ర ప్రతిష్టను చంద్రబాబు నడి బజారున నిలబెట్టాడని లక్ష్మీపార్వతి అన్నారు. పాపం పండిన రోజు చంద్రబాబు సంపాదించిన లక్షల కోట్ల అక్రమ సంపాదన కూడా ఆయన్ను కాపాడలేదని, నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన కాళ్లకే చుట్టుకుని ఆయన్ను జైలుపాలు చేయడం ఖాయమని హెచ్చరించారు. ఆమె ఇంకా ఏమన్నారంటే... ● ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు ద్రోహాలను గుర్తుకు తెచ్చుకోవాలి ఆరోగ్యశ్రీకి ఎన్టీఆర్ పేరు లేకుండా చేయాలని చూసిన వ్యక్తి చంద్రబాబు. జయంతి, వర్ధంతి వచ్చినప్పుడల్లా ఎన్టీఆర్ గారి మీద చంద్రబాబు ప్రేమ ఒలకబోస్తుంటాడు. ఆయన చనిపోయిన ఇన్నేళ్ల తర్వాత భారీ విగ్రహం పెడతానని ప్రకటనలు చేయిస్తున్నాడు. గతంలోనూ 2014 అధికారంలోకి వచ్చినప్పుడు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్రహం పెడతానని హడావుడి చేసి చుట్టుపక్కల భూములు కాజేశాడు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో రాజకీయాలు చేస్తున్నాడు. చేతనైతే ఎన్టీఆర్‌కి భారత రత్న ఇప్పించాలి. నిజంగా ఎన్టీఆర్ మీద గౌరవం ఉంటే గతంలోనే విగ్రహం పెట్టేవాడు. తన ప్రతిష్ట దిగజారుతున్నప్పుడల్లా ఎన్టీఆర్ పేరును వాడుకుంటాడు. ఎన్టీఆర్ ఆశయాలను కాపాడతానని నక్క వినయాలు ప్రదర్శిస్తున్నాడు. చంద్రబాబుకి చేతనైతే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పెండింగ్ పనులు పూర్తి చేయాలి. నిజమైన ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు మోసాలను ఇప్పటికైనా గ్రహించాలి. చంద్రబాబు వల్ల తానెంత మానసిక క్షోభ అనుభవించిందీ స్వయంగా ఎన్టీఆర్ చెప్పిన మాటలను గుర్తుకుతెచ్చుకోవాలి. చంద్రబాబు మీడియా చెబుతున్న అబద్ధాలను విశ్లేషించుకోవాలి. చరిత్రను వక్రీకరించి ఎన్టీఆర్‌కి చంద్రాబాబు చేసిన ద్రోహాలను కప్పిపుచ్చుకోలేడు. ప్రతి ఎన్టీఆర్ అభిమానీ చంద్రబాబు గురించి చెప్పిన మాటలను మననం చేసుకోవాలి. చివరి క్షణాల్లో ఎన్టీఆర్‌కి కంటతడి పెట్టించిన చంద్రబాబు అరాచకాలను చరిత్ర ఎప్పటికీ మరిచిపోదు. వెన్నుపోటు అనే పదం వాడినప్పుడల్లా చంద్రబాబు చేసిన ద్రోహమే తెలుగు ప్రజలకు గుర్తుకొస్తుంది. భవిష్యత్తులో చంద్రబాబు చరిత్ర నీచంగా రాయబడుతుంది. ● నిజాయితీపరుడు కేసులను మాఫీ చేయించుకోడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలవుతున్నా ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. మోసపు హామీలతో రైతులు, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు దారుణంగా మోసం చేశాడు. అధికారం చేపట్టిన క్షణం నుంచి దోపిడీతో చంద్రబాబు తన సొంత ఖజానా నింపుకోవడం తప్పించి ఇచ్చిన హామీలు చేయడంపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. గత మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఎలా వ్యవహరించాడో ఇప్పుడూ అదేవిధంగా వ్యవహరిస్తున్నాడు. మోసపు హామీలతో అధికారంలోకి రావడం వచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని దోచుకోవడమే చంద్రబాబు విధానం. ఇప్పుడు చంద్రబాబుకి తోడుగా ఆయన కొడుకు నారా లోకేష్ కూడా తయారైపోయాడు. ఆఖరుకి తన మీద నమోదైన అవినీతి కేసుల్లో జైలు శిక్ష కూడా అనుభవించిన చంద్రబాబు, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వాటిని కొట్టివేయించుకునేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటు. న్యాయస్థానాలు, చట్టాల మీద గౌరవం ఉన్న వ్యక్తి అయితే న్యాయస్థానాల్లో కేసులను ఎదుర్కొనేవాడు. ఇలా అడ్డదారులు తొక్కేవాడే కాదు. ● చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు విలువలు, విశ్వసనీయతకు కట్టుబడిన గొప్ప నాయకుడు వైయస్ జగన్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి బాధ్యతగా పాలన అందించారు. మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌గా భావించి అమలు చేయడం ఆషామాషీ కాదు. ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధి, పాలనలో నిజాయితీ ఉంటేనే అది సాధ్యం. ఏకకాలంలో అభివృద్ధి, సంక్షేమం అందించిన నిజమైన విజనరీ వైయస్ జగన్ గారు. వైయస్‌ఆర్‌సీపీ హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని తప్పుడు ప్రచారం చేశారు. సంపద సృష్టిస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రాష్ట్రంలో విలువైన భూ సంపదను తన బినామీలకు రాసిచ్చేస్తున్నాడు. నాలుగోసారి ముఖ్యమంత్రిగా చేస్తున్న చంద్రబాబు ఏనాడూ ప్రజా సంక్షేమం గురించి ఆలోచించలేదు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి తన ఆస్తులను పెంచుకున్న స్వార్థ పరుడు చంద్రబాబు. చంద్రబాబు మోసాలను ప్రజలు గుర్తించారు. వైయస్ జగన్‌ని సీఎం చేయాలన్న కృతనిశ్చయంతో ప్రజలున్నారు. ఈవెంట్‌ల పేరుతో హడావుడి చేస్తున్నాడు. జూదాలు, కోడి పందేలు, కేసినోలు, అర్థనగ్న నృత్యాలతో రాష్ట్ర ప్రతిష్టను నడి బజారున నిలబెట్టాడు చంద్రబాబు. పాపం పండిన రోజు చంద్రబాబు సంపాదించిన ఈ లక్షల కోట్ల అక్రమ సంపాదన కూడా ఆయన్ను కాపాడలేదు. నారా లోకేష్ అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన కాళ్లకే చుట్టుకుని ఆయన్ను జైలుపాలు చేయడం ఖాయం. ● తండ్రీకొడుకుల అరాచకాలపై ప్రధానికి లేఖ రాస్తా భార్యను చూడటానికి గ్రామానికి వచ్చిన మందా సాల్మన్ ని రాడ్లతో కొట్టి చంపడం దుర్మార్గం. ఇంత నీచమైన పరిపాలన ఏపీలో ఎప్పుడూ జరగలేదు. ఇలాంటి దుర్మార్గాలను సహిస్తున్న మోడీకి లేఖ రాస్తా. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ చేస్తున్న అరాచకాల మీద ప్రధాని దృష్టిపెట్టాలి. రాష్ట్రంలో సామాన్యులకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీ నాయకులు పెదవి విప్పాలి. వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం రాగానే తండ్రీకొడుకుల అరాచాకలపై తక్షణ విచారణ జరిపి చట్టపరంగా వారిని శిక్షించకుండా వదిలిపెట్టమని లక్ష్మీ పార్వతి అన్నారు.