సర్వేపల్లిలో సరికొత్త దోపిడి 

నెల్లూరు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ద‌న్‌రెడ్డి 

ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరు జిల్లా:  శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, వెంకటాచలం మండలం కసుమూరు, శ్రీరామపురం గ్రామాల్లో పర్యటించిన మాజీ మంత్రి, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సర్వేపల్లిలో కల్తీ మద్యం తరహాలోనే ఇప్పుడు కల్తీ డీజిల్ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని ఆయన ఆరోపించారు. డీజిల్‌ను కల్తీ చేసి ట్యాంకర్లలో నింపి, అధికార పార్టీకి చెందిన ముఠా అనధికారికంగా విక్రయిస్తోందని విమర్శించారు. పెట్రోల్ బంకులతో సంబంధం లేకుండా లారీలు, ట్రాలీలు, ట్యాంకర్ల యజమానులను బెదిరించి తమ వద్దే డీజిల్ కొనాలని ఆదేశాలు జారీ చేస్తూ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ ఆస్తులు, సహజ వనరులు నిలువ దోపిడీకి గురవుతున్నా అభివృద్ధి మాత్రం ఎక్కడా కనిపించడం లేదని కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ, దేవాదాయ, రైల్వే ఆస్తులతో పాటు ప్రజల ఆస్తులకు కూడా భద్రత లేకుండా పోయిందని అన్నారు. కాకుటూరు శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు విక్రయించినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విడ్డూరమని వ్యాఖ్యానించారు.

పోలీసులకు ఫిర్యాదు రావడంతో అక్రమంగా డీజిల్ విక్రయిస్తున్న వాహనాన్ని స్టేషన్‌కు తీసుకువెళ్లినప్పటికీ, ముఖ్య నాయకుల ఒత్తిళ్లతో గుట్టుచప్పుడు కాకుండా వదిలివేశారని ఆరోపించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలు రోజురోజుకీ విస్తరిస్తున్నా పోలీసులు ప్రేక్షక పాత్రకే పరిమితమవడం అన్యాయమని అన్నారు.

పొదలకూరులో లేఅవుట్ యజమానులను బెదిరించి, కేసులు బనాయించి రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని కాకాణి ఆరోపించారు. సర్వేపల్లి నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ, దేవాదాయ భూములను లేఅవుట్ యజమానులు స్వాధీనం చేసుకుని నేతలకు వాటాలు పంచుతున్నారని విమర్శించారు.

గొలగమూడి ప్రాంతంలో నెలకు ఐదు లక్షల రూపాయలు వసూలు చేస్తూ సంత నిర్వహించి గోవధకు పాల్పడుతున్నారని, పామాయిల్ అసోసియేషన్ పేరుతో ట్యాంకర్ల యజమానులకు తీవ్ర అన్యాయం చేస్తూ నిత్యం కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ నిధులతో పాటు సీఎస్‌ఆర్ నిధులపై కూడా కన్నేసి, జిల్లా కలెక్టర్ జోక్యం లేకుండానే యథేచ్ఛగా దోపిడీ జరుగుతోందని అన్నారు.

బూడిద తరలించే బంకర్ల నుంచి వాహనానికి రూ.300 చొప్పున వసూలు చేసి ప్రతిరోజూ రూ.45 వేల వరకు ముఖ్య నాయకుడి కార్యాలయానికి ముట్టచెబుతున్నామని స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలే బహిరంగంగా మాట్లాడుతున్నారని కాకాణి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు, చిరు ఉద్యోగుల బదిలీల విషయంలో కూడా శాతం లెక్కన వసూలు చేస్తున్నారనే విమర్శలు వాస్తవమని అన్నారు.

సర్వేపల్లిలో ఇసుక, గ్రావెల్, మట్టి యథేచ్ఛగా దోచుకుంటూ చివరకు థర్మల్ విద్యుత్ కేంద్రాల్లోని బూడిదను కూడా అమ్ముకుంటున్నారని ఆరోపించారు. ప్రజలు అప్రమత్తంగా లేకపోతే తమ సొంత ఆస్తులు కూడా దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ “తస్మాత్ జాగ్రత్త” అని పిలుపునిచ్చారు.

అనంతరం అనారోగ్యానికి గురైన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కసుమూరు గ్రామ సర్పంచ్ కడివేటి శివ తండ్రి శిద్దయ్యగారిని, నెల్లూరి రమణమ్మ గారిని పరామర్శించారు. అలాగే ఇటీవల మృతి చెందిన కడివేటి హేమంత్, కడిమి మస్తానమ్మల కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Back to Top